BigTV English

Telangana: తెలంగాణలో అవినీతి మేత! ఫస్ట్ ప్లేస్‌లో ఏ శాఖంటే?

Telangana: తెలంగాణలో అవినీతి మేత! ఫస్ట్ ప్లేస్‌లో ఏ శాఖంటే?

Telangana: తెలంగాణలో అవినీతి మేత మేసే ఆఫీసర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ట్రాప్ కేసులతో ఏసీబీ హడలెత్తిస్తున్నా తగ్గేదే లేదంటున్నారు. జైళ్లల్లో కరుడుగట్టిన నేరస్తులతో రిమాండ్ లో ఉన్నా పర్వాలేదనుకుంటున్నారు. బెయిల్ రాకపోయినా నెలల తరబడి జైళ్లో ఉండేందుకూ సిద్ధమంటున్నారు. డబ్బులు తినడం మాత్రం ఆపేది లేదంటున్నారు. ఎందుకిలా జరుగుతోంది? ఇంతకీ ఏయే డిపార్ట్ మెంట్లు టాప్ లో ఉన్నాయి?


లంచాలు ఇవ్వాలని ఎవరైనా వేధిస్తున్నారా? అయితే 1064 టోల్ ఫ్రీకి కాల్ చేయండి.. లేదంటే 9440446106కి వాట్సప్ చేయండి.. మీ వివరాలు గోప్యంగా ఉంచుతాం.. ఇదీ తెలంగాణ ఏసీబీ ఇటీవలి కాలంలో పెంచిన ప్రచారం.. అయితే ప్రస్తుతం ఏసీబీకి ప్రభుత్వం ఫ్రీ హ్యాండ్ ఇవ్వడంతో పుట్టగొడుగుల్లా అవినీతి కేసులు నమోదవుతున్నాయి. కంప్లైంట్ ఇవ్వడమే కాదు.. అనుమానం వస్తే చాలు.. తనిఖీలు చేసి ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్నీ నమోదు చేస్తున్నారు. అవినీతి తిమింగళాల భరతం పడుతున్నారు.

రెవెన్యూ, పోలీస్ మున్సిపల్, ఇరిగేషన్, ట్రాన్స్‌పోర్ట్


రెవెన్యూ, పోలీస్, మున్సిపల్, ఇరిగేషన్, ట్రాన్స్ పోర్ట్.. అవినీతి మేత ఎక్కువగా ఈ డిపార్ట్ మెంట్లలోనే ఉంటోంది. లెక్కకు మిక్కిలిగా జనం బలహీనతలను సొమ్ము చేసుకుంటూ ఆస్తులు పోగేసుకుంటున్న వారిలో ఈ డిపార్ట్ మెంట్ లో టాప్ ఫైవ్ లో ఉన్నాయి. నిజానికి గతంలో మమ అన్నట్లుగా ఏసీబీ కేసులు నమోదయ్యాయి. కానీ ఇటీవలి కాలంలో తీవ్రత పెరిగింది. బాధితులు కూడా ధైర్యంగా ముందుకు వస్తున్నారు. ఏసీబీ కూడా స్పీడ్ పెంచింది. అందుకే ఈ అరెస్టులు.

167 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్

ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్ట్ వరకు 8 నెలల్లోనే 179 కేసులు నమోదు చేసింది ఏసీబీ. 167 మంది ప్రభుత్వ ఉద్యోగులు అరెస్ట్ అయ్యారు. 44.30 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు. గత నెల ఆగస్ట్లో 31 కేసులు బుక్ అయ్యాయి. 22 మంది ప్రభుత్వ ఉద్యోగులు, నలుగురు ప్రైవేట్ ఉద్యోగులను అరెస్ట్ చేసింది ఏసీబీ. అంటే యావరేజ్ గా రోజుకో కేసు అన్న మాట. ప్రతి నెల సగటున 20 మంది అవినీతి అధికారులు పట్టుబడుతున్నారు. సగటున నెలకు 20 కేసులు రికార్డవుతుండగా 20 మంది అరెస్టవుతున్నారు. ఇందులో ట్రాప్ కేసులున్నాయి. క్రిమినల్ మిస్‌కండక్ట్ వి ఉన్నాయి. రెగ్యులర్ ఎంక్వైరీలు, ఆకస్మిక తనిఖీలు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఇలాంటివన్నీ భాగంగా ఉన్నాయి.

