Formula E Race Case: ఫార్ములా ఈ రేస్ కేసు గురించి తాజాగా సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ కేసు అందరూ భావిస్తున్నట్లుగా రూ. 55 కోట్లకు సంబంధించింది కాదని, మొత్తం ఒప్పందం రూ. 600 కోట్లుగా సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు.
శుక్రవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో ఫార్ములా ఈ రేస్ కేసు పై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చర్చ చేపట్టాలని తీవ్ర నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అలాగే స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి హంగామా చేసిన విషయం కూడా విదితమే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ఈ కేసు గురించి కీలక కామెంట్స్ చేశారు. అసెంబ్లీలో సీఎం మాట్లాడుతూ.. తాను ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఎఫ్ఈఓ కంపెనీ ప్రతినిధులు తనను ప్రత్యేకంగా కలిసినట్లు, లోపాయి కారి ఒప్పందానికి తనను సహకరించాలని వారు కోరినట్లు సీఎం అన్నారు.
అలాగే ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో కేటీఆర్ నిన్న సాయంత్రం నుండి ఫార్ములా ఈ రేస్ గురించి చర్చించాలని హడావుడి చేస్తున్నారని, ప్రభుత్వ సొమ్మును వందల కోట్లు కొల్లగొట్టి ఇతర దేశాలకు తరలించినట్లు సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అదికూడా హెచ్ఎండీఏ అకౌంట్ నుండి నగదు బదిలీ చేశారని, ఈ విషయంలో ఒప్పందాలను ఉల్లంఘించి డబ్బులు తరలించినట్లు సీఎం విమర్శించారు.
అందరూ భావిస్తున్నట్లుగా ఈ కేసు రూ. 55 కోట్ల వ్యవహారం కాదని మొత్తం ఒప్పందం రూ. 600 కోట్ల డీల్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏదైనా ఒప్పందం రద్దు చేయాలంటే విచారణ జరగాల్సిన అవసరం ఉందని, లండన్ కు వెళ్లిన డబ్బు ఎవరెవరు చేతులు మారిందో ఎలా తెలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు అంతేకాకుండా ఆ డబ్బు ఫౌండ్ల రూపంలో వెళ్లిందని, స్పీకర్ అనుమతి ఇస్తే ఫార్ములా ఈ రేసు పై చర్చించడానికి తాము సిద్ధమంటూ సీఎం సవాల్ విసిరారు.
అంతేకాకుండా ధరణి ప్రాజెక్టుపై మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ధరణి ద్వారా రైతుల డేటా సరిహద్దులు దాటిందని, వారు తలుచుకుంటే ఎవరి భూములనైనా తారుమారు చేయవచ్చు అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు. ధరణి పేరుతో ఆర్థిక నేరాలకు పాల్పడ్డారని, అటువంటివారిని వదిలి పెట్టే ప్రసక్తే లేదంటూ సీఎం హెచ్చరించారు. అంతేకాకుండా భూభారతి చట్టాన్ని ఆపాలని ప్రయత్నిస్తున్నారని, తమ ప్రభుత్వం రైతులకు, ప్రజలకు న్యాయం చేయాలనుకున్న తమ ప్రభుత్వానికి అడుగడుగునా అడ్డు తగిలే ఆలోచన బీఆర్ఎస్ విరమించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.