Formula E Race Case: రాజకీయ నాయకులు ఈ మధ్య ట్రెండ్ మార్చారా? ఏదైనా కేసు విచారణకు హాజరైనవారు.. తామే విచారణ అధికారులకు ప్రశ్నలు వేశామంటున్నారా? ఇందుకు ఎగ్జాంఫుల్ ఫార్ములా ఈ రేసు కేసు వ్యవహారమా? ఈ కేసు దర్యాప్తు ఓ వైపు ఏసీబీ, మరోవైపు ఈడీ జోరుగా చేస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం ఈడీ ముందు హాజరయ్యారు కేటీఆర్.
దర్యాప్తు తర్వాత సినిమా స్టయిల్‌లో మీడియా ముందు డైలాగ్స్ చెప్పారు కేటీఆర్. అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేశారాయన. కేసు విచారణకు గురించి చెప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుతోసే ప్రయత్నం చేశారాయన. కానీ లోపల విచారణ మరోలా ఉన్నట్లు తెలుస్తోంది.
మొత్తం ఈడీ అధికారులు ఆరున్నర గంటల సేపు కేటీఆర్‌ను విచారించారు. ఈడీ ప్రశ్నలన్నీ మనీలాండరింగ్, బాండ్ల చుట్టూనే విచారణ జరిగింది. మొత్తం 52 ప్రశ్నలు కేటీఆర్‌కు ఈడీ అధికారులు సంధించారు. బీఆర్ఎస్‌కు-గ్రీన్ కో అనుబంధ కంపెనీల ఎలక్టోరల్ బాండ్ల వెనుక మతలబు ఏంటి? రూ. 41 కోట్ల రూపాయలు బాండ్లు ఇచ్చిన 15 రోజుల్లోనే ఫార్ములా ఈ రేసు అగ్రిమెంట్ ఎలా జరిగింది? ఈ తతంగానికి మీడియేటర్ ఎవరు?
బ్రిటన్ కంపెనీకి మనీ ట్రాన్స్‌ఫర్ చేసినప్పుడు ఎందుకు ఆర్బీఐ రూల్స్ పాటించలేదు? ఎన్నికల కోడ్ సమయంలో విదేశీ కంపెనీకి నిధులు చెల్లించడం వెనుక కారణమేంటి? మీరు చెబుతేనే చేశామని అధికారులు అంటున్నారు? ఈ ప్రపోజల్ ఎవరు తెచ్చారు? స్పాన్సర్‌గా వ్యవహరించిన ఏస్ నెక్స్ జెన్ సంస్థ గురించి పదేపదే ఆరా తీసినట్టు సమాచారం. మొత్తం డాక్యుమెంట్లు దగ్గరపెట్టి ప్రశ్నించింది ఈడీ.
ALSO READ: “లై డిటెక్టర్ టెస్ట్ కు సిద్ధమే..” – కేటీఆర్
రూల్స్ చూసుకోవాల్సిన బాధ్యత అధికారులేనని సమాధానం ఇచ్చారట కేటీఆర్. దాదాపు 30 ప్రశ్నలకు సమాధానాలు దాటవేశారని తెలుస్తోంది. కొన్నింటికి సైలెంట్‌గా ఉన్నారట. నాలుగు సీజన్లకు రూ.600 కోట్ల ఖర్చు చేసేందుకు సిద్ధమని ఎఫ్ఈవోతో చేసిన ఒప్పందంపైనా ప్రశ్నించింది. వందల కోట్లు ప్రభుత్వానికి లాభాలు వచ్చాయని చెప్పిన కేటీఆర్, ఆ నిధులెక్కడ అనేదానికి సమాధానం ఇవ్వలేదట.
మరోవైపు ఏస్ నెక్ట్స్ జెన్ సంస్థకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది. శనివారం విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, అప్పటి చీఫ్ ఇంజనీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఏసీబీ విచారించిన విషయం తెల్సిందే.
అసలు ఈ గేమ్ విషయంలో ఎలాంటి అనుభవం లేదని గ్రీన్ కో డైరెక్టర్లు, ఏస్ నెక్ట్స్ జెన్ పేరిట హడావుడిగా మూడు కంపెనీలను ఎందుకు రిజిస్ట్రేషన్లు చేయించారు? అనేదానిపై ఏసీబీ ఇప్పటికే ప్రశ్నలు రెడీ చేసినట్టు సమాచారం. గ్రీన్ డైరెక్టర్లు చలమలశెట్టి అనిల్, హరీష్ కొల్లి హాజరయ్యే ఛాన్స్ ఉంది.