Electricity: తెలంగాణలో 24 గంటల విద్యుత్ అందించాలని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. అందుకు తగినట్టుగానే సరఫరా చేస్తున్నది. బీఆర్ఎస్ నాయకులు ఆరోపణలు చేయగా.. వాటిని సమర్థవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంది. 24 గంటల విద్యుత్ నిరంతరాయంగా అందిస్తున్నామని స్పష్టం చేసింది. తాజాగా విద్యుత్ శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.
తెలంగాణ త్వరలో ఒక బిజినెస్ హబ్‌గా మారబోతున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కాబట్టి, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఐటీ, ఇండస్ట్రియల్ శాఖలతో సమన్వయం చేసుకుని యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకోవాలని సూచించారు.
ఈ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి మాట్లాడారు. సోలార్ విద్యుత్ వినియోగం పెరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం ఆదేశించారు. డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి ఉండాలని స్పష్టం చేశారు. వివిధ శాఖల్లో ఖాళీగా లేదా వినియోగంలో లేని భూముల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పారు.
అలాగే, రైతులకు సోలార్ పంప్ సెట్లను ఉచితంగా అందించి.. వారిని సోలార్ విద్యుత్ వైపు నడిపించాలని, వారిని ప్రోత్సహించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సోలార్ పంప్ సెట్లను వినియోగించడం ద్వారా వచ్చిన మిగులు సోలార్ విద్యుత్ ద్వారా రైతుకు ఆదాయం సమకూరేలా ప్లాన్లు రెడీ చేయాలని ఆదేశించారు. ఇక గృహిణులకు వంట గ్యాస్ బదులు సోలార్ సిలిండర్ విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. వీటిపై మహిళా సంఘాలకు శిక్షణ అందించి వారిని సోలార్ సిలిండర్ బిజినెస్ వైపు ప్రోత్సహించాలని చెప్పారు.
Also Read: Artificial Intelligence: నేటి నుంచే గ్లోబల్ ఏఐ సదస్సు.. వేదికగా హైదరాబాద్
అటవీ భూముల్లోనూ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి యేటా 40 వేల మెగా వాట్స్ విద్యుత్ అందుబాటులో ఉండేందుకు చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి దుబారాను తగ్గించాలని సూచించారు. ఒక్క నిమిషం కూడా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉండొద్దని పునరుద్ఘాటించారు. వినియోగదారులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని, అలా చేస్తామనే నమ్మకాన్ని వారిలో చూరగొనాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యుత్ సరఫరాలో వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు కలుగనీయొద్దని తెలిపారు.
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం, రోనాల్డ్ రోస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. విద్యుత్ శాఖ రాబడి, డిస్కమ్స్ రెవెన్యూ లోటు సహా ఇతర అంశాలపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌ను ఫోర్త్ సిటీగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పెట్టుబడుల కోసం విదేశీ పర్యటనలు చేస్తున్నారు. అందుకు తగినట్టుగా మౌలిక వసతుల కల్పన కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్రణాళికలు వేస్తున్నారు.