ఈ ఏడాది 20 మందికి పైగా మహిళా అధికారులు అరెస్ట్

నిజానికి కడుపు మండిన వాళ్లే ఏసీబీ దగ్గరికి వస్తున్నారు. ఇంకా చాలా మంది డబ్బులు పోతే పోనీ.. తమ పని అయిపోతే చాలు అని లంచాలు సమర్పించుకుంటున్నారు. కానీ కొందరు మాత్రమే అన్ని పక్కాగా ఉన్నా డబ్బులు డిమాండ్ చేసే అధికారులపై ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ మహిళా ఆఫీసర్ పేరు మణి హారిక. నార్సింగి మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్. అసలే ఐటీ హబ్ కు దగ్గర. నిర్మాణాలు ఎక్కువ జరిగే ప్లేస్. గండిపేట మండలం మంచిరేవుల గ్రామానికి చెందిన ఒకరు తనకున్న వెయ్యి గజాల ప్లాటుకు LRS ప్రొసీడింగ్ ఇవ్వడానికి మణిహారిక 10 లక్షల లంచం డిమాండ్ చేశారు. మొదటగా 4 లక్షల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు సెప్టెంబర్ 9న రెడ్ హ్యాండెడ్ గా దొరికారు. దీంతో ఆమెను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండుకు తరలించారు. ఇలా ఈ ఏడాది 20 మందికి పైగా మహిళా అధికారులు ఏసీబీకి దొరికిపోయారు.

అవినీతిలో రెవెన్యూశాఖ ఫస్ట్ ప్లేస్

నారాయణపేట్ జిల్లా మద్దూరు మండలంలో రెవెన్యూ ఇన్ స్పెక్టర్. ఒక వ్యక్తి పట్టాపాస్ బుక్ విషయంలో వెరిఫికేషన్ రిపోర్ట్ ఇవ్వడానికి 5 వేలు లంచం అడిగి అడ్డంగా బుక్కయ్యాడు. ఇలాంటి కేసులెన్నో రోజూ వస్తునే ఉన్నాయి. ఏసీబీ నమోదు చేసిన కేసుల్ని ఒకసారి చూస్తే.. అవినీతిలో ఫస్ట్ ప్లేస్ లో రెవెన్యూ శాఖ ఉండగా, ఆ తర్వాత పోలీస్ శాఖ, మున్సిపల్, ఇరిగేషన్ డిపార్ట్ మెంట్స్ ఉన్నాయి. మిగిలిన శాఖల్లో పది లక్షలు అంతకు లోపు ఉంటే.. ఇరిగేషన్ లో మాత్రం చాలా మంది పంట పండుతోంది. కమీషన్ల వ్యవహారంతో కోట్లకు పడగలెత్తిన వారిని ఏసీబీ ఇటీవలే అరెస్ట్ చేసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈఎన్సీ భూక్యా హరిరాం అరెస్ట్ అయ్యారు. అతడి ఆస్తులు బహిరంగ మార్కెట్లో వందల కోట్లలోనే ఉంటాయని గుర్తించారు. అలాగే మురళీధర్ రావు, నూనె శ్రీధర్ ఇలాంటి వారంతా అరెస్ట్ అయ్యారు. అవినీతి అధికారులు ఏ శాఖలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా ఉపేక్షించొద్దని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఫిర్యాదులు రాగానే వెంటనే రంగంలోకి దిగాలని ఆదేశించింది. సొంతంగా కూడా మెరుపుదాడులు చేయాలని సూచించింది. అందుకే ఏసీబీ స్పీడ్ పెరుగుతోంది.

లంచం తీసుకుంటే ఏమీ కాదు.. అప్పటికప్పుడు అరెస్ట్ అయినా ఏళ్లకేళ్లు కేసులు పెండింగ్ లో ఉంటాయి. అప్పటికి మన సర్వీస్ కూడా అయిపోతుంది. నెలవారీ వచ్చే జీతం కంటే బల్ల కింద చేయి పెట్టి ఇంకా ఎక్కువగా సంపాదించి సైడైపోవచ్చు. ఇదీ అవినీతి చేసే ఆఫీసర్ల సగటు ఆలోచన. కానీ అందరి విషయంలో ఇలాగే జరగదు. నేరం నిరూపితమై, సర్వీస్ నుంచి డిస్మిస్ అయి.. సమాజంలో కరప్టెడ్ ట్యాగ్ పడి, ఒంటరిగా మిగిలిపోయి, మీ కుటుంబాలు చిన్నాభిన్నమై రీ లొకేట్ అవ్వాల్సిన దుస్థితి రావచ్చు. ఇకపై ఏసీబీ కేసు అంటే మామూలుగా ఉండదు. రూల్స్ మారుతున్నాయ్. బీ కేర్ ఫుల్.

