Hyderabad Rains: ఒక వైపు తెలుగు రాష్ట్రాలు భారీ వర్షానికి కుదేలై.. వరదలతో సతమతం అవుతుండగామరో పిడుగు లాంటి వార్త వచ్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడుతున్నదని, రేపటి నుంచి మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయనేది వాతావరణ శాఖ అంచనా. దీంతో వానగండం ఇంకా సమసిపోలేదని తెలుస్తున్నది. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వాన భయం పట్టుకుంది.
ఇదిలా ఉండగా.. బుధవారం రాత్రి హైదరాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారింది. సాయంత్రం దాకా ఆకాశం మేఘావృతమై ఉన్నా.. వర్షం పెద్దగా పడలేదు. కానీ, రాత్రి 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా వాతావరణం అనూహ్యంగా మారీ భారీ వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం సూచనలు చేసింది.
తెలుగు రాష్ట్రాలను వరుణుడు వదలడం లేదు. బంగాళాఖాతంలో గురువారం మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఈనెల 9 వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. వాతావరణ శాఖ అందించే సమాచారాన్ని, స్థానిక నిపుణులు అందించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు అనుసరిస్తూ, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
వాగులు, వంకలు, నదుల వద్ద వరద ప్రవాహం అధికంగా ఉంటుందని, వాటి వద్దకి ఎవరూ వెళ్లవద్దని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు నీరు నిలిచి ఉన్న చోట, రోడ్లపై నడిచేప్పుడు మ్యాన్ హోల్స్‌ను చూసుకొని నడవాలని సూచించింది. జీహెచ్ఎంసీ సిబ్బంది తప్పితే ఎవరూ కూడా మ్యాన్ హోల్స్‌ను తెరిచే ప్రయత్నం చేయవద్దని, అది చట్టరీత్యా నేరమని చెప్పింది. ట్రాన్స్ ఫార్మర్లను, విద్యుత్ స్తంభాలను తాకవద్దని, ముఖ్యంగా చిన్న పిల్లలను వీటికి దూరంగా ఉంచాలని తెలిపింది. పొంగుతున్న జలాశయాలు, చెరువులు, వాగులు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లే సాహసం చేయరాదని, వర్షం వల్ల వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉంది కావున పరిమిత వేగంతో నడపాలని చెప్పింది వాతావరణశాఖ.
Also Read: Sundeep Kishan: వరద బాధితులకు కుర్ర హీరో సాయం.. శభాష్ సందీప్
విపత్కర సమయాల్లో సహాయం కోసం జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్ నెంబర్ 040-21111111 కి, డీఆర్ఎఫ్ 9000113667 నెంబర్‌కి కాల్ చేయొచ్చని
సూచనలు చేసింది.
గురువారం వర్షాలు పడే జిల్లాలు
రాష్ట్రంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఉరుములు,
మెరుపులతో కూడిన వర్షాలు, ఈదురు గాలులు అన్ని జిల్లాలలో ఉండే అవకాశం ఉంది.
గత రెండు మూడు రోజులుగా తెలుగు రాష్ట్రాలను భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ చుట్టూ వరదలతో చాలా ప్రాంతాలు మునిగిపోయాయి. డజనుకు మించి జనాలు ఈ వర్షాల సంబంధ ఘటనల్లో మరణించారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ఖమ్మంలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేశాయి. మున్నేరు మూలంగా పలువురు మరణించారు కూడా. ఉభయ రాష్ట్రాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగుతున్నాయి.