Maoists : నంబాల కేశవరావు. అలియాస్ బసవరాజ్. పీపుల్స్‌వార్ పార్టీని స్థాపించిన గుప్పెడు మనుషుల్లో ఈయన కూడా ఒకరు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో నంబాల చనిపోయారు. అగ్రనేతతో పాటు 27 మంది మావోయిస్టులు హతమయ్యారు. కేంద్ర కమిటీ సభ్యుడైన కేశవరావు మృతి పార్టీకి, ఉద్యమానికి కోలుకోలేని దెబ్బ.
అమిత్‌షా రియాక్షన్..
నక్సలిజాన్ని నిర్మూలించే పోరాటంలో ఒక మైలురాయి విజయం సాధించామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా. సీపీఐ-మావోయిస్ట్ ప్రధాన కార్యదర్శి, అగ్ర నాయకుడు, నక్సల్ ఉద్యమానికి వెన్నెముక అయిన నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు మృతి చెందారని ప్రకటించారు. నక్సలిజంపై భారత్ చేసిన 3 దశాబ్దాల పోరాటంలో ప్రధాన కార్యదర్శి హోదా కలిగిన నాయకుడిని మన దళాలు మట్టుబెట్టడం ఇదే మొదటిసారి అని అన్నారు. మరోవైపు, ప్రధాని మోదీ.. భద్రతా దళాలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను అభినందించారు. మావోయిజాన్ని నిర్మూలించి.. ప్రజలకు శాంతిని అందిస్తామని మోదీ తెలిపారు.
Proud of our forces for this remarkable success. Our Government is committed to eliminating the menace of Maoism and ensuring a life of peace and progress for our people. https://t.co/XlPku5dtnZ
— Narendra Modi (@narendramodi) May 21, 2025
తెలుగు నేల నుంచి అగ్రనేతగా..
నంబాల కేశవరావు పుట్టింది, పెరిగింది, పోరాడింది మన తెలుగు రాష్ట్రాల్లోనే. 1955లో శ్రీకాకుళం జిల్లా జయ్యన్నపేటలో జననం. వరంగల్ రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీ ( ప్రస్తుత NIT ) లో బీటెక్ చేశారు. ఎంటెక్ చదువుతూ మిడిల్ డ్రాప్ అయ్యారు. 1970లలో కాలేజ్ మేట్ కొండపల్లి సీతారామయ్య తదితరులతో కలిసి పీపుల్స్‌వార్ పార్టీ స్థాపించారు. ఉద్యమంలో చురుగ్గా ఉన్నారు. మొదట్లో తూర్పు గోదావరి, విశాఖ జిల్లా గెరిల్లా ఉద్యమాల్లో కీలక నేతగా ఎదిగారు. 1992లో పీపుల్స్ వార్ సెంట్రల్ కమిటీ సభ్యుడిగా చనిచేశారు. 2004లో మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ మిలిటరీ కమిషన్ హెడ్‌గా ఉన్నారు. పొలిట్‌బ్యూరో సభ్యుడిగా చాలాకాలం కొనసాగారు. 2018లో అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి రాజీనామా చేయడంతో.. మావోయిస్ట్ పార్టీ సుప్రీం కమాండర్‌గా కేశవరావు బాధ్యతలు స్వీకరించాడు.
చంద్రబాబు హత్యకు ప్లాన్
గెరిల్లా యుద్ధ వ్యూహాల్లో కేశవరావు ఎక్స్‌పర్ట్. ఆర్‌ఈసీలో బీటెక్ చదివిన అనుభవంతో ఐఈడీ బాంబులు తయారు, వినియోగంలో తిరుగులేని నేతగా మారాడు. 1987లో శ్రీలంకకు చెందిన LTTE యుద్ధ నిపుణులు నంబాల కేశవరావుకు బస్తర్ అడవుల్లో కీలక శిక్షణ ఇచ్చారు. అంబుష్ టాక్టిక్స్, జిలెటిన్ హ్యాండ్లింగ్‌లో ట్రైనింగ్ తీసుకున్నారు. నంబాల డైరెక్షన్‌లో ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశాల్లో మావోయిస్టులు పలు దాడులు చేశారు. 2003లో అలిపిరిలో సీఎం చంద్రబాబును చంపేందుకు క్లైమోర్ మైన్స్ పేల్చారు నక్సలైట్స్. ఆ అటాక్ నుంచి తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు చంద్రబాబు. సంచలనం సృష్టించిన ఆ దాడికి సూత్రధారి కేశవరావే. ఆ తర్వాత బలిమెలలో గ్రేహౌండ్స్ దళాలను నదిలో ముంచేసి చంపేసిన ఘటన వెనుక ఉన్నదీ ఆయనే. 2010లో దంతెవాడలో చేసిన అటాక్‌లో 76 మంది CRPF సైనికులు చనిపోయారు. 2013లో జీరం ఘాట్‌లో జరిపిన దాడిలో 27 మంది జవాన్లు మృతిచెందారు. దాదాపు 3 దశాబ్దాలుగా అజ్ఞాతంలో ఉన్న కేశవరావుపై.. NIA కోటిన్నర రూపాయల రివార్డ్ కూడా ప్రకటించింది.
కేశవరావు హతం..
నంబాల కేశవరావు ఉన్నారనే పక్కా సమాచారంతో.. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా మాధ్ అడవులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. బీజాపూర్, దంతెవాడ, నారాయణపూర్‌కు చెందిన డీఆర్జీ ఫోర్సెస్ పెద్ద ఎత్తున కూంబింగ్ చేపట్టాయి. బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరగ్గా.. కేశవరావు మృతి చెందినట్టు సమాచారం. మరో 30 మంది వరకూ మావోయిస్టులు చనిపోయారని తెలుస్తోంది.