
CBI: సంచలనం సృష్టించిన ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసును సీబీఐకు అప్పగిస్తూ తీర్పు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ఇప్పటికే ఈ కేసులో సిట్ విచారణ దూకుడుగా సాగుతుండగా.. కేసును వెంటనే సీబీఐకు బదలాయించాలని హైకోర్టు ఆదేశించింది. ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు తెలంగాణ సర్కారుకు బిగ్ షాక్.
కేసులు సిట్ నుంచి సీబీఐకు బదలాయించాలంటూ హైకోర్టులో మొత్తం 5 పిటిషన్లు దాఖలు అయ్యాయి. అందులో బీజేపీ వేసిన పిటిషన్ తో పాటు మరో పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది. ముగ్గురు నిందితులు వేసిన పిటిషన్లలో తీర్పు ఇస్తూ.. కేసును సీబీఐకు అప్పగిస్తూ తీర్పు వెలువరించింది.
ఫాంహౌజ్ కేసులో సిట్ దర్యాప్తు పక్షపాత ధోరణితో జరుగుతోందని.. కేసు విచారణలో ఉండగానే కీలక సాక్షాలు, సీడీలు, ఎఫ్ఐఆర్ కాపీతో సహా అన్నీ ముఖ్యమంత్రికి ఎలా చేరాయని నిందితులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసును సీబీఐకు అప్పగించాలనే విన్నపాన్ని పరిగణలోకి తీసుకుని.. సిట్ ను, రాష్ట్ర ప్రభుత్వ ఎఫ్ఐఆర్ ను కూడా కంప్లీట్ గా రద్దు చేస్తూ.. కేసును పూర్తి స్థాయిలో సీబీఐకు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది హైకోర్టు.