KOMATIREDDY : తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మునుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి,తన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేయాలని వెంకట్ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలను కోరినట్లు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయింది.ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం అక్టోబర్ 22న షోకాజ్ నోటీసు జారీ చేసింది. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పార్టీ క్రమశిక్షణ నియమావళిని ఉల్లంఘించారని నోటీసులో పేర్కొంది. ఈ వ్యవహారంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. కానీ 10 రోజులు దాటినా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమాధానం ఇవ్వలేదు.
ఒకవైపు మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పార్టీ సీనియర్ నేతలందరూ పాల్గొన్నారు. కానీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి చూడలేదు. మరోవైపు తెలంగాణలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కొనసాగుతోంది. అక్కడ ఈ సీనియర్ నేత కన్పించలేదు. ఇలా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండిపోయారు. మరో ఏడాదిలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పార్టీ స్టార్ క్యాంపెయినర్ బాధ్యతలు అప్పగించింది. అయినా సరే కీలక సమయంలో పార్టీ పటిష్టత కోసం కృషి చేయాల్సిన సీనియర్ నేత వ్యవహరిస్తున్న తీరుపై పార్టీలోని ఇతర నేతల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటమేకాదు కీలక సమయంలో ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. విహారయాత్ర చేసి తాజాగా హైదరాబాద్ చేరుకున్నారు. తిరిగి వచ్చిన తర్వాత పార్టీ ఇచ్చిన షోకాజ్ నోటుసుకు సమాధానం ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో ఏఐసీసీ క్రమశిక్షణ కమిటీ కోమటిరెడ్డికి మరోసారి షోకాజ్ నోటీసు ఇచ్చింది. మరి ఈ నోటీసుకైనా ఈ సీనియర్ నేత సమాధానం ఇస్తారో? లేదో? నవంబర్ 7 వరకు వేచి చూడాలి. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ గడువు ఇచ్చింది.