Rahul Gandhi: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన సర్వే నిర్వహించి సక్సెస్ సాధించిందని విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభలో సోమవారం రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపి తీర్మానంపై ప్రసంగించిన రాహుల్ గాంధీ.. తెలంగాణలో జరిగిన కులగణన సర్వే గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో విజయవంతంగా నిర్వహించిన సర్వే ఆధారంగా.. తెలంగాణలో 90 శాతం మంది వెనుక పోయిన ప్రజానీకమే ఉన్నారని రాహుల్ గాంధీ లోక్ సభ సాక్షిగా ప్రకటించారు. ఈ కామెంట్స్ ఇప్పుడు యావత్ దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రాష్ట్రపతి చేసిన సమయంలో ఎటువంటి మార్పు లేదని, గతంలో చేసిన ప్రసంగమే మరో మారు రాష్ట్రపతి ప్రసంగం సాగినట్లు తాను భావిస్తున్నానన్నారు. నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాహుల్ విమర్శించారు. మేక్ ఇన్ ఇండియా వల్ల దేశంలో ఎలాంటి మార్పు రాలేదని, నేటికీ నిరుద్యోగ సమస్య తాండవిస్తుందన్నారు. నిరుద్యోగ సమస్యను తగ్గించడంలో ప్రధాని నరేంద్ర మోడీ పూర్తిగా విఫలమయ్యారన్నారు.
60 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా జీడీపీ పడిపోయిందని, ఇందుకు కేంద్రం ఏం సమాధానం ఇస్తుందంటూ ప్రశ్నించారు. చైనా తో పోటీ పడడంలో దేశం తగ్గుముఖం పట్టినట్లు చెప్పిన రాహుల్, ఏఐలో భారత్ కంటే చైనా పదేళ్లు ముందుందని తెలిపారు. అంతేకాకుండా మహారాష్ట్ర ఎన్నికల గురించి ప్రస్తావించిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఆకస్మాత్తుగా 70 లక్షల ఓట్లు పెరిగాయని, ఓటర్ల సంఖ్య అకస్మాత్తుగా ఎందుకు పెరుగుతుందో ఈసి చెప్పాలని కోరారు.
అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశాంగ మంత్రి జయశంకర్ ను పంపించిన వైనంపై సంచలన కామెంట్ చేశారు రాహుల్. ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమెరికా ఆహ్వానించేలా చేసేందుకు మాత్రమే విదేశాంగ మంత్రిని అమెరికాకు పంపించారని రాహుల్ అనడంతో లోక్ సభలో ఒక్కసారిగా తీవ్రవాగ్వివాదం జరిగింది.
Also Read: YS Jagan – KCR: సంక్రాంతి వచ్చింది.. వెళ్లింది.. ఆ నేతలు మాత్రం?
ఇరుపక్షాల సభ్యులు గట్టిగా కేకలు వేయడంతో స్పీకర్ వారిని సముదాయించే ప్రయత్నం చేశారు. అలాగే తెలంగాణలో జరిగిన కులగణన సర్వే పై మాట్లాడిన రాహుల్.. దేశంలో కులగణన ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం విజయవంతంగా సర్వేను పూర్తి చేసిందని, అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా సర్వే పూర్తి చేసి తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం యావత్ దేశాన్ని ఆకర్షించిందన్నారు. లోక్ సభలో తెలంగాణ సర్వే గురించి రాహుల్ మాట్లాడిన అంశంపై.. తెలంగాణ కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు.