
Revanth reddy latest news(Political news today telangana) :
భారత్ జోడో యాత్ర కాంగ్రెస్ లో మనోధైర్యం పెంచిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. రాహుల్ గాంధీ చేసిన భారత్ జోడో యాత్రకు ఏడాది పూర్తైన సందర్బంగా హైదరాబాద్ సోమాజిగూడ నుంచి కాంగ్రెస్ నేతలు పాదయాత్ర చేపట్టారు. రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాందీ విగ్రహం వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో రేవంత్‌రెడ్డితోపాటు కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పాదయాత్ర తర్వాత కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. దేశంలో దళితులకు రక్షణలేదని రేవంత్ రెడ్డి కేంద్రాన్ని విమర్శించారు. మహిళలపైనా దాడులు జరుగుతున్నాయని అన్నారు. మణిపూర్ ఘటనలే అందుకు నిరదర్శనంగా పేర్కొన్నారు. నరేంద్ర మోదీ హయాంలో ఏం అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. మేక్ ఇన్ ఇండియా అన్న మోదీ.. ఇండియా పేరు ఇప్పుడు ఎలా తీసేస్తారని నిలదీశారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రాంతాలు, కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతోందని రేవంత్ మండిపడ్డారు. పేదల జీవన్ ప్రమణాలు పడిపోయింది నిజం కాదా అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిరుద్యోగం లాంటి అంశాలపై చర్చ చేయడానికి పార్లమెంట్ సమావేశాలు పెట్టడం లేదన్నారు.
బీఆర్ఎస్ విధానాలపైనా రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. అలాంటి ప్రభుత్వానికి ఎంఐఎం ఎలా మద్దతు ఇస్తుందని ప్రశ్నించారు. నిజాం రజాకార్ల నుంచి తెలంగాణను కాపాడిందని కాంగ్రెస్ పార్టీ కాదా? అని నిలదీశారు. హైదరాబాద్ లో సీడబ్ల్యూసీ సమావేశాలు పెట్టుకోకుండా బీఆర్ఎస్, బీజేపీ కలిసి కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. అధికారులపై మోదీ, కేసీఆర్ ఏ విధంగా.. ఒత్తిడి పెంచుతున్నారో ఈ చర్యలతో అర్ధమవుతోందన్నారు.