CM Progress Report: ఈవారం సీఎం రేవంత్ షెడ్యూల్ బిజీబిజీగా గడిచింది. కీలక రివ్యూలు, సమీక్షా సమావేశాలు చేశారు. ప్రభుత్వ భూముల పరిరక్షణపై బోర్డు ఏర్పాటుకు నిర్ణయం, విద్యాసంస్థల్లో విద్యార్థులు, అధ్యాపకులకు ఫేషియల్ రికగ్నేషన్ ఏర్పాటుకు ఆదేశాలు, తెలంగాణకు గేట్ వే గా జపాన్ సెమీకండక్టర్లు, నెక్ట్స్ లెవెల్ లో స్పోర్ట్స్ హబ్, వందేళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూసీ పునరుజ్జీవం దిశగా అడుగులు వేయడం ఇలాంటి కీలక నిర్ణయాలు జరిగాయి.
24-08-2025 ఆదివారం ( సినీ పరిశ్రమకు సహకారం )
సినిమా పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని రేవంత్ రెడ్డి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ నిర్మాతలు, దర్శకులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు సీఎంను ఈనెల 24న ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పరిశ్రమ సమస్యలు, సినీ కార్మికుల సమ్మె తదితర అంశాలపై సీఎం దృష్టికి తీసుకెళ్లారు. సినిమా కార్మికుల విషయంలో నిర్మాతలు మానవత్వంతో వ్యవహరించాలని సీఎం చెప్పారు. సినీ కార్మికులను, నిర్మాతలను ప్రభుత్వం కాపాడుకుంటుందని, నిర్మాతలు, కార్మికులు, ప్రభుత్వం కలిసి సమగ్రమైన విధానం తీసుకొస్తే బాగుంటుందని అన్నారు. సమస్యలపై సినిమా కార్మికులను కూడా పిలిచి మాట్లాడుతానన్నారు. స్కిల్స్ పెంచుకోవడానికి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో సినిమా పరిశ్రమ కోసం అవసరమైన ఏర్పాట్లు చేస్తామన్నారు.
24-08-2025 ఆదివారం ( బయోడిజైన్ బ్లూప్రింట్ ఆవిష్కరణ )
హైదరాబాద్ లో ఏఐజీ హాస్పిటల్స్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఆసియా పసిఫిక్ బయోడిజైన్ సమ్మేళనం 2025 లో సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 24న పాల్గొన్నారు. ఆ సందర్భంగా బయోడిజైన్ బ్లూప్రింట్ ను ఆవిష్కరించారు. ఇండియాలో ఆరోగ్య సంరక్షణ, ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించడానికి స్వదేశీ పరిశోధనలు, ఆవిష్కరణలు ఎంతో అవసరమన్నారు సీఎం. వివిధ దేశాలకు చెందిన బయోడిజైన్ సంస్థల ప్రతినిధులు, డాక్టర్లు, నిపుణులు ఈ సదస్సులో పాల్గొన్నారు. బయో టెక్నాలజీ, ఫార్మా, మెడికల్ టెక్నాలజీ రంగాల్లో కొత్త ఆవిష్కరణలకు ప్రభుత్వం అన్ని విధాలుగా మద్దతు ఇస్తుందన్నారు. లైఫ్ సైన్సెస్ రంగంలో జాతీయ స్థాయిలో తెలంగాణ ఉన్నత స్థానంలో ఉందని, ముఖ్యంగా డయాగ్నస్టిక్ పరికరాలు, ఇమేజింగ్ టెక్నాలజీ, ఇంప్లాంట్ టెక్నాలజీ, సర్జికల్ ఎక్విప్ మెంట్స్, డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్‌లో తెలంగాణకు గణనీయమైన పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సుల్తాన్‌పూర్‌లో దేశంలోనే అతిపెద్ద మెడికల్ డివైజెస్ పార్క్‌ను అత్యున్నత ప్రమాణాలతో ఏర్పాటు చేశామని, అక్కడ 60 కి పైగా ప్రపంచ, దేశీయ కంపెనీలు ఇప్పటికే పని చేస్తున్నాయన్నారు.
25-08-2025 సోమవారం ( త్వరలో 40 వేల ఉద్యోగాలు )
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన కొత్తలో మెగా డీఎస్సీ పేరిట నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచర్ ఉద్యోగాలు ఇచ్చింది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించిన నోటిఫికేషన్లకు సంబంధించి కాల్ లెటర్స్ అందించింది. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణ, బీసీ కోటా మ్యాటర్స్ కోర్టుల్లో ఉండడంతో అందరికీ న్యాయం చేసి ఉద్యోగాల భర్తీ చేయాలని అనుకుంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు ఆలస్యమవుతున్నాయి. జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ ఈ కారణంతోనే కాలేదు. అయితే ఉద్యోగాల భర్తీ విషయంలో తాజాగా సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే 40 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఓయూలో ప్రకటించారు. ఉస్మానియా యూనివర్శిటీలో 80 కోట్లతో నిర్మించిన హస్టల్ భవనాలను ప్రారంభించిన సందర్భంగా ఈ విషయాలు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే 55 వేల ఉద్యోగాలిచ్చామని సీఎం రేవంత్ తెలిపారు. 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామన్నారు.
25-08-2025 సోమవారం ( ఓయూకు మహర్దశ )
దాదాపు రెండు దశాబ్దాలుగా ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ కార్యక్రమాల్లో ఏ సీఎం పాల్గొనలేదు. 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఓయూలో పర్యటించారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యార్థినీ విద్యార్థుల కోసం నూతన హాస్టల్ భవనాలు, లైబ్రరీ రీడిండ్ రూమ్ నిర్మాణాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. అలాగే కొత్తగా నిర్మించిన దుందుభి, భీమ హాస్టల్ భవనాలకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీ ఠాగూర్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఎం పాల్గొన్నారు. తెలంగాణ చరిత్రకు సజీవ సాక్ష్యమైన ఉస్మానియా యూనివర్సిటీని ప్రపంచంలోనే ఒక అద్భుతమైన విద్యాలయంగా తీర్చిదిద్దాలని చెప్పారు. స్టాన్‌ఫోర్డ్, ఆక్స్‌ఫర్డ్ వర్సిటీల ప్రమాణాలను మించి ప్రపంచంతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నామన్నారు. 2034 నాటికి తెలంగాణ 1 ట్రిలియన్ డాలర్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగాలంటే అంతా చదువుకోవాలన్నారు.
26-08-2025 మంగళవారం ( తైవాన్ కంపెనీలతో మీటింగ్స్ )
తెలంగాణలో సెమికండక్టర్ల నిపుణులను పెంచేందుకు తైవాన్ కంపెనీలతో సందీప్ కుమార్ మక్తాల నేతృత్వంలోని టీ-చిప్ టెక్నాలజీ–చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రాం ప్రతినిధి బృందం కీలక చర్చలు జరిపింది. ఏఆర్‌ఎం, సినాప్సిస్, టీఎస్‌ఎంసీ, ఫారాడే టెక్నాలజీ వంటి ప్రముఖ సంస్థలతో టీ–చిప్ సమావేశమయ్యింది. తెలంగాణను గ్లోబల్ సెమీకండక్టర్ రంగంలో కీలకంగా మార్చడమే లక్ష్యంగా అడుగులు పడుతున్నాయి. చిప్ డిజైన్, తయారీ, నైపుణ్య మార్పిడి, సాంకేతిక సహకారం వంటి అంశాలపై తైవాన్ కంపెనీలు, టీ-చిప్ టీం మధ్య చర్చలు జరిగాయి. ఏఆర్‌ఎం తైవాన్‌తో విద్య, పరిశోధన, స్టార్టప్ రంగాల అనుసంధానంపై, సినాప్సిస్‌తో చిప్ ట్రైనింగ్, ఇంక్యూబేటర్ సాయం వంటి అంశాలపై చర్చ జరిగింది.
27-08-2025 బుధవారం ( మూసీ మెరిసేలా )
హైదరాబాద్ నగరం వచ్చే వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక ప్రాంతం అభివృద్ధి జరగాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పారు. మూసీ నది అభివృద్ధి ప్రణాళికపై ముఖ్యమంత్రి జూబ్లీహిల్స్ నివాసంలో ఈనెల 27న ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షించారు. గేట్ వే ఆఫ్ హైదరాబాద్, గాంధీ సరోవర్ అభివృద్ధితో పాటు జంక్షన్ల ఏర్పాటు, రోడ్ల అభివృద్ధి వంటి అంశాల్లో సీఎం పలు సూచనలు చేశారు. మూసీ రివర్ డెవలప్‌మెంట్ ప్రణాళికలను అధికారులు వివరించగా, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సిగ్నల్ రహిత జంక్షన్లను ఏర్పాటు చేయాలన్నారు. గాంధీ సరోవర్ అభివృద్ధికి సంబంధించిన పలు డిజైన్లను పరిశీలించారు. అభివృద్ధి పర్యావరణ హితంగా ఉండేలా ప్రణాళికలు ఉండాలని సూచించారు. వీలైనంత త్వరగా డీపీఆర్ రెడీ చేసి పనులు మొదలు పెట్టాలన్నారు.
28-08-2025 గురువారం ( సెమీ కండక్టర్స్ గేట్ వే తెలంగాణ )
జపాన్‌కు చెందిన టోహో కోకి సెయిసాకుషో సంస్థ.. 8 కోట్ల వ్యయంతో భారత్‌లో తొలి సీఎంపీ ప్యాడ్ హబ్‌ను రాష్ట్రంలో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది. ఇందుకు సంబంధించి ఈనెల 28న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో టోహో కోకి సెయిసాకుషో, టీ-వర్స్ మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. జపాన్ సెమీకండక్టర్ సాంకేతిక పరిజ్ఞానానికి తెలంగాణ గేట్ వే గా అభివృద్ధి చెందుతోందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. సెమీకండక్టర్స్ తయారీలో కెమికల్ మెకానికల్ పాలిషింగ్ అన్నది కీలకమైంది. ఈ యూనిట్ తెలంగాణలో రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ హబ్ ఇండియాలో సెమీకండక్టర్ సాంకేతికత అభివృద్ధికి, గ్లోబల్ సెమీకండక్టర్ సప్లై చైన్ లో భారత కంపెనీల భాగస్వామ్యాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన అడుగుగా చెబుతున్నారు. ప్రస్తుతం దేశంలో సీఎంపీ ప్యాడ్లను ఉత్పత్తి చేసే పరిశ్రమలు లేకపోవడం వల్ల ఏటా 100 కోట్ల విలువైన దిగుమతులు చేసుకుంటున్నారు. ఈ హబ్ ఒక ఓపెన్ యాక్సెస్ సౌకర్యంగా పనిచేస్తుంది. ఇక్కడ విద్యార్థులు, రీసెర్చర్లు, స్టార్టప్‌లు CMP టెక్నాలజీని అందిపుచ్చుకోవచ్చు.
28-08-2025 గురువారం ( సీఎం ఏరియల్ సర్వే )
వర్షాలు, వరదలపై అలర్ట్ గా ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హెలికాప్టర్ లో ఏరియల్ సర్వే ద్వారా ఈనెల 28న వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఆ తర్వాత మెదక్ జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో సహాయక చర్యలపై పలు ఆదేశాలు జారీ చేశారు. వరద నష్టంపై నివేదికలు తయారు చేయాలన్నారు. ఆ తర్వాత పోచారం ప్రాజెక్టు, అలాగే కామారెడ్డి జిల్లాలోని వరద ప్రాంతాలను పరిశీలించారు.
28-08-2025 గురువారం ( స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ )
ఖేలో ఇండియా, కామన్‌వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ వంటి క్రీడా పోటీలకు హైదరాబాద్‌ను వేదికగా మార్చాలని తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు తీర్మానం చేసింది. రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని ప్రోత్సహించి, స్పోర్ట్స్ లో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం హైదరాబాద్‌లోని లీలా హోటల్లో జరిగిన తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు మొదటి సమావేశంలో సీఎం మాట్లాడారు. ఐటీ రంగంలోలాగే క్రీడా రంగంలో కూడా తెలంగాణ ప్రఖ్యాతి పొందాలని, హైదరాబాద్ క్రీడా ప్రపంచానికి కేంద్రంగా మారాలన్నారు. ఈ ఏడాది స్పోర్ట్స్ కు కేటాయించిన బడ్జెట్‌ను 16 రెట్లు పెంచినట్లు తెలిపారు. యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలో ఫిజియోథెరపీతో సహా ఇతర క్రీడా సంబంధిత కోర్సులు ప్రవేశపెడతామని తెలిపారు.
