Vikarabad Earthquake: ఓవైపు భారీ వర్షాలు.. మరోవైపు భూ ప్రకంపనలతో తెలంగాణ ప్రజలు వణికిపోతున్నారు. గురువారం ఉదయం ఒక్కసారిగా భూమి కంపించడంతో హడలిపోయారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఆ ప్రాంత ప్రజల్లో ఇంకా టెన్షన్ కొనసాగుతోంది. ఇంతకీ ఎక్కడ అన్న వివరాల్లోకి వెళ్లొద్దాం.
తెలంగాణలో గురువారం ఉదయం భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో ఈ ఉదయం కొద్ది సెకన్ల సేపు భూమి కంపించింది. ఉన్నట్లుండి భూమి కాస్త షేక్ కావడంతో ప్రజలు కంగారుపడ్డారు.
రెండుమూడు సార్లు అదే కంటిన్యూ కావడంతో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. రంగాపూర్, బసినపల్లి, న్యామత్ నగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మళ్లీ భూప్రకంపనలు వస్తాయని భయంతో ఇంకా ప్రజలు రెండుగంటలపాటు బయట ఉన్నట్లు తెలుస్తోంది.
గతంలో కూడా ఈ ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు. కంటిన్యూగా రావడంతో ప్రజలు కాసింత భయాందోళనకు గురవుతున్నారు. గతేడాది వికారాబాద్ జిల్లాలో 2.5 తీవ్రతతో భూప్రకంపనలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ విభాగం తెలిపింది.
ALSO READ: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అనుకూలించని వాతావరణం, ఐదు విమానాలు మళ్లింపు
నార్మల్‌గా తెలంగాణ రాష్ట్రంలో తక్కువ భూకంపాలు వచ్చే జోన్‌లో ఉంది. ఈ ప్రాంతాన్ని జోన్ -2 కింద పరిగణిస్తారు. అయినప్పటికీ అప్పుడప్పుడు స్వల్పంగా ప్రకంపనలు నమోదు అవుతునే ఉన్నాయి. గత డిసెంబర్‌లో ములుగు జిల్లాలో ఐదుకి పైగానే ప్రకంపనలు వచ్చాయి. గడిచిన ఐదు దశాబ్దాల కాలంలో దీన్ని అతిపెద్ద భూకంపంగా గుర్తించారు సంబంధించి అధికారులు.
ఇదిలావుండగా బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా తెలంగాణ అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రంలో ఎడతెరిపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఓవైపు వర్షం పడుతుండగా, ఇంకోవైపు ప్రకంపనలు రావడంతో ప్రజలు హడలిపోతున్నారు.