BigTV English

BRS news today : జనగామలో రెడ్ల పంచాయితీ.. అసలేం జరుగుతోంది? ఫుల్ డీటైల్స్

BRS news today : జనగామలో రెడ్ల పంచాయితీ.. అసలేం జరుగుతోంది? ఫుల్ డీటైల్స్
BRS party latest news

BRS party latest news(Telangana news updates):

తెలంగాణలో ఎన్నికల వేడి ముదురుతోంది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో జగగామ జిల్లాలో టికెట్‌ వార్‌ ముదురుతోంది. ఎలక్షన్‌ బరిలో నిలిచేందుకు కాలు దువ్వుతున్న తరుణంలో ఎవరికి వారు టికెట్‌ ఆశిస్తూ.. తమ బలాబలాల నిరూపణకు ఎత్తులకు పై ఎత్తులు వేస్తుండటంతో జనగామ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక ఈ వార్‌ జనగామ నుంచి హైదరాబాద్‌కు చేరడంతో పొలిటికల్‌ హీట్‌ మరింత కాకరేపుతోంది. అసలు జనగామాలో ఏం జరుగుతోంది? జిల్లాను వదిలి భాగ్యనగరానికి చేరడానికి కారణాలేంటి? గులాబీ బాస్‌ మనసులో ఉన్నదెవరు? ప్రజాక్షేత్ర పోరులో నిలిచేదెవరు? అసలు టికెట్‌ లొల్లి ఎందుకు ముదిరింది?


జనగామలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వర్సెస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ ఎపిసోడ్‌ కొనసాగుతోంది. ఎమ్మెల్సీ పల్లా టికెట్‌ ఆశిస్తుండటంతో ఇరువర్గాల మధ్య పోటాపోటీ వాతావరణం నెలకొంది. ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా కొందరు బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే సీక్రెట్‌గా మంతనాలు చేస్తుండగా.. ఎమ్మెల్సీ పల్లాకు టికెట్ కేటాయించాలంటూ కార్యకర్తల నుంచి అభిప్రాయ సేకరణ చేస్తున్నారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తర్వాత వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు ముత్తిరెడ్డి. అంతకుముందు మూడుసార్లు వరుసగా గెలిపించి కాంగ్రెస్ అభ్యర్థి పొన్నాల లక్ష్మయ్యకు హ్యాట్రిక్ ఇచ్చిన జనగామ ప్రజలు, రాష్ట్రం ఏర్పడ్డాక ముత్తిరెడ్డికి పట్టం కట్టారు. తన విజయానికి అండగా నిలిచి ఎమ్మెల్యేగా గెలిపించిన ఉద్యమకారులు, సీనియర్ బీఆర్‌ఎస్‌ నేతలను కలుపుకుపోవడంలో ముత్తిరెడ్డి వెనుకబడ్డారు. దీంతో ముత్తిరెడ్డిపై వ్యతిరేకత మొదలైంది. ఇది కాస్తా ముదరడంతో ఈసారి ఆయన గెలుపు కష్టమేనని చర్చ హాట్‌ టాపిక్‌గా మారింది.


జనగామలో మొదలైన అంతర్గత పోరుపై ఫోకస్‌ పెట్టింది బీఆర్‌ఎస్‌ అధిష్టానం. పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. ఎమ్మెల్సీ పోచంపల్లిని జనగామ పరిస్థితులను స్టడీ చేయాలంటూ సూచనలు చేసింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్నారు ఎమ్మెల్సీ పోచంపల్లి. అక్కడ తాను పాగా వేయడానికి సిద్ధమయ్యారు. కొంతమంది ప్రజాప్రతినిధులతో వర్గం ఏర్పాటు చేసుకొని టికెట్ తనకే అంటూ ప్రచారం చేయించారు. దీంతో ముత్తిరెడ్డిపై అసంతృప్తితో ఉన్న నేతలు మరో వర్గంగా చీలిపోయి, ఎమ్మెల్సీ పోచంపల్లికి టికెట్ ఇవ్వాలనే డిమాండ్ తీసుకొచ్చారు. పోచంపల్లి సైతం అధిష్టానం ఆదేశిస్తే ఎక్కడి నుండైనా పోటీ చేస్తానని ప్రకటించారు. పరిస్తితి చేయి దాటిపోతోందని గమనించిన ముత్తిరెడ్డి అధిష్టానం వద్ద పోచంపల్లిపై ఫిర్యాదు చేశారు.