29-08-2025 శుక్రవారం ( ఇకపై ఫేషియల్ రికగ్నేషన్ )
పాఠశాలలు మొదలు విశ్వవిద్యాలయాల వరకు ప్రతి విద్యా సంస్థలోనూ మెరుగైన విద్యా బోధన, బోధనలో నాణ్యతా ప్రమాణాలు మరింతగా పెంచాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. పాఠశాలలు, కాలేజీలు, ప్రొఫెషనల్ కాలేజీల్లో విద్యార్థులు, బోధన సిబ్బందికి ఫేషియల్ రికగ్నేషన్ తప్పనిసరి చేయాలని చెప్పారు. ఈ ఫేషియల్ అటెండెన్స్ తో హాజరు శాతం మెరుగుపడటంతో పాటు లోటుపాట్లను అరికట్టవచ్చని అన్నారు. ఐసీసీసీలో ఈనెల 29న సీఎం విద్యా శాఖలపై సమీక్షించారు. విద్యా శాఖ పరిధిలో అదనపు గదులు, వంట గదులు, మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహారీల నిర్మాణం వేర్వేరు విభాగాలు చేపట్టడం సరికాదన్నారు. మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపును గ్రీన్ ఛానల్‌లో చేపట్టాలని, ఈ విషయంలో అలసత్వం చూపొద్దన్నారు. తెలంగాణలోని మహిళా కళాశాలలు, బాలికల పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, ప్రహరీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఇక కీలకమైన కంటైనర్ కిచెన్లకు ప్రాధాన్యమివ్వాలని, వాటిపై సోలార్ ప్యానెళ్లతో అవసరమైన విద్యుత్ వినియోగించుకోవచ్చని సూచించారు. విద్యా రంగంపై పెడుతున్న ఖర్చును తాము ఖర్చుగా కాకుండా పెట్టుబడిగా చూస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్.
30-08-2025 శనివారం ( వస్తోంది భూదాన్ యజ్ఞ బోర్డు )
ప్రభుత్వ భూముల పరిరక్షణే ధ్యేయంగా, భూ సమస్యలకు పరిష్కారం దిశగా ఇప్పటికే భూభారతి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం.. సర్కారీ భూముల రక్షణ దిశగా మరో ముందడుగు వేసింది. గత సర్కార్ రద్దు చేసిన భూదాన్ యజ్ఞ బోర్డును తిరిగి ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బోర్డుకు త్వరలోనే చైర్మన్, సభ్యులను నియమించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రతిపాదనలు రెడీ చేసి పంపాలని రెవెన్యూ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆధీనంలోనో, పేదల చేతుల్లోనో ఉండాల్సిన వేలాది ఎకరాల భూములను రక్షించడంతో పాటు పర్యవేక్షించే లక్ష్యంతో మళ్లీ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1.60 లక్షల ఎకరాల భూదాన్ భూములు ఉన్నాయి. ఇటీవల భూదాన్ భూముల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుండడంతో అసలు క్షేత్రస్థాయిలో భూదాన్ భూములు ఎక్కడెక్కడ, ఎన్ని ఎకరాలు, ఎవరి చేతిలో ఉన్నాయి? అనే వివరాలు తెలుసుకోవడవంతోపాటు అన్యాక్రాంతమైన భూములను తిరిగి వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే భూదాన్ యజ్ఞ బోర్డు ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. చాలా చోట్ల ఇప్పటికే అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగాయి. ప్రస్తుతం భూభారతి పోర్టల్‌లో ఉన్న భూదాన్ భూములకు, భూదాన్ సెక్షన్‌లో ఉన్న రికార్డులకు సరిపోలడం లేదు. రికార్డుల ప్రకారం లక్షా 60 వేల ఎకరాలకు పైగా భూదాన్ భూములు ఉండగా.. భూ భారతి పోర్టల్‌లో కేవలం 35 వేల ఎకరాల భూమి వివరాలు మాత్రమే నమోదైనట్లు తెలిసింది. ఇంకా లక్షా 30 వేల ఎకరాల భూమి వివరాలు పోర్టల్‌లో చేర్చాల్సి ఉంది.
Story By Vidya Sagar, Bigtv