Rangareddy: స్వేచ్ఛ బ్యూరో: మద్యం మహమ్మారి మనుషుల్లోని మంచితనాన్ని, మానవత్వాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తోంది. పైసల కోసం, తాగుడు వ్యసనం కోసం ఏ కన్నప్రేమనూ చూడకుండా ప్రాణాలు తీసే స్థాయికి దిగజార్చుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లాలో వెలుగుచూసిన ఒక దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆస్తి రాయలేదన్న కోపంతో ఒక కన్నకొడుకు తండ్రినే అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
వ్యసనానికి బానిసై.. ఆస్తిని కరిగించి!
రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండల పరిధిలోని దూసకల్ గ్రామానికి చెందిన పోచయ్య (70)కు మల్లేశ్ అనే కొడుకు ఉన్నాడు. మల్లేశ్ కొంతకాలంగా మద్యానికి పూర్తిగా బానిసయ్యాడు. రోజూ తాగి వచ్చి ఇంట్లో నరకం చూపించేవాడు. మద్యం కొనుక్కునేందుకు గతంలో కొంత భూమిని కూడా అమ్మేసి, ఆ డబ్బుతో జల్సాలు చేశాడు. ఆ సొమ్ము పూర్తయ్యాక, మిగిలిన ఆస్తిని కూడా తన పేరిట రాయాలని తండ్రిపై తీవ్ర ఒత్తిడి తెచ్చాడు.
మిగతా కొడుకుల కోసం తండ్రి నిరాకరణ
అయితే తనకున్న మిగతా ఇద్దరు కొడుకుల భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆవేదనతో పోచయ్య భూమిని రాయడానికి ఒప్పుకోలేదు. దీంతో తండ్రిపై మల్లేశ్ కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం అర్ధరాత్రి దాటాక, నిద్రిస్తున్న తండ్రి తలపై పెద్ద బండరాయితో మోది అత్యంత దారుణంగా హత్య చేశాడు.
కేసు నమోదు..
రక్తపు మడుగులో పడివున్న పోచయ్యను చూసి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: ప్రధాని మోదీతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం.. ఏపీ అభివృద్ధిపై చర్చ