Hyderabad Airport Flight Accident| శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో త్రుటిలో ఓ ఘోర విమాన ప్రమాదం తప్పింది. ఈ ఘటన బుధవారం మే 21, 2025న జరిగింది. లుఫ్లాన్స్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హైదరాబాద్ నుంచి జర్మనీలోని ఫ్రాంక్ ఫర్ట్ కు వెళ్లాల్సి ఉండగా.. రన్ వే పై విమానం ఎగరడానికి రాగానే ముందు టైర్ లో ఏదో సమస్య ఉందని.. అందుకే సరిగా పనిచేయడం లేదని గుర్తించారు.
వెంటనే పైలట్ ఈ సమస్యను గుర్తించి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులకు సమాచారం అందించారు. దీంతో విమానాన్ని రన్ వే నుంచి మళ్లీ ఎయిర్ పోర్ట్ లోకి వెనక్కు మళ్లించారు. ఈ ఘటన సమయంలో విమానంలో మొత్తం 190 మంది ప్రయాణికులు ఉన్నారు. వెంటనే టెక్నికల్ స్టాఫ్ ఈ సమస్యను పరిష్కరించడానికి రంగంలోకి దిగింది. ఈ సమస్య కారణంగా విమానం చాలా గంటలు ఆలస్యంగా బయలదేరుతుందని అధికారులు తెలిపారు. ఈ విమానంలోని సమస్యను పైలట్ గుర్తించక పోయి ఉంటే రన్ వేపై విమానం కుప్పకూలిపోయే ప్రమాదం ఉంది.
అంతకుముందు కూడా మార్చి 9న ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. గోవా నుంచి వైజాగ్‌కు వెళ్లాల్సిన ఇండిగో ఎయిర్‌లైన్స్ 6E-6973 విమానం, 150 మంది ప్రయాణికులతో శంషాబాద్ ఎయిర్‌పోర్టు మీదుగా ప్రయాణిస్తుండగా ఇది జరిగింది.
విమాన ల్యాండింగ్ కోసం ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) అనుమతి ఇచ్చింది. పైలట్ హైడ్రాలిక్ ల్యాండింగ్ గేర్‌ను సిద్ధం చేసి విమానాన్ని దించేందుకు ప్రయత్నించాడు. అయితే అప్పటికే రన్‌వేపై మరో విమానం టేకాఫ్‌కు సిద్ధంగా ఉండటాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే విమానాన్ని గాల్లోకి లేపడంతో పెద్ద ప్రమాదం తప్పింది. దాదాపు 10 నిమిషాలు గాల్లో చక్కర్లు కొట్టిన తర్వాత విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. తర్వాత వైజాగ్‌కు బయలుదేరింది.
ఈ సంఘటనపై ఏటీసీ అధికారులు విచారణకు ఆదేశించారు.
Also Read: యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు.. ఇప్పుడంతా అమ్మాయిల ఇష్టానుసారమే
ఇదే విధంగా, ఇంతకుముందు శంషాబాద్‌లో మరో ప్రమాదం తృటిలో తప్పింది. చెన్నై నుంచి వస్తున్న కార్గో విమానంలో ల్యాండింగ్ గేర్ లోపం తలెత్తడంతో పైలట్ అప్రమత్తమై ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు. ఇతర విమానాలను నిలిపి కార్గో విమానానికి ల్యాండింగ్ అవకాశం ఇచ్చారు. విమానం సురక్షితంగా దిగింది.