CWC Meeting: ఎన్డీయే సర్కార్‌ను మరింత ఇరుకున పెట్టేలా కాంగ్రెస్ పార్టీ ప్లాన్ చేస్తోందా? సీడబ్ల్యూసీ మీటింగ్ కర్ణాటకకు మారడం వెనుక ఏం జరిగింది? ప్రతీ రాష్ట్రంలో ఈ తరహా మీటింగ్‌లకు ప్లాన్ చేస్తోందా? ఏఐసీసీ కీలక నేతలు రానుండడంతో రేవంత్ మంత్రి వర్గం విస్తరణకు సంకేతాలు హైకమాండ్ ఇస్తుందా? ఇదే ప్రశ్నలు చాలామంది నేతలను వెంటాడుతోంది.
సీఎం రేవంత్‌రెడ్డి గురువారం బిజీబిజీగా గడపనున్నారు. ఇవాళ ఉదయం టాలీవుడ్ ప్రముఖులతో కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం కానున్నారు. చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలను ముఖ్యమంత్రి వద్ద ప్రస్తావించనున్నారు. ఈ సమావేశం తర్వాత నేరుగా కర్ణాటకకు వెళ్లనున్నారు.
కర్ణాటకలోని బెల్గాంలో గురువారం సీడబ్ల్యూసీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం మూడు గంటలకు మీటింగ్ జరగనుంది. దీనికి తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితోపాటు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితోపాటు ప్రత్యేక ఆహ్వానితుల హోదాలో వంశీచంద్ హాజరకానున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో నేరుగా బెల్గాం వెళ్లనున్నారు.
కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగనుంది. పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహల్, ప్రియాంకలతో మరికొందరు సీనియర్లు రానున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పీసీసీ చీఫ్‌లు ప్రత్యేక ఆహ్వానితులు హాజరుకానున్నారు.
ALSO READ: ఇకపై అవినీతికి నో ఛాన్స్.. ఏఐతో అన్ని కనిపెడతాం జాగ్రత్త అంటున్న రాష్ట్ర సర్కార్
రాబోయే రోజుల్లో మోదీ సర్కార్‌ను ధీటుగా ఎదుర్కొనేలా వ్యూహాలు రచించనున్నారు. అంబేద్కర్ వ్యవహారంతో ఎన్డీయే చిక్కుల్లో పడింది. దీనిపై పార్టీ నేతలు ఇంటా బయటా నిరసనలు చేయడంతో దేశవ్యాప్తంగా ఆ పార్టీకి పాజిటివ్ సంకేతాలు వస్తున్నాయి. దీన్ని గమనించిన కాంగ్రెస్ హైకమాండ్ వ్యూహాలకు సిద్ధమైంది.
రానున్న సార్వత్రిక ఎన్నికలకు ఇప్పటినుంచే ప్రణాళికలు రచించనుంది సీడబ్ల్యూసీ. వివిధ రాష్ట్రాల పార్టీ పనితీరును నేతల నుంచి అడిగి తెలుకోనున్నారు. ముఖ్యంగా జమిలి ఎన్నికలు, బీసీల రిజర్వేషన్లు, జీఎస్టీ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కొద్దిరోజులుగా జీఎస్టీ అంశాన్ని ప్రియాంకగాంధీ ఎత్తుకున్న విషయం తెల్సిందే.
ఇదిలావుండగా ఏఐసీసీ పెద్దలు బెల్గాంకు రానుండడంతో పనిలో పనిగా రేవంత్ మంత్రి వర్గ విస్తరణ అంశాన్ని ప్రస్తావించే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి హస్తినకు వెళ్లిన ప్రతీసారి ఆశావహులు గంపెడంత ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ అంశం కూడా ప్రస్తావనకు రావచ్చని అంటున్నారు.
గతంలో కీలక నేతలు అందుబాటులో లేకపోవడంతో మంత్రివర్గ విస్తరణ వాయిదా పడుతూ వస్తోంది. ఈసారి హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం ఖాయమనే చర్చ సాగుతోంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి అయ్యింది. ఈ క్రమంలో మంత్రి వర్గ విస్తరణ సుముఖంగా ఉండవచ్చని అంటున్నాయి పార్టీ వర్గాలు.