21 మంది ఏసీబీ అధికారులకు మెడల్స్

నువ్ వద్దు.. నీ లంచం డబ్బులు వద్దు అని ఆఫీసర్లు అనే రోజులు రావాలి. లంచం ఇచ్చే వారు కూడా… ఈ డబ్బులతో మన పని అయ్యేట్లు లేదు అనుకునే రోజుల్ని తీసుకొచ్చేలా ఏసీబీ సీరియస్ గా వర్కవుట్ చేస్తోంది. అదే సమయంలో విధి నిర్వహణలో మంచి ప్రతిభ చూపిస్తున్న 21 మంది ఏసీబీ అధికారులకు స్వాతంత్ర దినోత్సవ వేడుకలో మెడల్స్ కూడా ప్రధానం చేసింది ప్రభుత్వం. అయితే ఏసీబీ కేసుల విషయంలో కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి. 2025 నాటికి 980 ప్లస్ పెండింగ్ కేసులు ఉన్నాయని లెక్క తేలింది. ఇది అవినీతి చేసే వారికి “లో రిస్క్ – హై రిటర్న్” అనిపించేలా చేస్తోంది. ఈ పరిస్థితి మార్చాల్సిన అవసరం ఉంది.

గోల్‌మాల్ చేయకపోతామా అన్న ధీమా

ఏసీబీ కేసులంటే లెక్కలేదు అనుకున్న పొజిషన్ నుంచి భయపడేదాకా పరిస్థితి నెమ్మదిగా వస్తోంది. కొందరిని ఇప్పటికే జైలుకు కూడా పంపించారు. అరెస్ట్ అయ్యాం.. రిమాండ్ కు వెళ్లాం.. మంచి లాయర్ ను పెట్టుకుని తొందరగా బయటికొచ్చాం అనుకుంటున్నారు. కాకపోతే రెగ్యులర్ బెయిల్ 90 రోజుల్లో అయినా రాకపోతుందా.. అప్పటికి కేసును గోల్ మాల్ చేయకపోతామా అని చాలా మంది అవినీతి ఆఫీసర్లు అనుకునే మాట. అయితే ఇప్పుడు పరిస్థితులు మారాయ్. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన కేసుల్లో వందల కోట్ల విలువ చేసే అక్రమాస్తులను స్వాధీనం చేసుకోవడం, ఆస్తులను జప్తు చేసుకోవడంతో పాటుగా.. అవినీతి అధికారులకు ఊహించని షాకిస్తోంది ఏసీబీ. లంచం తీసుకుంటూ పట్టుబడినా.. ఆదాయానికి మించి ఆస్తులున్నా ఇలాంటి కేసులపై సీరియస్ గా ఫోకస్ చేస్తోంది. రెడ్ హ్యాండెడ్ గా దొరికాక ఇక తప్పించుకోవడానికే వీల్లేకుండా చేస్తోంది.

సో ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే.. ఏసీబీ స్పీడ్ పెంచింది. అరెస్టులు పెరుగుతున్నాయి. కేసుల లోడింగ్ కూడా పెరుగుతోంది. అయితే ఆ కేసులు శిక్షలు పడే దాకా ముందుకు వెళ్లకపోవడం పెద్ద సవాల్ గా మారింది. మరోవైపు ఏసీబీలో ఉద్యోగుల సంఖ్య పెంచాల్సిన అవసరం కనిపిస్తోంది. కేవలం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడమే కాదు.. అవినీతి అధికారులకు శిక్ష పడినప్పుడే మిగితా వాళ్లు భయపడుతారు. లేదంటే ఏసీబీ కేసులను లైట్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్నది కూడా అదే. అలాంటి ఫీలింగ్ పోవాలంటే భయం పెరగాలి. ఏసీబీ కేసు నమోదైందంటే.. కచ్చితంగా శిక్ష పడుతుంది. ఉద్యోగం ఊడుతుందన్న భయం రావాలి. అలా జరగాలంటే కేసు నమోదు దగ్గర్నుంచి ఏసీబీ తరపున కోర్టుల్లో వాదనలు వినిపించడం, బలమైన సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయడం ఇవన్నీ కీలకమే.

కేసులు శిక్షలు పడే దాకా ముందుకెళ్లట్లేదా?