పోచంపల్లి సైలెన్స్ తో ఊపిరి పీల్చుకున్న ముత్తిరెడ్డికి తన కూతురు తుల్జా భవాని వ్యవహారం తలనొప్పిగా మారింది. భూకబ్జా ఆరోపణలు చేస్తూ సవాళ్లు విసిరిన వైనం.. ప్రతిపక్షల తీరును తలపించింది. కన్నకూతురి కారణంగా ఇమేజ్ మరింత డ్యామేజ్‌ అవడంతోపాటు వ్యతిరేకత పెరిగింది. దీంతో ముత్తిరెడ్డికి ఈసారి ఓటమి తప్పదని.. జనగామ ఇలాఖాలో జయకేతనం ఎగురవేయాలంటే మరో అభ్యర్థికి టికెట్ ఇవ్వక తప్పదనే వాదన తెరపైకి వచ్చింది. ఈ సమయంలో పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పేరు ప్రతిపాందిచారు పలువురు పార్టీ నేతలు. దీన్ని అవకాశంగా తీసుకున్న పల్లా చక్రం తిప్పడం మొదలుపెట్టారు. నర్మెట్ట, మద్దూరు మండలాల్లోని అనుచరులు ప్రజాప్రతినిధులతో అనుకూలంగా తీర్మానాలు చేయించే పనిలో పడ్డారు. సీనియర్లను, ఉద్యమకారుల్ని ఏకం చేస్తూ అధిష్టానం దృష్టికి తనకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ ను తెలియజేయడానికి రహస్య మంతనాలు, సమావేశాలతో బిజీ అయ్యారు. ఈ క్రమంలో జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు సంపత్ రెడ్డి ఆడియో కాల్, మరికొంతమంది పల్లా అనుచరుల ఫోన్ కాల్ రికార్డ్స్ బయటకు వచ్చాయి. చాప కింద నీరులా పల్లా అనుచరులు స్థానిక ప్రజాప్రతినిధులను ఆయన వర్గంలోకి చేర్చుకునే ప్రయత్నాలు విజయవంతంగా పూర్తి చేశారు.

ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఎప్పటినుంచో పల్లా తహతహలాడుతుండగా ఇప్పుడు పరిస్థితులు కొంత అనుకూలంగా మారాయి. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుండి బరిలోకి దిగడానికి ప్రయత్నాలు చేయగా.. అక్కడ సిట్టింగ్ ఎమ్మేల్యే వినయ్ భాస్కర్ పోటీకి ఆయన తట్టుకోలేకపోయారు. హనుమకొండలో జరిగిన సభలో మంత్రి కేటీఆర్, వినయ్ భాస్కర్‌ను వచ్చే ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక పశ్చిమలో తన కోరిక నేరవేరేలా లేదని తెలుసుకున్న పల్లా.. మరో స్థానం కోసం ఎదురు చూస్తున్న వేళ.. ముత్తిరెడ్డిపై వ్యతిరేకత వరంగా మారింది. దీంతో జనగామ నుంచి పోటీ చేయాలని ఫిక్స్‌ అయిన ఆయన.. ఎన్నికల బరిలో నిలిచేందుకు ఎత్తుగడలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్థానిక ప్రజా ప్రతినిధులను తనవైపు తిప్పుకుంటూ అధిష్టానానికి తీర్మానం పంపి టికెట్ రేసులో మొదటి వరసలో ఉండేలా స్కెచ్ వేశారు. జనగామలో ఆపరేషన్ సక్సెస్ కావడంతో, తన అనుచరులను హైదరాబాద్‌కి పిలిచి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని భావించారు. అయితే సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తి రెడ్డి అక్కడకు వెళ్లి పల్లా వ్యూహాన్ని భగ్నం చేయాలనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ఆయనతో ఇన్నిరోజులు కలిసి ఉన్న ప్రజా ప్రతినిదులు ఎమ్మెల్యేకి పెద్ద షాక్‌ ఇచ్చారు. చేసేదేమీ లేక మీడియా ముందుకు వచ్చి తన గోడు వెళ్లగక్కారు ముత్తిరెడ్డి. తనవెనక జరుగుతున్న రాజకీయ తతంగాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. అయితే.. బీఆర్‌ఎస్‌ బాస్‌ అపాయింట్మెంట్‌ దొరక్కపోడంతో తీవ్ర అసంతృప్తితో వెను తిరగక తప్పలేదు. ఎమ్మెల్సీ పల్లా పొలిటికల్‌ ఎత్తుగడల వెనుక అధిష్టానం ఉందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది.

ఇక, జనగామలో కాంగ్రెస్ నుండి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య పోటీ పడుతున్నారు. కొమ్మూరి వైపే పెద్దలు మొగ్గు చూపుతున్నారు. ప్రతాప్‌రెడ్డిని ఫేస్ చేసే స్థితిలో ముత్తిరెడ్డి ఇప్పుడు లేరని, అందుకే టికెట్ మరో బలమైన నేతకు ఇవ్వాలనే డిమాండ్ సైతం వినిపిస్తోంది. హాట్‌ హాట్‌ గా సాగుతున్న జనగామ కారులో వార్ ఎపిసోడ్‌కు బీఆర్ఎస్ అధిష్టానం ఎలాంటి ఎండ్‌కార్డ్ వేస్తుందో చూడాలి.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×