TRS MLAs : నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. 250 కోట్లు. ఇదీ బేరం. అంతకుముందే ఫోన్ కాల్స్ లో ఓ రేటు ఫిక్స్ చేసుకున్నారని అంటున్నారు. ఫైనల్ డీల్ కోసం మోయినాబాద్ ఫాంహౌజ్ కు చేరుకోవడం.. పోలీసుల రైడ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోవడం.. తెలంగాణలో తీవ్ర ప్రకంపణలు సృష్టిస్తోంది. ఆ నలుగురిని కొనాలని చూసిందే బీజేపీ వాళ్లే అని టీఆర్ఎస్ అంటుంటే.. వారిని ఆ ఎమ్మెల్యేలకు అంత సీన్ లేదంటూ, మధ్యవర్తులతో తమకేమీ సంబంధం లేదంటూ కమలనాథులు కౌంటర్ ఇస్తున్నారు. హాట్ టాపిక్ గా మారిన ఈ ఎపిసోడ్ లో అనేక చిక్కుముడులు. క్లారిటీ లేని ప్రశ్నలు. అంతకుమించి అనుమానాలు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్, టీఆర్ఎస్ దొందుదొందేననే విమర్శలు.
రామచంద్ర భారతి, సింహయాజి, నందకిశోర్. ఈ ముగ్గురు.. నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టడానికి వచ్చారనేది ఆరోపణ. వాళ్లని పంపించింది బీజేపీనే అనేది గులాబీ మాట. అలాంటిదేమీ లేదు.. తాము ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఫాంహౌజ్ లో పూజలు చేయడానికి వచ్చామనేది మధ్యవర్తుల వాదన. డబ్బు, పదవులు, కాంట్రాక్టులు ఇస్తామని.. లేదంటే ఈడీ, సీబీఐ దాడులు తప్పవంటూ తమను దారికి తెచ్చుకునే ప్రయత్నం చేశారని ఆ నలుగురు ఎమ్మెల్యేలు చెబుతున్నారు. తెలంగాణ నాట్ ఫర్ సేల్ అంటూ టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్ చేస్తోంది.
ఫాం హౌజ్ మేటర్ ఇలా బ్రేక్ అయిందో లేదో.. అలా బీజేపీ నేతలు ఒక్కొక్కరిగా కౌంటర్లు స్టార్ట్ చేశారు. అర్థరాత్రి ప్రెస్ మీట్లు, మీడియాలకు ఫోన్ ఇన్ లతో తమకేం సంబంధం లేదంటూ బలంగా వాదించారు. ఆ ఎమ్మెల్యేలకు 100 కోట్లా? వారి వల్ల మునుగోడులో ఒక్క ఓటైన పడుతుందా? అంటూ రివర్స్ కౌంటర్స్ వేస్తున్నారు కమలనాథులు. ఇదంతా కేసీఆర్ ఆడిస్తున్న డ్రామా అని.. ఎమ్మెల్యేలను కొనడం ఆయనకే అలవాటు అంటూ బండి సంజయ్, కిషన్ రెడ్డి, లక్ష్మణ్, ధర్మపురి అరవింద్, రఘునందన్, ఈటల రాజేందర్ లాంటి బడా నేతలంతా ఎదురు దాడికి దిగారు.
తమకేం సంబంధం లేదంటూ బీజేపీ నేతలు ఎంత గట్టిగా చెబుతున్నా.. మరి విజువల్స్ లో ఉన్న ఆ ముగ్గురు ఎవరు పంపిస్తే వచ్చారు? వారి దగ్గర నిజంగా డబ్బు దొరికిందా? ఢిల్లీ, తిరుపతి, హైదరాబాద్ ఇలా వేరు వేరు ప్రాంతాలు, వేరు వేరు బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఆ ముగ్గురు నిజంగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనాలని చూశారా? చూస్తే, వారిని పంపించింది ఎవరు? వారికి డబ్బు సరఫరా చేసేది ఎవరు? ఇకవేళ ఇది టీఆర్ఎస్ డ్రామానేనా? పోలీసు విచారణలో ఆ ముగ్గురు మధ్యవర్తులు చెప్పే సమాచారం కీలకంగా మారనుంది. వారు నోరు విప్పితేనే అసలు నిజం బయటకు వస్తుంది?