సో అవినీతి చేసే ఉద్యోగులకు ఏసీబీ కేసులు మునుపటిలా కాకుండా కథ మారబోతోంది. కెరీర్ పై ఎఫెక్ట్ పడడం ఖాయమే. ప్రమోషన్లు లేట్ అవడం, సర్వీస్ రిమార్క్ కొనసాగడం ఇవన్నీ ఇకపై పెరుగుతాయి. అవినీతి కేసుల్లో ఎవరూ తప్పించుకోలేరని, లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వారిని ఉపేక్షించేదే లేదని సిగ్నల్స్ పంపుతున్నారు. అవినీతి తగ్గడానికి ఒక పద్ధతి ప్రకారం చర్యలు తీసుకోవడం అవసరం. తెలంగాణ ACB మరింతగా కన్విక్షన్ రేట్ సాధించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే బలమైన ఎవిడెన్స్ అంటే వీడియో, డాక్యుమెంట్లతో లంచం తీసుకున్నట్లు నిరూపిస్తున్నారు. అయితే బ్యూరోక్రటిక్ డిలేలు అంటే విజిలెన్స్ క్లియరెన్స్ వంటివి పెద్ద సవాల్ గా మారుతున్నాయి. ఇవి తొందరగా క్లియర్ అయితే కోర్టుల్లో మరింత తొందరగా శిక్షలు పడే అవకాశం ఉంటుంది.

ACB కేసుల్లో నేర నిరూపణ రేటు పెరగడం ముఖ్యం

ఈ ఏడాది సంగతి తీసుకుందాం.. జనవరి నుంచి ఆగస్టు దాకా నమోదైన 179 కేసుల్లో 10 మందిపై నేర నిరూపణ చేసింది ఏసీబీ. ACB కేసుల్లో నేర నిరూపణ రేటు పెరగాల్సిన అవసరం కనిపిస్తోంది. కోర్టుల్లో నేరం నిరూపించే బాధ్యత కూడా ఏసీబీదే. డిపార్ట్ మెంటల్ డిలేస్ ను తగ్గించాల్సిన అవసరం కనిపిస్తోంది. కొన్ని కేసుల్లో అయితే 2013 నుంచి ఇంకా కోర్టుల్లోనే ఉన్నాయి. విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ క్లియరెన్స్ త్వరగా చూసుకోవడం, శాఖల్లో మానిప్యులేషన్ లు జరగకుండా చెక్ పెట్టడం ఇవన్నీ కీలకమే. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లాంటి సంస్థలైతే.. అవినీతి కేసుల్లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన వారికి ఫాస్ట్-ట్రాక్ కోర్టులు పెట్టి ఏడాదిలోపే శిక్షలు పడేలా చూడాలంటోంది. అన్ని కేసులను కోర్టుల్లో ఏసీబీ దగ్గరగా మానిటర్ చేసి ప్రాసిక్యూషన్ ను ఫాలో అప్ చేయాలి. అందుకే రూల్స్ మార్చి భయం పెంచాలని FGG వంటి సంస్థలు అంటున్నాయి. నిజానికి మునుపటిలా అవినీతి చేసేద్దాం.. తర్వాత చూసుకుందాం అన్న పరిస్థితులు లేవు. ఇప్పుడు సీరియస్ నెస్ పెరిగింది. ప్రమోషన్లు బ్లాక్ అవడం, సస్పెన్షన్లు, డిస్మిసల్, పెన్షన్ కట్ ఇవన్నిటితో పాటు జైలుకు వెళ్లే పరిస్థితినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వారికి ప్రమోషన్లు ఇస్తే ఎలా?

