Konda Surekha: ఒకరు మాకెదురొచ్చినా మీకే రిస్కు.. ఒకరికి మేమెదురెళ్లినా వాళ్లకే రిస్కు! కొరివితో తలగోక్కున్నా ఒకటే.. కొండా దంపతులతో పెట్టుకున్నా ఒకటే. వరంగల్ మొత్తం ఇప్పుడిలాంటి డైలాగులే రీసౌండ్‌లో వినిపిస్తున్నాయ్. జిల్లాలో కొండా ఫ్యామిలీ నోరు ఎక్కువైందని.. ఓరుగల్లు కాంగ్రెస్ నేతలంతా ఒక్కటై పోరు చేస్తుంటే.. కొండా దంపతులు ఒంటరిగానే కౌంటర్ చేస్తున్నారు. ఎవ్వరి లెక్కలు ఎట్లున్నా.. తాము మాత్రం తగ్గేదేలే అంటున్నారు. తమకు ప్రజాబలం ఉందని.. అదే తమ ధైర్యమని చెబుతున్నారు. అంటే.. ఓరుగల్ల కాంగ్రెస్‌లో రాజుకున్న కొర్రాసు.. ఇప్పట్లో చల్లారే అవకాశం లేదని తెలుస్తోంది.
వరంగల్ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం, నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధానికి సంబంధించి.. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్‌తో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. వరంగల్‌లోని తాజా రాజకీయపరిణామాలన్నింటిని వివరించారు. ముఖ్యంగా.. వరంగల్ కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయాలపై.. మీనాక్షి నటరాజన్‌కు పూసగుచ్చినట్లు తెలియజేసేలా.. 16 పేజీల లేఖ ఇచ్చారు కొండా మురళి. నాయిని రాజేందర్ రెడ్డి చేసి వ్యాఖ్యలను.. మీనాక్షి దృష్టికి తీసుకెళ్లారు కొండా మురళి. ఇష్యూ క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉన్నా.. తనని రెచ్చగొడుతున్నారని చెప్పారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధినని.. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తోందని చెప్పారు. ఎవరి గురించి తాను కామెంట్ చేయనని.. కేసులకు భయపడనని చెప్పారు. తనకు ప్రజాబలం ఉందన్నారు కొండా మురళి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే తమ లక్ష్యమని తెలియజేశారు.
తాను బీసీ కార్డు పట్టుకునే బతుకుతున్నానన్నారు కొండా మురళి. పార్టీ ఎవరికి టికెట్లు ఇచ్చినా.. గెలిపించే బాధ్యత తీసుకుంటానని ఇంచార్జ్ మీనాక్షితో చెప్పినట్లు తెలిపారు. కాంగ్రెస్‌ని బతికించడమే తమ ఉద్దేశమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచేలా కృషి చేస్తానన్నారు. తాను ఎవరికీ భయపడబోనని.. గ్రూపు రాజకీయాలతో తనకు సంబంధం లేదని చెప్పారు.
రేవంత్‌ని మరో పదేళ్లు సీఎంగా చూడాలనుకుంటున్నానని తెలిపారు కొండా మురళి. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక.. తమ కూతురు పరకాలలో పోటీ చేసే విషయం తెలియదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
కొండా సురేఖ కూడా తనకు ఇచ్చిన శాఖలకు న్యాయం చేస్తునానని చెప్పారు. తమ కూతురికి ఎమ్మెల్యే అవ్వాలనే ఆలోచన రావడంలో తప్పులేదన్నారు. ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయని.. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.
Also Read: ఈ వార్తలకు ఫుల్‌స్టాప్.. బరాబర్, నిర్మాణంలో నేనున్నా, ప్రత్యర్థులకు చెమటలు
నా కూతురు ఆలోచనను మేము కాదనలేం అన్నారు కొండా సురేఖ. తన భవిష్యత్తును ఎలా ప్లాన్ చేసుకోవాలో నిర్ణయించుకునే హక్కు తనకు ఉంది. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూస్తాం అని చెప్పారు.