Telangana Free Fine Rice: రేవంత్ ప్రభుత్వం ఉగాది రోజు కొత్త పథకాన్ని శ్రీకారం చుట్టింది. ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్‌నగర్ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సన్నబియ్యం ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నారు. ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా అర్హులందరికీ సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు.
సన్నబియ్యం పథకం
తెలంగాణలో పేదలందరికీ ఇకపై సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కార్డు లేకపోయినా జాబితాలో పేరు ఉంటే అర్హులు. ఎందుకంటే కొత్త జాబితా ప్రకారం పేర్లు ఉన్నప్పటికీ చాలామందికి రేషన్ కార్డులు రాలేదు. పేరు ఉంటే సన్నబియ్యం తీసుకోవచ్చని స్పష్టమైన ప్రకటన చేసింది ప్రభుత్వం. దీనికితోడు త్వరలో ఉప్పు, పప్పు, చింతపండు కూడా రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేయాలని భావిస్తోంది.
ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా 89.73 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయి. దాదాపు 2.80 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరితో పాటు కొత్తగా రేషన్‌కార్డుల కోసం మరో 30 లక్షల వరకు దరఖాస్తు చేసుకున్నారు. వీటన్నింటికీ కలిపి ఏప్రిల్ నుంచి 3.10 కోట్ల మందికి సన్నబియ్యం పంపిణీ చేయనుంది ప్రభుత్వం.
గత ఖరీఫ్‌లో పంటను రైతుల నుంచి ప్రభుత్వం కోనుగోలు చేసింది. సన్న ధాన్యానికి కనీస మద్దతు ధరకు తోడు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి కొనుగోలు చేసింది. దాదాపు 24 లక్షల టన్నుల వడ్లను సేకరించింది. వాటిని మిల్లింగ్ చేసిన తర్వాత వచ్చిన బియ్యాన్ని కార్డు హోల్డర్లకు పంపిణీ చేయనుంది.
ALSO READ: ఇక బీటెక్ ఫెయిలైన వారికి కూడా సర్టిఫికెట్
దొడ్డు బియ్యానికి రూ.10,665 కోట్ల వరకు ప్రభుత్వం వెచ్చిస్తోంది. చాలా మంది పేదలు ఈ బియ్యంపై తినేందుకు ఇష్టపడటం లేదు. అయితే ఈ బియ్యాన్ని చాలా మంది మిల్లర్లు అడ్డదారుల్లో విక్రయిస్తూ లాభాలను అర్జిస్తున్నారు. ఈ క్రమంలో మార్పులు తీసుకురావాలని నిర్ణయించింది ప్రభుత్వం. దొడ్డు బియ్యానికి చెల్లిస్తున్న నిధులకు అదనంగా మరో రూ.2,800 కోట్లు వెచ్చించింది.
సన్న బియ్యం పంపిణీ చేయడం వల్ల ఉచిత బియ్యం పథకం సద్వినియోగం అవుతుందని భావిస్తోంది. ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేయనున్నారు. ఒక కుటుంబంలో ముగ్గురు ఉంటే 18 కిలోల వరకు సన్నబియ్యం తీసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా లబ్ధిదారులు ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. అధికారుల వద్ద జాబితాలో పేరుంటే చాలు. కార్డు లేకపోయినా రేషన్ తీసుకోవచ్చని ప్రభుత్వం స్పష్టం చేసింది.
బియ్యం దందాకు చెక్
కొత్త రేషన్ కార్డులను ముద్రిస్తున్నట్లు ఆ శాఖ మంత్రి ఉత్తమ్ తెలిపారు. కొత్తగా జారీచేసే వాటితో కలిపి తెలంగాణలో రేషన్‌కార్డుల సంఖ్య కోటికి చేరుతుందన్నారు. సన్నిబియ్యం పంపిణీ ద్వారా పేదలకు లాభం కలగనుంది. ముఖ్యంగా బియ్యం రీసైకిల్ దందాకు చెక్ పడనుంది. పేదలకు ఇచ్చే రేషన్ బియ్యం పక్కదారి పట్టే ఛాన్స్ ఉండదు.
ఆదివారం సాయంత్రం సీఎం రేవంత్‌రెడ్డి ఐదు గంటలకు హైదరాబాద్ నుంచి హుజూర్‌నగర్ కు చేరుకుంటారు. హుజూర్‌నగర్ పట్టణంలోని వై-జంక్షన్ నుంచి రామస్వామి గుట్టకు వెళ్లేదారిలో భారీ ఏర్పాట్లు చేశారు. అక్కడి నుంచి ప్రత్యేక కాన్వాయ్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డితో కలిసి నిర్మాణంలో ఉన్న సింగిల్ బెడ్‌రూమ్ ఇళ్ల (2,150) పనులను పరిశీలన చేయనున్నారు. అనంతరం సభా వేదిక వద్దకు చేరుకొని సన్నబియ్యం పథకాన్ని ప్రారంభిస్తారు ముఖ్యమంత్రి.