Madhusudhan reddy on Ktr: మాజీ మంత్రి కేటీఆర్‌పై మండిపడ్డారు దేవరకద్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి. ఫార్ములా ఈ రేసు కేసులో విచారణ తర్వాత కేటీఆర్ మీడియా ముందుకొచ్చి ఏసీబీ-ఈడీ ఒకే ప్రశ్నలు అడుగుతున్నారంటూ చెప్పడంపై మండిపడ్డారు సదరు ఎమ్మెల్యే.
లై డిటెక్టర్ టెస్ట్ చేయాలని కేటీఆర్ తరచు అంటున్నారని, ఆయనకు చేయాల్సింది నార్కో అనాలసిస్ టెస్ట్ చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడుగా రేవంత్‌రెడ్డి ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో నార్కో అనాలసిస్ టెస్ట్ చేయించాలంటే కేటీఆర్ ఎందుకు వెనుకడుగు వేశారని ప్రశ్నించారు. కేటీఆర్ చేసిన తప్పులు బయటకు వస్తున్నాయని తెలిసి, ఈ క్రమంలో సీఎం రేవంత్‌రెడ్డిపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
కేటిఆర్‌పై డిసెంబర్ 19న ఏసీబీకి ఫిర్యాదు వచ్చిందని, 20న కేసు నమోదు చేశారని గుర్తు చేశారు ఎమ్మెల్యే. మీరు ఇప్పటికైనా తప్పు తెలుసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే ప్రజలు మిమ్ముల్ని బయట తిరగనివ్వరని అన్నారు. అధికారం పోయిన తర్వాత అవినీతి బయటకు వస్తుందన్న భయంతో అడ్డగోలుగా కేటీఆర్ విమర్శిస్తున్నారని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి పదవిపై కనీస గౌరవం లేకుండా ఇష్టానుసారంగా మాట్లాడడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మధుసూధన్‌రెడ్డి. లొట్టపీసు కేసు అన్న కేటీఆర్, విచారణ మొదలు కాగానే ఎందుకు హడావిడి చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. విచారణ ఎదుర్కొన్న వ్యక్తి లోపల ఏమీ జరగలేదని ప్రెస్‌మీట్‌లు పెట్టి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారంటూ రుసరుసలాడారు.
ALSO READ: కొత్త రేషన్ కార్డులు.. ఆపై మంత్రి పొన్నం క్లారిటీ
సీఎం రేవంత్ రెడ్డిని అబాసుపాలు చేయాలన్నదే కేటీఆర్ ఉద్దేశంగా కనిపిస్తోందన్నారు. చేసిన తప్పులు ఒకొక్కటిగా బయటకు వస్తుండటంతో ఏం చేయాలో తెలియక కేటీఆర్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని చెప్పుకొచ్చారు. నేరం ఒకటే కాబట్టి ఏసీబీ, ఈడీ ఒకేలా ప్రశ్నిస్తున్నాయని, దాన్ని కూడా తప్పు పట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
విచారణను తప్పుదోవ పట్టించడం, హాజరుకాకుండా తప్పించుకునే ప్రయత్నం ఆయన చేస్తున్నారని దుయ్యబట్టారు. కేటీఆర్ వ్యవహార శైలి చూస్తుంటే తప్పు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. కేటీఆర్ వ్యవహారాలు తెలిసే మాజీ సీఎం కేసీఆర్ బయటకు రాకుండా ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారని చెప్పుకొచ్చారు.
కేటీఆర్‌పై ఫార్ములా ఈ రేస్ కేసు, కవితపై లిక్కర్ కేసులు ఉన్నాయన్నారు. కేసీఆర్ కుటుంబం అంతా కుంభకోణాల్లో మునిగిపోయిందన్నారు. గ్రీన్ కో సంస్థను కాపాడే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఆ సంస్థతో సంబంధాలు లేకుంటే అక్రమంగా సొమ్ము ఎందుకు బదలాయించారో కేటీఆర్ స్పష్టం చేయాలన్నారు. ఆనాడు మాపై ఎన్ని కేసులు పెట్టినా ఏనాడు భయపడలేదని, అన్నింటిని ధైర్యంగా ఎదుర్కొన్నామన్నారు.