Telangana Assembly Deputy CM Fires on Palla Rajeswar Reddy| రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీని ప్రజలు తిరస్కరించిన వారికి ఇంకా కనువిప్పు కలుగలేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ, గవర్నర్ ప్రసంగానికి దశ, దిశ లేదని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా, రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదని, ఇచ్చిన హామీల్లో కేవలం 10 శాతం మాత్రమే అమలు చేస్తున్నారని వారు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అహంకారపూరితంగా వ్యవహరిస్తోందని, జర్నలిస్టులపై కేసులు పెట్టిందని సభ దృష్టికి తీసుకున్నారు. అదే విధంగా, తెలంగాణ అస్తిత్వంపై దాడి జరుగుతోందని, పేర్లు మార్చడం కాదు, ప్రజల జీవితాలను మార్చాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తీవ్ర ప్రతిస్పందన చేశారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి మరియు అధినేత రాహుల్ గాంధీ ఇచ్చిన మాట మేరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.2 లక్షల కోట్ల రుణమాఫీ చేశామని తెలిపారు. జనగామ నియోజకవర్గంలో రూ.263 కోట్లు, గజ్వేల్ నియోజకవర్గంలో రూ.237 కోట్లు, సిద్దిపేట నియోజకవర్గంలో రూ.177.91 కోట్లు, సిరిసిల్లలో రూ.175 కోట్లు, నిర్మల్ నియోజకవర్గంలో రూ.202 కోట్ల రుణమాఫీ జరిగిందని వివరించారు. విద్యా శాఖలో 11 వేల ఉద్యోగాలు ఇచ్చామని, సుమారు 36 వేల మంది ఉపాధ్యాయులను బదిలీ చేశామని తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు 12 మంది వీసీలను నియమించామని, వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయానికి తొలిసారిగా దళిత వీసీని నియమించామని ప్రకటించారు.
ఇప్పటికైనా పల్లా రాజేశ్వర్ రెడ్డి వాస్తవాలు మాట్లాడాలని, సభను తప్పుదారి పట్టించేలా ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేయొద్దని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కౌంటర్ ఇచ్చారు. ఎవరికి రుణమాఫీ అయిందో, ఆయా గ్రామ పంచాయతీల వద్ద జాబితాను ప్రదర్శించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన కేవలం 3 నెలల్లోనే రూ.2 లక్షల కోట్ల రుణమాఫీ చేసి చూపించామని ప్రకటించారు. తాము అమలు చేస్తున్న ప్రతి పథకానికి సంబంధించి లెక్కలతో సహా చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. ముఖ్యంగా గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట్‌లకు బీఆర్ఎస్ కంటే ఎక్కువ మేలు చేశామని ఉపముఖ్యమంత్రి తెలిపారు. గృహజ్యోతి పథకం కింద రూ.కోట్లు చెల్లిస్తున్నామని తెలిపారు. సిద్దిపేటలో ఆ పథకం కింద రూ.20.37 కోట్లు, సిరిసిల్లకు రూ.25 కోట్లు చెల్లించామని స్టేట్‌మెంట్లను ప్రదర్శించారు.
జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై మంత్రి పొన్నం సమాధానం
మహిళా జర్నలిస్ట్ రేవతి మరియు ఆమె భర్త అరెస్ట్ విషయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అసెంబ్లీ సభలో ముందుకు తీసుకువచ్చారు. గ్రామాల్లో కరెంట్ రావడం లేదని, పంట ఎండిపోతుందని జర్నలిస్టులు ప్రశ్నించినందుకు వారిపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు. మహిళా జర్నలిస్టులపై కేసులు పెట్టే దుస్థితి ఏ ప్రభుత్వంలోనూ లేదని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, జర్నలిస్టు రేవతి అరెస్ట్‌పై స్పష్టతను అందించారు. అలాంటి వీడియోలను సమర్థిస్తున్నారంటే బీఆర్ఎస్ ఎంతటి ఫ్రస్ట్రేషన్‌లో ఉందో అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. జర్నలిస్టుల పట్ల తమకు గౌరవం ఉందని, ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సొంత పత్రికలు లేదా సొంత టీవీలను పెట్టుకోలేదని తెలిపారు. జర్నలిస్టు రేవతికి సంబంధించిన వీడియోను చూస్తే, ఆమె ఎలాంటి భాషను ఉపయోగించారో అందరికీ స్పష్టంగా తెలుస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వెంటనే జర్నలిస్టులకు మద్దతుగా మాట్లాడిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కోరారు.