BJP : తెలంగాణ బీజేపీ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు అభ్యర్థులను అధిష్టానం ప్రకటించలేదు. కీలక నేతల పోటీపైనా స్పష్టత ఇవ్వలేదు. దీంతో అయోమయంలో బీజేపి క్యాడర్ ఉంది. జాబితా ఎప్పుడు విడుదల చేస్తారంటూ నేతలు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి.
బీజేపీ టికెట్ల కోసం 6 వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలుస్తోంది. అందులో వెయ్యిమందిపైగా మహిళలు దరఖాస్తు చేసుకున్నారని సమాచారం. అయితే అభ్యర్థుల ప్రకటన ఆలస్యంతో కేడర్ ఢీలా పడుతోంది. ఈ సమయంలో విజయశాంతి చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.
విజయశాంతి చేసిన ట్వీట్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. గజ్వేల్ నుంచి బండి సంజయ్‌ను, కామారెడ్డి నుంచి తనను పోటీ చేయాలని కార్యకర్తలు అడగడంలో తప్పు లేదని ఆమె పేర్కొన్నారు. అలాగని అసెంబ్లీకి పోటీ చేయాలన్నది తన ఆలోచన కాదంటూ విజయశాంతి ట్వీట్ చేయడం ఆసక్తిని రేపింది. మరి బీజేపీ అధిష్టానం కూడా బండి సంజయ్ ను గజ్వేల్ లో , విజయశాంతిని కామారెడ్డిలో పోటీ చేయించాలని భావిస్తుందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
బీఆర్ఎస్ అధినేత , సీఎం కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో రెండు చోట్ల నుంచి బరిలోకి దిగుతున్నారు. సిట్టింగ్ స్థానం గజ్వేల్ తోపాటు, కామారెడ్డి నుంచి పోటీ చేయబోతున్నారు. కేసీఆర్ పై బలమైన అభ్యర్థులను రంగంలోకి దించే యోచనలో కాషాయ పెద్దలు ఉన్నారని తెలుస్తోంది. గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని గతంలో చాలాసార్లు ఈటల రాజేందర్ ప్రకటించారు. ఇప్పుడు తెరపైకి బండి సంజయ్ పేరు రావడం మరింత ఆసక్తిని రేపుతోంది. అలాగే కామారెడ్డి నుంచి విజయశాంతి పోటీపై వార్తలు రావడం పొలిటికల్ హీట్ మరింత పెరిగింది. త్వరలోనే గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. మరి బండి సంజయ్ , విజయశాంతిలను కేసీఆర్ పై పోటీకి కాషాయ పెద్దలు దించే యోచనలో ఉన్నారా?