Kamareddy: కామారెడ్డి మండలంలోని కోటాల్‌పల్లి గ్రామంలో గుండెలను పిండేసే హృదయవిదారక సంఘటన చోటుచేసుకుంది. దేవుడిపై భక్తితో పూజ సామాగ్రిని చెరువులో కలిపేందుకు వెళ్లిన ఒక కుటుంబంలో ఊహించని మృత్యువు విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తండ్రి, కుమార్తె ఇద్దరూ నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో గ్రామంలో శోకసంద్రం అలుముకుంది.
కాపాడబోయి జలసమాధి
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోటాల్‌పల్లి గ్రామానికి చెందిన సంకరి పెద్ద నర్సింలు (60), ఆయన కుమార్తె సోమిశెట్టి రజిత (40) పూజ సామాగ్రిని నిమజ్జనం చేయడానికి ఊరి సమీపంలోని గోరిగారి చెరువు వద్దకు వెళ్లారు. నీటి ప్రవాహం వద్ద సామాగ్రిని కలుపుతుండగా రజిత ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో పడిపోయింది. నీటిలో మునిగిపోతున్న కన్నకూతురిని చూసి చలించిపోయిన తండ్రి నర్సింలు, ఎలాగైనా ఆమెను కాపాడుకోవాలనే తపనతో ఆలోచించకుండా చెరువులోకి దిగాడు. అయితే నీటి లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ బయటకు రాలేక నీటిలోనే మునిగిపోయారు.
చెరువులో పడి తండ్రి, కుమార్తె మృతి
కామారెడ్డి మండలం కోటాల్‌పల్లి గోరిగారి చెరువులో పూజ సామాగ్రి కలపడానికి వెళ్లి తండ్రి సంకరి పెద్ద నర్సింలు(60), కుమార్తె సోమిశెట్టి రజిత (40) ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందారు. నీటిలో జారిపడిన కుమార్తెను కాపాడే క్రమంలో తండ్రి కూడా… pic.twitter.com/aRRyEGlIhw
— BIG TV Breaking News (@bigtvtelugu) November 6, 2026
పోలీసుల దర్యాప్తు
గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను నీటి నుంచి వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.