Congress MP: కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ స్క్రిప్ట్ చదవడం మానుకోవాలని, ఇప్పటికైనా మార్పు చెందకపోతే ప్రజాదరణ కోల్పోతారంటూ చామల హెచ్చరించారు. ఎంపీ చామల ఏం చెప్పారంటే..
తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా ఇటీవల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ పై శనివారం ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీరియస్ అయ్యారు. ఎంపీ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మోడీ కేబినెట్ లో మంత్రినా.. లేక కేసీఆర్ పామ్ హౌస్ లో పెద్ద పాలేరా అంటూ సంచలన కామెంట్స్ చేశారు. కిషన్ రెడ్డి, కేసీఆర్ కు పవర్ గా ఉంటే తమకు అభ్యతరం లేదని, కిషన్ రెడ్డి గులాబీ కండ్ల జోడు తీస్తే అన్నీ కనిపిస్తాయన్నారు.
తెలంగాణ బీజేపీకి చెందిన కిషన్ రెడ్డి ,ఈటెల రాజేందర్ లు ఇద్దరూ బీఆర్ఎస్ బాటలో నడుస్తున్నట్లు విమర్శించారు. భూములు లాక్కొనేందుకు వీరిద్దరూ కలిసి దాదాగురి చేస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీసేలా ప్రవర్తిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనలో లక్ష 78వేల 950 కోట్లు పెట్టుబడులు తెచ్చారని, అది తెలిసి బీఆర్ఎస్ నేతలకు కడుపు మండుతుందన్నారు. అందుకే వాళ్లకు టాబ్లెట్స్, సిరప్ లు పంపామని ఎంపీ అన్నారు. బీజేపీ ఆఫీసులో తయారైన స్క్రిప్ట్ బీఆర్ఎస్ ఆఫీసుకు, బీఆర్ఎస్ ఆఫీసులో తయారైన స్క్రిప్టు బీజేపీ ఆఫీసుకు పోతుందన్నారు.
కిషన్ రెడ్డి జిరాక్స్ కాపీలు తెప్పించుకొని మాట్లాడుతున్నారని సంచలన కామెంట్స్ చేశారు ఎంపీ. తెలంగాణ ఏ దేశంలో ఉంది కిషన్ రెడ్డి గారు.. భారత దేశంలో లేదా? రాష్ట్రంలో ఉన్న కంపెనీలు వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ కు పోవద్దా? మీ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దావోస్ లో రిలయన్స్ కంపెనీ తో ఎందుకు 3 లక్షల కోట్ల ఎంఓయూ ఎందుకు చేసుకున్నారు? రిలయన్స్ ముంబయ్ కంపెనీ కాదా అంటూ కిషన్ రెడ్డిని ఎంపీ ప్రశ్నించారు. మీరు చేసుకుంటే ఒప్పు, మేము చేసుకుంటే తప్పా? కిషన్ రెడ్డి ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ ముఖ్యమంత్రుల, మంత్రుల దావోస్ పర్యటన ను ఖండించే దమ్ము ఉందా అంటూ సవాల్ విసిరారు. కిషన్ రెడ్డి రాష్ట్రం గురించి మాట్లాడొద్దు.. మీరు దేశానికి మంత్రి, దేశం గురించి మాట్లాడాలని, మంత్రిగా కిషన్ రెడ్డి జాగ్రత్తగా మాట్లాడాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు.