బతుకమ్మ పండగ గిన్నిస్ బుక్ లో ఎక్కేలా గ్రేట్ కార్నివాల్ లా నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. అదే జరిగితే బతుకమ్మ క్రెడిట్ అంతా తనదేనని చెప్పుకుంటున్న ఎమ్మెల్సీ కవిత ఉడుక్కోవడం ఖాయం. బతుకమ్మ పండగే ఇన్నాళ్లూ కవితకు కాస్తో కూస్తో ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. బతుకమ్మకు ప్రచారం కల్పించేందుకు జాగృతి సంస్థను ఏర్పాటు చేసి, కార్యక్రమాలు చేపట్టి, ఇప్పుడు అదే పేరుతో రాజకీయం చేస్తున్నారు కవిత. మరి తనకు రాని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి వస్తే ఆమె ఫీలవ్వకుండా ఉంటుందా. కాంగ్రెస్ హయాంలో బతుకమ్మ గిన్నిస్ రికార్డ్ ల్లోకి ఎక్కితే, తనని ఎవరూ గుర్తించరని, ఆ ఆలోచన అసలు తనకెందుకు రాలేదని కవిత బాధపడిపోతారేమో.
కాంగ్రెస్ చలవతో..
తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యాన్ని ఎవరూ కాదనలేరు. తమ పార్టీ చొరవ లేకపోతే తెలంగాణ ఏర్పాటు సాధ్యమయ్యేది కాదని, ఆ క్రెడిట్ అంతా తమదేనని అంటారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు బతుకమ్మకు కూడా ప్రపంచ వ్యాప్త ఘనత తెచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది బతుకమ్మ పండగను, గొప్ప కార్నివాల్‌గా నిర్వహిస్తామని తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఈనెల 21 నుంచి 30 వరకు బతుకమ్మ వేడుకలను ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబోతున్నట్టు చెప్పారు. మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి ఆయన బతుకమ్మ పండగ నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.
రికార్డ్ ఇలా..
ఈనెల 21న వేయిస్తంభాల గుడిలో బతుకమ్మ వేడుకలు ప్రారంభిస్తామని, ఆ వేడుకలను భారీ స్థాయిలో నిర్వహించి గిన్నిస్ బుక్ రికార్డ్ సాధిస్తామన్నారు మంత్రి జూపల్లి. ఈనెల 29న ఎల్బీస్టేడియంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తామని, ఆ భారీ కార్యక్రమానికి గిన్నిస్ బుక్ ప్రతినిధుల్ని ఆహ్వానిస్తున్నట్టు చెప్పారు. పీపుల్స్ ప్లాజాలో మహిళా స్వయం సహాయక సంఘాలతో ప్రత్యేక వేడుకలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల్లో విద్యార్థులంతా పాల్గొనేలా బతుకమ్మ వేడుకలకు షెడ్యూల్ డిజైన్ చేయబోతున్నారు. ఇక జాతీయస్థాయిలో బతుకమ్మ పండగకు ప్రచారం కల్పించేలా పలు విమానయాన సంస్థలతో కూడా ఒప్పందాలను కుదుర్చుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బతుకమ్మ వేడుకల ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి ప్రచారం కల్పిస్తామని తెలిపారు మంత్రి కొండా సురేఖ. బతుకమ్మ పండగ గురించి, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల గురించి దేశవిదేశాలకు తెలిసేలా ఈ ప్రచార కార్యక్రమాలు ఉంటాయన్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పర్యాటకశాఖ, మహిళలను భాగస్వామ్యం చేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
బతుకమ్మ పండగ గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో ఎక్కితే సంతోషించాలి. కానీ ఆ సంతోషానికి కారణం తాను కాకపోయే సరికి కవిత ఫీలవడం ఖాయం. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలోనే కవిత సహా బీఆర్ఎస్ నేతలు రగిలిపోతున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో తమ ముద్ర చెరిగిపోతోందని వారు బాధపడుతున్నారు. ఇప్పుడు బతుకమ్మ విషయంలో కూడా అదే రిపీట్ అయ్యే అవకాశం ఉంది. తెలంగాణకు అది చేశాం, ఇది చేశాం అంటూ 9 ఏళ్లపాటు అధికారం వెలగబెట్టింది బీఆర్ఎస్. ఇప్పుడు బతుకమ్మ పండగకు గిన్నిస్ బుక్ రికార్డ్స్ లో చోటు కల్పించేలా ఆసక్తికర నిర్ణయం తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం.