Caste census : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే వేగం పుంజుకుంది. ఇప్పటికే.. అన్ని జిల్లాల్లో సర్వేకు పూర్తి ఏర్పాట్లు చేసిన అధికారులు ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ కార్యక్రమ నిర్వహణపై ఎప్పటికప్పుడు స్వయంగా సీఎం ఆరా తీస్తుండడం, జాతీయ స్థాయిలోనూ ప్రాధాన్యాంశం కావడంతో.. పనులన్నీ చకచక పూర్తవుతున్నాయి.
సమగ్ర కులగణనకు పక్కా ప్రణాళికతో కార్యచరణను అమలు చేస్తున్న ప్రభుత్వం.. మహా నగరమైన హైదరాబాద్ లోనూ అంతే వేగంగా సర్వేను నిర్వహిస్తోంది. సర్వే చేపట్టిన తర్వాత జీహెచ్ఎమ్ సీ (GHMC) పరిధిలో ఆదివారం ఒక్కరోజే 68 వేల 624 కుటుంబాల సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి రోజు కొంత మందకొడిగా ప్రారంభమైనా, రెండో రోజు మాత్రం వేగంగా జరిగిందని తెలిపారు.
కులగణన ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రాంతాలను జోన్ల వారీగా విభజించిన రాష్ట్ర ప్రభుత్వంగా.. వాటికి సూపర్ వైజర్లుగా ఐఎఎస్ అధికారులను నియమించింది. అలా.. జీహెచ్ఎమ్ సీ(GHMC)లో సమన్వయం కోసం హెచ్ఎమ్ డీఏ(HMDA) కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించింది. వీరి మార్గదర్శనంలో పనిచేస్తున్న సిబ్బంది.. ఎప్పటికప్పుడు సర్వే రిపోర్టును అధికారులకు చేరవేస్తున్నారు.
సర్వేను విభాగాల వారీగా విడదీసిన అధికారులు.. మొదటి దశలో నవంబర్ 6 నుంచి 8 వరకు బ్లాక్ వారీగా ఇంటి నంబర్లు, కుటుంబ సభ్యుల ప్రాథమిక వివరాలు సేకరించి, స్టిక్కర్‌లు అంటించారు. శనివారం నుంచి ప్రారంభమైన రెండో దశ సర్వేలో కుటుంబ సభ్యుల సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల సమాచారాన్ని సేకరించడం ప్రారంభించింది. ఈ సర్వేలో సుమారు 70 అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తుండగా, ఒక్కొక్క ఇంటికి సర్వే చేసేందుకు సుమారు అర గంట సమయం పడుతోందని న్యూమరేటర్లు తెలుపుతున్నారు. అయితే.. రానురాను సమయం తగ్గుతుందని అధికారులు తెలుపుతున్నారు.
Also Read : కులగణనను స్వాగతిస్తున్నాం.. కేటీఆర్ నోట పాజిటివ్ కామెంట్స్!
ప్రజలకు సంబంధించిన అత్యంత కీలక సమాచారాన్ని సేకరిస్తుండడం, వాటి భద్రతకు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితుల్లో.. రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. సర్వేలో సేకరించిన డేటాను.. వెంటనే డేటా ఎంట్రీ ప్రక్రియలోకి తీసుకునేందుకు GHMC ప్రత్యేక చర్యలు తీసుకుంది. సర్వే పత్రాలను భద్రంగా నిల్వ చేయడానికి, అవసరమైన సామాగ్రిని కొనుగోలు చేయడానికి జోనల్ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేశారు..