DK Aruna: స్వేచ్ఛ బ్యూరో : ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకోవడంతోనే.. ఎన్నిక జరగకుండా అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతూ, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని మండిపడ్డారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్, అధికారంలోకి రాగానే సిగ్గులేకుండా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తమ పార్టీలో చేర్చుకుందని డీకే అరుణ ధ్వజమెత్తారు.
ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడానికి సిగ్గు ఎందుకు..
ప్రస్తుతం ఫిరాయించిన ఎమ్మెల్యేలు తాము ఏ పార్టీకి చెందినవారమో ప్రజలకు చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తాము బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నామని, అన్ని హామీలను అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ నాయకులకు.. మళ్ళీ ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడగడానికి సిగ్గు ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు మళ్లీ గెలుస్తామనే నమ్మకం ఉంటే.. ఫిరాయింపు ఎమ్మెల్యేలందరితో తక్షణమే రాజీనామాలు చేయించి, ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని డిమాండ్ చేశారు.
దమ్ముంటే రాజీనామా చేసి గెలవాలి!
బీఆర్‌ఎస్ గుర్తుపై గెలిచి, సిగ్గు లేకుండా కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఎమ్మెల్యేలకు దమ్ము, ధైర్యం ఉంటే రాజీనామా చేసి తిరిగి గెలవాలని సవాల్ విసిరారు. గతంలో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని, రాబోయే రోజుల్లో కూడా అక్కడ బీజేపీ మళ్లీ ఘన విజయం సాధిస్తుందనే విశ్వాసం తమకు ఉందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఖైరతాబాద్ ప్రజలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు పార్టీల వైఖరిని అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ, ప్రధాని మోడీ ఎటువంటి పక్షపాతం చూపకుండా రాష్ట్ర అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారని ఆమె గుర్తుచేశారు.
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లకు ప్రజలు బుద్ధి చెప్పాలి
తెలంగాణ ప్రజలు బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండింటి పాలనను చూశారని.. ఈ రెండు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ రెండు వేర్వేరు కాదని, లోపాయికారి ఒప్పందంతో పని చేస్తున్న ఒకే నాణేనికి ఉన్న రెండు ముఖాలని విమర్శించారు. అభివృద్ధిని కుంటుపరిచిన ఈ రెండు పార్టీలకు ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని అన్నారు.
పలువురు భేటీ..
ఇదిలాఉండగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శిగా నియామకమైన మధుకర్ ను డీకే అరుణ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మధుకర్ ను శాలువాతో సన్మానించి, శుభాకాంక్షలు తెలిపారు. ఆపై తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలు, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఎన్ రోల్ మెంట్, సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కర్ణాటక సహ ఇన్ చార్జీ కాసం వెంకటేశ్వర్లు, ఎంపీ గోడెం నగేశ్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Also Read: జగద్గిరిగుట్టలో వరుస చోరీలు.. రూ.58 లక్షల సొత్తు మాయం