
Sircilla: సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు వచ్చాయి. ఈసారి అధికార పార్టీకి ఎలాగైనా ఝలక్ ఇవ్వాలనే ప్రతిపక్షాల పట్టుదల.. కేటీఆర్ ముందు పారలేదు. ఒక్కటంటే ఒక్క స్థానంలో మాత్రమే విపక్ష అభ్యర్థి గెలిచారు. సిరిసిల్ల గడ్డా.. కేటీఆర్ అడ్డా.. అనేలా మొత్తం 15కి 14 సీట్లు బీఆర్ఎస్ గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ లకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ చేసింది. కౌంటింగ్ సందర్భంగా సిరిసిల్లలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. బీఆర్ఎస్, బీజేపీ శ్రేణులు గొడవకు దిగాయి. పోలీసులు లాఠీఛార్జి చేయాల్సి వచ్చింది. ఉద్రిక్తతల నడుమ.. వేములవాడ రూరల్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది.
సెస్ ఎలక్షన్స్ కు ముందు సిరిసిల్లలో పొలిటికల్ హీట్ తారాస్థాయికి చేరింది. సిరిసిల్ల జిల్లాలో ఏడేళ్ల తర్వాత సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికలు జరిగాయి. మెజార్టీ ఓటర్లు రైతులే. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను దెబ్బకొడితే.. ఆ షాక్ తెలంగాణ వైజ్ గా తగులుతుందని ప్రతిపక్ష పార్టీలు భావించాయి. సొంత ఇలాఖా కావడంతో మంత్రి కేటీఆర్ సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పోరు హోరాహోరీగా సాగింది. సత్తా చాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. బీఆర్ఎస్ ను ఎలాగైనా ఓడించాలనే కసి బీజేపీలో కనిపించింది. అలా, సిరిసిల్ల సెస్ ఎన్నికలపై అందరి ఫోకస్ పడింది.
సెస్ ఎలక్షన్స్ ఉన్నాయని సిరిసిల్ల రైతులకు ప్రభుత్వం ముందుగానే రైతు బంధు వేయడాన్ని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. వేరే జిల్లాల్లో ఎవరికీ రైతు బంధు వేయలేదు కానీ, సెస్ ఎలక్షన్స్ ఉన్నాయని సిరిసిల్ల రైతుల ఖాతాలో డబ్బులు వేయడం.. వారిని ప్రలోభపెట్టడమేనని మండిపడ్డాయి. కల్వకుంట్ల కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తూ సిరిసిల్ల వ్యాప్తంగా ప్రచారం చేశాయి. విపక్షం ఎన్ని ఆరోపణలు చేసినా.. ఎంత బలంగా ప్రచారం చేసినా.. సిరిసిల్లలో బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయింది. 15లో 14 స్థానాలు బీఆర్ఎస్ కే దక్కాయి.
సిరిసిల్ల అంటే కేటీఆర్.. కేటీఆర్ అంటే సిరిసిల్ల. తెలంగాణ అంటే సిద్ధిపేట, సిరిసిల్లలేనా? నిధులన్నీ ఆ రెండు జిల్లాలకేనా? ప్రతిపక్షం తరుచూ చేసే విమర్శలు ఇవి. నిజమే. గడిచిన 8 ఏళ్లలో సిద్ధిపేట, సిరిసిల్లలకు అద్దంలా మారాయి. నిధుల వరద పారింది. పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది. ముఖ్యమంత్రి కుమారుడే సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఉండటంతో.. ఇక తిరుగులేకుండా పోయింది. అందుకే, ఇప్పుడు సెస్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ ను తిరుగులేని మెజార్టీతో గెలిపించారు సిరిసిల్ల ఓటర్లు.