Huzurabad Municipal: హుజురాబాద్ స్వేచ్ఛ: హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ పార్టీ జైత్రయాత్ర మొదలైందని, రాబోయే ఎన్నికల్లో రెండు చోట్లా కాంగ్రెస్ జెండా ఎగరవేసి తీరుతామని హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల వ్యూహరచనలో భాగంగా కౌన్సిలర్ అభ్యర్థులతో రాత్రి ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన నిప్పులు చెరిగారు. ప్రత్యర్థుల కుతంత్రాలను తిప్పికొట్టి, ప్రజాక్షేత్రంలో అజేయంగా నిలవాలని అభ్యర్థులకు పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు కేవలం రెండేళ్ల వ్యవధిలోనే అద్భుతమైన ప్రజా పాలనను అందిస్తోందని కొనియాడారు. మా ప్రభుత్వం చేతల ప్రభుత్వం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, సామాన్యుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రేషన్ కార్డుల ద్వారా సన్నబియ్యం పంపిణీ, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలు కేవలం వాగ్దానాలు కావు అవి నేడు క్షేత్రస్థాయిలో అమలవుతున్న వాస్తవాలు” అని స్పష్టం చేశారు.
Also Read: Huzurabad BJP News: బీజేపీలో ప్రమాణాల రాజకీయం.. ఆంజనేయస్వామి సాక్షిగా బి-ఫామ్‌ల అందజేత..!
ఈ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లి, ప్రతి ఓటరు మనస్సు గెలుచుకోవాలని సూచించారు. ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు అజాగ్రత్తగా ఉండొద్దని, ప్రత్యర్థులు ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా మొక్కవోని దీక్షతో విజయం సాధించాలని హితవు పలికారు. “హుజూరాబాద్ గడ్డపై కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తాం. గత పాలకుల వైఫల్యాలను ఎండగడుతూ, కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించండి” అని అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్తు ఉంటుందని గుర్తు చేశారు. ఈ సమావేశంలో హుజూరాబాద్, జమ్మికుంట మున్సిపల్ అభ్యర్థులు, పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొని ఎన్నికల సమరానికి సిద్ధమని నినదించారు.
Also Read: Nitin Nabin: నేడు తెలంగాణకు నితిన్ నబీన్.. పాలమూరు సభతో కమలం పార్టీ శ్రేణుల్లో కొత్త జోష్!