Big Stories

BJP : అంతా బీజేపీనే చేసిందా? దొరికాక డ్రామా అంటోందా?

BJP : అంతా బీజేపీనే చేసిందనేది టీఆర్ఎస్ ఆరోపణ. తమ నలుగురు ఎమ్మెల్యేలను కొనేందుకు ఆ ముగ్గురిని పంపించింది కమలనాథులే అంటున్నారు. ఏమో అదీ నిజమే కావొచ్చు. ఎనిమిది మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారంటూ ఇటీవల ఆ పార్టీ నేతలు బహిరంగంగానే ప్రకటించారు. మహారాష్ట్రలో శివసేన-షిండే ఎపిసోడ్ మాదిరే.. తెలంగాణలో త్వరలోనే కారు పార్టీ చీలిపోతుందంటూ గతంలో కాషాయ శిబిరం నుంచి పలు కామెంట్లు వినిపించాయి. ఇటీవల బూర నర్సయ్య గౌడ్ ను సైతం పార్టీలో చేర్చుకుంది. వరుస పరిణామాలు చూస్తుంటే.. ఏమో టీఆర్ఎస్ ఆరోపణ నిజమేనేమో? అదంతా చేసింది బీజేపీనేమో? ఫాంహౌజ్ కు ఆ ముగ్గురు మధ్యవర్తులను పంపించింది కమలనాథులేమో? అనే అనుమానమూ వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.

ఆపరేషన్ ఆకర్ష్ బీజేపీకి కొత్తేం కాదు. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూలగొట్టిన ఘనత ఆ పార్టీది. బీజేపీ ఏమీ మిస్టర్ క్లీన్ పార్టీ కాదనే విమర్శ ఉంది. పైగా.. పార్టీల నుంచి ఎమ్మెల్యేలను లాగడంలో ఆ పార్టీ ఎక్స్ పర్ట్. కుదిరితే డీల్.. లేదంటే ఈడీ, సీబీఐ. ఇదే బీజేపీ స్ట్రాటజీ అంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తూనే ఉన్నాయి. అయితే, వేరే రాష్ట్రాల్లో ఇలాంటి వ్యవహారాలు సీక్రెట్ గా సాగగా.. తెలంగాణలో మాత్రం రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయారనేది కొందరి మాట.

మధ్యవర్తుల్లో ఇద్దరు స్వామీజీలు ఉండటంతో కాషాయం వైపు పలు అనుమానాలు. పైలెట్ రోహిత్ రెడ్డి ఎప్పటినుంచో ఆ స్వామీజీ శిష్యుడిగా ఉండటంతో.. ఆ గురువు గారితోనే బీజేపీ పెద్దలు డీల్ మాట్లాడించారని గులాబీ వర్గం భావిస్తోంది. నందకుమార్ కు సైతం కిషన్ రెడ్డితో, బండి సంజయ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తుండటంతో అందరి అనుమానం బీజేపీపైనే ఉందంటున్నారు.

ప్రస్తుత సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలను కొనాల్సిన అవసరం గానీ, ఆ సత్తా గాని కేవలం బీజేపీకి మాత్రమే ఉంది. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎలాగైనా పడగొట్టాలని కమలనాథులు గట్టి సంకల్పంతో ఉన్నారనేది ఓపెన్ సీక్రెట్. ఇలా ఎలా చూసినా.. ఆ పని బీజేపీనే చేయించినట్టుందనే చర్చ నడుస్తోంది. కమలనాథులు తమకేం సంబంధం లేదని ఎంతగా మీడియా ముందు ఊదరగొడుతున్నా.. నమ్మే పరిస్థితి లేదంటున్నారు. పైగా బీజేపీ వాళ్లు అంతలా ఉలిక్కిపడుతుండటం.. వరుసపెట్టి లీడర్లంతా ప్రెస్ మీట్లు పెడుతుండటం చూస్తుంటే ఏదో జరిగే ఉంటుందనే అనుమానం బలపడుతోంది.

అయితే, టీఆర్ఎస్ బీజేపీనే కార్నర్ చేస్తున్నా.. కాషాయం తాము కాదంటున్నా.. పోలీసులు అదుపులో ఉన్న ఆ ముగ్గురు మధ్యవర్తులు ఇచ్చే స్టేట్ మెంట్ కీలకంగా మారుతుందని అంటున్నారు. అయితే, వాళ్లు సైతం తాము కేవలం పూజలకే వచ్చామని చెప్పినా.. వారి మధ్య జరిగిన ఫోన్ ఆడియోలు లీక్ అయితే.. అప్పుడు తెలుస్తుంది అసలు సంగతి. అందాకా.. ఎవరి గోల వారిదే.

ఇవి కూడా చదవండి

Latest News