అవినీతి కేసు రిజిస్టర్ అయినప్పుడు, అధికారి సర్వీస్ రికార్డులో నెగటివ్ రిమార్క్స్ ఎంట్రీ చేస్తారు. లంచం, అక్రమాస్తులు, మిస్ కండక్ట్ కేసులన్నీ విజిలెన్స్ కమిషన్ కు రిఫర్ అవుతాయి. సర్వీస్ రికార్డులో Pending Vigilance Enquiry OR Case అన్న రిమార్క్ వస్తుంది. ఇది ప్రమోషన్, ట్రాన్స్‌ఫర్, పెన్షన్‌కు అడ్డంకి. నాన్ విజిలెన్స్ కేసుల్లో విజిలెన్స్ కమిషన్ అడ్వైజ్ అవసరం లేకపోయినా రికార్డులో Departmental Enquiry Pending అని రాస్తారు. ఇవన్నీ ఇప్పటి వరకు ఉన్న రూల్సే. కానీ వీటిని మరింత కఠినం చేయబోతున్నారు. ఏదో పట్టుకున్నాం.. రిమాండ్ కు తరలించాం.. బెయిల్ పై బయటికొచ్చాం.. ఇక దున్నుడే అనుకుంటే కుదరదు. రూల్స్ మార్చేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ప్రభుత్వానికి తోడు పలు సంస్థలు కూడా క్రిమినల్ కేసులు, అవినీతి కేసుల్లో ఉన్న అధికారులకు ప్రమోషన్ ఇవ్వకూడదు అని ఒత్తిడి పెంచుతున్నాయి. అవినీతి కేసుల్లో అరెస్ట్ అయిన వారికి ప్రమోషన్లు ఇస్తే.. ఎవరికీ భయం లేకుండా చేస్తుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇటీవలే సీఎంకు లేఖ కూడా రాసింది. సర్వీస్ రూల్స్ లో సవరణలు చేసి ప్రమోషన్ బ్యాన్ అని రిమార్క్స్ ఎంట్రీ చేయాలని FGG అంటోంది.

Also Read: అమ్మకాదు.. కామపిశాచి.. ప్రియుడితో కలిసి 2 ఏళ్ల కుమార్తెను చంపేసింది 

ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్, FGG సహా పలు NGOల సర్వేల ప్రకారం తెలంగాణలో 89 శాతం మంది జనం చెప్పిందేంటంటే.. ఇక్కడ అధికారులు లంచం లేకుండా పని చేయరు అని. ఇది ఎంత సీరియస్ మ్యాటరో అర్థం చేసుకోవాలి. అవినీతికి పాల్పడిన వారి ఫోటోలు, వీడియోలో మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవుతాయి. కరప్ట్ ఆఫీసర్ ట్యాగ్ పడుతుంది. అవినీతి ఆఫీసర్ల పిల్లలకు విద్యాసంస్థల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. వారి పిల్లల మ్యారేజ్ ల విషయంలోనూ ఎఫెక్ట్ పడుతుంది. ఇవన్నీ సామాజిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏసీబీ కేసుల్లో నేరం నిరూపితమైతే కేసు తీవ్రతను బట్టి శిక్షలు ఒకటి నుంచి ఏడేళ్ల దాకా ఉంటాయి. సర్వీస్ నుంచి డిస్మిస్ అవుతారు. ఏ ప్రభుత్వ సేవలోనైనా మధ్యవర్తులు తగ్గితే అవినీతి తగ్గుతుంది. ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటే.. కనీసం 70 శాతమైనా కన్విక్షన్ రేట్ లక్ష్యంగా పెట్టుకోవాలి. ఇప్పటికే ఉన్న 980కి పైగా పెండింగ్ కేసులను త్వరగా డిస్పోజ్ చేయాలి. కోర్టుల్లో ఆధారాలతో సహా నిరూపించి జైలుకు పంపాలి. అప్పుడే మిగితా లంచావతారాల్లో భయం పెరుగుతుంది. ACB స్టాఫ్‌ను ఇంకా పెంచుకోవాలి. అవినీతిని నిరోధించాలంటే పటిష్ఠ నిబంధనలు, కఠిన చర్యలే కాకుండా అధికారుల్లో నైతిక బాధ్యత పెంచాలి. యాంటీ కరప్షన్ వీక్స్ లాంటి ప్రోగ్రామ్స్ మరిన్ని నిర్వహించాలి. కంప్లైంట్ ఇచ్చిన వారికి ఇబ్బంది లేకుండా చూడాలి.

Story By Vidya Sagar, Bigtv

Related News

Karimnagar: బట్టలు ఆరేసుకోడానికి రూ.200 కోట్లతో ఈ బ్రిడ్జి కట్టారా? ఇదెక్కడి మాస్ మామ!

Sujathakka Surrender: లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్.. మావోయిస్టు సుజాతక్క

KTR: కేటీఆర్ పై OU పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు వాయుగుండం ముప్పు.. మరో 3 రోజులు కుండపోత వర్షాలు..

BRS Vs T Congress: జూబ్లీహిల్స్‌తో పాటు.. ఆ పది నియోజకవర్గాలలో ఉప ఎన్నికలు?

Hyderabad Metro: ఈ మెట్రోను మేము నడపలేం.. సమస్యను పరిష్కరించండి బాబోయ్..

Thummala Nageswara Rao: మరో నాలుగు రోజుల్లో రాష్ట్రానికి 27 వేల టన్నుల యూరియా: తుమ్మల

Big Stories

×