Hyderabad Fire Accident: హైదరాబాద్ కొండాపూర్ లోని ఏఎంబి మాల్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఏఎంబి మాల్ వద్ద గల మహేంద్ర షోరూంలో అగ్ని ప్రమాదం జరగడంతో, ప్రస్తుతం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
కొండాపూర్ లోని ఏఎంబి మాల్ వద్ద మహేంద్ర షోరూం ఉంది. రోజువారీ మాదిరిగానే షోరూమ్ కు గురువారం రాత్రి 10 గంటల అనంతరం సిబ్బంది తాళాలు వేసి వెళ్లిన క్రమంలో, లోపల నుండి పొగలు రావడాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే చుట్టుపక్కల గల దుకాణాల యజమానులు అప్రమత్తమై ఫైర్స్ సిబ్బందికి సమాచారం అందజేశారు. మంటలు దట్టంగా వ్యాపించడంతో, ఆ ప్రాంతం దట్టమైన పొగతో నిండిపోయింది. ఫైర్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
కాగా ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూట్ గా భావిస్తున్నారు. షో రూమ్ లోని వాహనాలు పూర్తిగా దగ్ధమై ఉండవచ్చని, అందుకే మంటలు దట్టంగా వ్యాపించినట్లు స్థానికులు తెలిపారు. షోరూం కు సెట్ బ్యాక్ లేకపోవడంతో మంటలను అదుపు చేయడం కష్టతరంగా మారిందని అగ్నిమాపక సిబ్బంది తెలుపుతున్నారు. ప్రస్తుతం 6 ఫైర్ ఇంజన్లతో ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. షోరూంకు పక్కనే ఉన్న ఓయో రూమ్ కు మంటలు వ్యాపించే ప్రమాదం ఉండడంతో ఓయో రూమ్ లో ఉన్నవారిని పోలీసులు ఖాళీ చేయించారు.
మొత్తం మీద అగ్ని ప్రమాదాన్ని గల కారణాలు మంటలు ఆర్పిన అనంతరం తెలిసే అవకాశం ఉంది. ఇతర వ్యాపార సంస్థలకు మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటీవల హైదరాబాద్ లోని పలు ప్రాంతాలలో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ దశలో ఏఎంబి మాల్ వద్ద అగ్ని ప్రమాదం జరగడంతో వ్యాపార సముదాయాల పరిధిలో గల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.