
Falaknuma Express fire accident(Telugu breaking news) : ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న ట్రైన్ లో మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి – బొమ్మాయిపల్లి మధ్య ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో మంటల చెలరేగాయని అనుమానిస్తున్నారు. తొలుత రెండు బోగీల్లోంచి దట్టమైన పొగలు వచ్చినట్లు సిబ్బంది గుర్తించారు. వెంటనే లోకోపైలట్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో రైలును పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య నిలిపివేశారు.
రైలు ఆగగానే ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఆ తర్వాత మంటలు క్రమంగా 6 బోగీలకు వ్యాపించాయి. ఇప్పటికే 6 బోగీలు దగ్ధమయ్యాయి. ఘటనా స్థలికి రైల్వే సిబ్బంది చేరుకుని బోగీల మధ్య లింక్‌ను వేరు చేశారు. రైలును ముందుకు తీసుకెళ్లారు.
అగ్నిమాపక వాహనాలు అక్కడి చేరుకునేందుకు సరైన మార్గం లేదు. దీంతో మంటలు ఆర్పే ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. స్థానిక పోలీసులు, ఆర్డీవో అక్కడి చేరుకుని పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు. ఆర్డీవో భూపాల్‌రెడ్డి రైల్వే అధికారులు, అగ్నిమాపక అధికారులతో సంప్రందింపులు చేస్తున్నారు.
ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు తమ సామగ్రి అంతా కాలిపోయిందని ఆవేదన చెందుతున్నారు. ఉద్యోగం కోసం హైదరాబాద్ వెళ్తున్న ఓ యువతి తన సర్టిఫికెట్లు రైలులో ఉండిపోయాయని విలపించింది.
మరోవైపు బెదిరింపు లేఖ కలకలం రేపుతోంది. వారం క్రితం దక్షిణ మధ్య రైల్వేకు ఈ లేఖ వచ్చింది. దీంతో ప్రమాదంలో వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మధ్యకాలంలో తరచూ రైలు ప్రమాదాలు జరగడం ఆందోళన కలిగిస్తోంది. ఒడిశాలో జరిగిన రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ఆ తర్వాత తరచూ చిన్న చిన్న రైలు ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో రైలు ప్రయాణికుల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. రైళ్లలో ప్రయాణించాలంటే భయపడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రమాదాలు జరగకుండా రైల్వేశాఖ తగిన చర్యలు చేపట్టాలని ప్రయాణికులు కోరుతున్నారు.