Huzurabad: స్వేచ్ఛ బ్యూరో: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హుజూరాబాద్ మున్సిపల్ కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ సోమవారంతో ఉత్కంఠభరితంగా ముగిసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తూ నాలుగు స్థానాలను కైవసం చేసుకుంది. హుజూరాబాద్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ వ్యూహాత్మకంగా వ్యవహరించి, అటు మున్సిపల్ పాలకవర్గంతో పాటు ఇటు కో-ఆప్షన్ ఎన్నికల్లోనూ తనదైన ముద్ర వేశారు. అసంతృప్తులను బుజ్జగిస్తూనే, పార్టీని నమ్ముకున్న వారికి సముచిత స్థానం కల్పించడంలో ఆయన సఫలీకృతమయ్యారు.
సభ్యుల ఎంపికలో ప్రణవ్ సామాజిక సమతుల్యం పాటించారు. బీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు ప్రాధాన్యత ఇస్తూ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాల పక్షపాతి అని మరోసారి నిరూపించారు. ఎన్నికైన వారిలో ఇద్దరు మహిళలకు చోటు దక్కడం విశేషం. కో-ఆప్షన్ సభ్యులుగా గొట్టే జమదగ్ని, ఆలేటి సుశీల, మహమ్మద్ అబ్దుల్ అలీం, ఫరీద బేగం ఎన్నికయ్యారు. హుజూరాబాద్ మున్సిపల్ చరిత్రలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఈ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడం గమనార్హం.
Also read: మార్పు దిశగా బీఆరెస్ అడుగులు! రాష్ట్ర కమిటీలో రెండు కీలక తీర్మానాలు… !
తమ శ్రమను గుర్తించి బాధ్యతలు అప్పగించినందుకు నూతన సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. తమపై నమ్మకముంచిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, ముఖ్యంగా నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఎన్నిక అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ.. కొత్తగా ఎన్నికైన సభ్యులు బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. మున్సిపల్ పాలకవర్గం ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ వారి మెప్పు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ గందాడ సుహాసిని, కౌన్సిలర్లు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Also read: మల్కాజ్‌గిరిలో బీజేపీ ముసలం.. ప్రీతిరెడ్డికి చెక్ పెట్టిన బీజేపి అధిష్టానం..!