Ex CM KCR: మాజీ సీఎం కేసీఆర్ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో బాధపడుతున్న ఆయన్ను కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లు కేసీఆర్‌కు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు.
సీజనల్ వ్యాధుల వల్ల అస్వస్థత
వైద్యుల ప్రాథమిక వివరాల ప్రకారం, కేసీఆర్ ప్రస్తుతం సీజనల్ వ్యాధులతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం నుంచి ఆయన ఆరోగ్యం బాగోలేనట్టు అనిపించడంతో.. కుటుంబ సభ్యులు హుటాహుటినా సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చేర్చారు.
వైద్యపరీక్షలు కొనసాగుతున్నాయి
ప్రస్తుతం యశోదా ఆసుపత్రిలో ఉన్న కేసీఆర్‌కు వైద్యులు పలు రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్లడ్ టెస్టులు, స్కాన్‌లు, ఇతర సాధారణ వైద్య నిర్ధారణ పరీక్షలు చేయిస్తున్నట్టు సమాచారం. ఆయన ఆరోగ్య పరిస్థితిపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వైద్య బృందం నిశితంగా పరిశీలన కొనసాగిస్తోంది. ఆసుపత్రి వర్గాల ప్రకారం, కాసేపట్లో అధికారిక హెల్త్ బులెటిన్ విడుదల కానుంది.
కుటుంబ సభ్యులు, నేతల సందర్శన
కేసీఆర్ చేరిక వార్త తెలిసిన వెంటనే.. కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన కుమారుడు, మాజీ మంత్రి కేటీఆర్ వెంటనే ఆసుపత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అదే విధంగా బీఆర్ఎస్‌కు చెందిన కొంతమంది సీనియర్ నాయకులు కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. నాయకత్వం కోల్పోయిన తర్వాత కొంతకాలంగా దూరంగా ఉన్న కేసీఆర్, తిరిగి పార్టీ పునర్‌వ్యవస్థీకరణ పనుల్లో నిమగ్నమయ్యారు. ఇలాంటి సమయంలో ఆయన ఆరోగ్యం క్షీణించడంతో బీఆర్‌ఎస్ వర్గాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Also Read: నా కూతురు ఆలోచనను మేము కాదనలేం: కొండా సురేఖ
అభిమానుల్లో ఆందోళన
కేసీఆర్ ఆరోగ్యంపై వార్తలు మీడియాలో రావడంతో.. ఆయన అభిమానుల్లో ఆందోళన మొదలైంది. రాజకీయ భవిష్యత్తు ప్రక్రియలో ఆయన పాత్ర కీలకంగా ఉంటుందని భావిస్తున్నవారు, ఈ సమయంలో ఆయన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకోవాలని సూచిస్తున్నారు.