
Hyderabad latest news(Local news telangana) :
ఆటలు తప్ప ఆపద అంటే ఏమిటో తెలియని చిన్నారులు ప్రమాదాలలో చిక్కుకుంటున్నారు. ఆడుకుంటున్న సమయంలో ప్రమాదాలకు గురవుతున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.
మీర్‌పేట్ కార్పొరేషన్ పరిధిలోని మంత్రాల చెరువు వద్ద చిల్డ్రన్స్ పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. పార్క్ వద్దకు మార్నింగ్ వాక్ చేేసేందుకు తన కొడుకుని తీసుకుని వచ్చారు ఓ మహిళ. ఆమె నడుస్తుండగా వెనకే వెళ్తున్న బాలుడు పార్క్‌ను చూసి ఆగాడు. పార్క్ గేటు తాళం వేసి ఉండటంతో.. గ్రిల్స్ మధ్యలో నుంచి లోనికి వెళ్లే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో బాలుడి తల గ్రిల్స్‌లో ఇరుక్కుపోయింది.
గ్రిల్స్ మధ్య తల ఇరుక్కుపోవడంతో అరుపులు, కేకలతో ఊపిరి బిక్కబట్టి ఏడ్చాడు బాలుడు. వెంటనే అది గమనించిన తల్లి కన్నకొడుకు నరకయాతన చూసి తల్లిడిల్లిపోయింది. కాపాడాలని స్థానికులను ప్రాధేయపడింది. హుటాహుటిన గ్రిల్స్ వద్దకు చేరుకున్న స్థానికులు ఎట్టకేలకు బాలుడి తలను గ్రిల్స్ నుంచి బయటకు తీశారు. సురక్షితంగా కాపాడారు. దీంతో ఆ తల్లి ఊపిరి పీల్చుకుంది. రెండ్రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
అయితే మీర్‌పేట్ మంత్రాల చెరువు వద్ద ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసి వదిలేశారు అధికారులు. 6 నెలలైనా పార్క్ గేటుకు వేసిన తాళాలు తీయడంలేదు. పార్క్‌లో ఓపెన్ జిమ్ ఏర్పాటు చేశారు. కానీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మాత్రం అధికారులు శ్రద్ధ చూపడంలేదు. పార్క్‌లో ఆడుకోవాలనే చిన్నారుల కనీస హక్కులను కూడా అధికారులు కాలరాస్తున్నారు. పార్క్‌పై అధికారులు నిర్లక్ష్యం వహించడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.