Telangana Tourism: స్వేచ్ఛ బ్యూరో: టూరిజం శాఖ గందరగోళంగా మారింది. ప్రత్యేక ప్రధానకార్యదర్శులు తరచూగా మారుతుండటం అభివృద్ధి పనులకు అడ్డంకిగా మారింది. 27 నెలల్లో 6గురు ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు మారారు. దీంతో ఇప్పటికే చేపట్టిన అభివృద్ధి పనులన్నీ నిలిచిపోయాయి. దీనికి తోడు చేసిన పనులకు సైతం బిల్లులు మంజూరు కావడం లేదని సమాచారం. అంతేకాదు శాఖలో ఎండీలు సైతం నలుగురు మారడం గమనార్హం. దీంతో శాఖపై అధికారుల మానిటరింగ్ సైతం కరువైంది.
పర్యాటకశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. టూరిజం సర్క్యూట్లు, ఏకో టూరిజం, పలు పర్యాటక ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలపై దృష్టిసారించింది. అంతేకాదు దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్యాకేజీలు సైతం ప్రకటిస్తుంది. దీంతో పర్యాటకశాఖకు ఆదాయం సైతం ఏటేటా పెరుగుతుంది. ఇంత వరకు బాగానే ఉన్నప్పటికీ ప్రభుత్వం వచ్చిన 27 నెలల్లోనే 6గురు ప్రత్యేక ప్రధానకార్యదర్శులు మారారు. అంటే సగటున నాలుగు నెలలు పనిచేశారు. ఒక అధికారికి శాఖ పై పట్టు సాధించాలంటే రెండుమూడునెలలు పడుతుంది. ఆ సమయంలోనే మళ్లీ శాఖ మార్పు జరుగుతుండటంతో అభివృద్ధి పనులు ముందుకు సాగడం లేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శైలజ రామయ్యార్, వాణి ప్రసాద్, ఎన్.శ్రీధర్, స్మీతా సబర్వాల్, జయేష్ రంజన్, తిరిగి మళ్లీ వాణి ప్రసాద్ ప్రత్యేక ప్రధానకార్యదర్శులుగా నియామకం అయ్యారు. దీంతో అభివృద్ధి పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదనే ప్రచారం జరుగుతుంది. దీనికి తోడు శాఖ మేనేజింగ్ డైరెక్టర్లు సైతం నలుగురు పనిచేశారు. వీరు సైతం శాఖలో కీలక భూమిక పోషిస్తారు. అయితే ప్రభుత్వంలో నలుగురు డైరెక్టర్లు మారారు. రమేశ్ నాయుడు, ప్రకాశ్ రెడ్డి, క్రాంతి వల్లూరు, గౌతమి డైరెక్టర్లుగా నియామకం అయ్యారు. అయితే తరచూ అధికారులు మారుతుండటంతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు త్వరిత గతిన పూర్తి కావడం లేదు. వాటిపై పర్యవేక్షణ లేకపోవడం.. వచ్చిన అధికారులు సైతం ఎన్ని నెలలు ఉంటారో తెలియక పూర్తి స్థాయిలో దృష్టిసారించడం లేదనే ప్రచారం జరుగుతుంది.
Also Read: గూగుల్ అదిరిపోయే సర్‌ప్రైజ్.. ఏకంగా 5TB ఉచిత స్టోరేజ్.. ఎలా పొందాలంటే?
రెండుమూడేళ్లు ఒకే అధికారికి బాధ్యతలు అప్పగిస్తే వారు అభివృద్ధి పనులు స్పీడప్ చేసే అవకాశం ఉంది. వారికిచ్చిన బాధ్యతలు సైతం నిర్వర్తించడంతో పాటు ప్రభుత్వానికి సైతం పేరుతీసుకొచ్చే అవకాశం లేకపోలేదు. కానీ ప్రభుత్వం తరచూ బదిలీలు జరుగుతుండటంతో అధికారులు సైతం పూర్తిస్థాయిలో పనులపై దృష్టిపెట్టడం లేదనేది పనుల పెండింగ్ ను బట్టి తెలుస్తుంది. మరోవైపు ప్రత్యేక ప్రధానకార్యదర్శులు, ఎండీలు మారుతుండటంతో కింది స్థాయి ఉద్యోగులు, సిబ్బందిపై మానిటరింగ్ కొరవడుతుంది. టూరిజం ప్రాంతాలపై, హోటల్స్ పై పర్యవేక్షణ సైతం చేయలేకపోతున్నారనే ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటివరకు టూరిజం బస్సులు సైతం పూర్తి స్థాయిలో నడపడంలో సైతం జాప్యం జరుగుతుందని సమాచారం. టూరిజంపై ప్రత్యేక చొరవ తీసుకునే అధికారులు లేకపోవడంతోనే లాభాల బాటలో పయనించాల్సిన శాఖ.. అతికష్టం మీద నెట్టుకొస్తుందని సంస్థ ఉద్యోగులే అభిప్రాయపడుతున్నారు.
స్వదేశ్ దర్శన్ 2.0 కింద నిధులు అందజేస్తుంది. ఆ నిధులతో రాష్ట్రంలో అభివృద్ధి పనులను స్పీడప్ చేయడంలోనూ జాప్యం జరుగుతుందనే ప్రచారం జరుగుతుంది. అంతేగాకుండా రాష్ట్రంలో టెంపుల్ టూరిజం, అడ్వెంచర్, హెరిటేజ్ టూరిజం తదితర ప్రాజెక్టులను సైతం పూర్తి చేయాల్సి ఉంది. అదే విధంగా టూరిజం కాంక్లేవ్ ను నిర్వహించడంతో 15వేలకోట్లు పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి. రాష్ట్ర ప్ఱభుత్వం సైతం పీపీపీ మోడల్ తో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించింది. అయితే అధికారుల మార్పుతో పనులు కుంటుపడుతున్నాయి. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులను మార్పుచేయకుండా కొనసాగిస్తే టూరిజం అభివృద్ధి పరుగులు పెడుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Also read: గుదిబండగా మారిన స్టిక్కరింగ్.. ఆటో డ్రైవర్ల బతుకు చిద్రమేనా..?