Big Stories

Hyderabad: అదిగదిగో అంబేద్కర్ కాంస్య విగ్రహం.. ఫుల్ డిటైల్స్..

ambedkar statue hyderabad

Hyderabad: హైదరాబాద్ అంటే ముందుగా గుర్తొచ్చేది చార్మినార్, గోల్కొండ కోట, ట్యాంక్ బండ్ మధ్యలో నిలువెత్తు బుద్ధ విగ్రహం. అంతేనా? అంటే.. ఆ జాబితాలో మరో ఐకానిక్ స్టాట్యూ చేరింది. హుస్సేన్ సాగర్ తీరాన అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం సిద్ధమైంది. దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్ విగ్రహం హైదరాబాద్ ఇమేజ్‌ని మరింత పెంచేలా కొలువైంది.

- Advertisement -

దేశంలో ఇప్పటివరకూ ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాల్లోకెల్లా ఇదే అత్యంత ఎత్తైనది. పార్లమెంటు ఆకారంలో 50 అడుగుల ఎత్తు, 172 అడుగుల వెడల్పుతో భారీ పీఠం నిర్మించారు. ఆ పీఠంపై 125 అడుగుల పొడువు, 45 అడుగుల వెడల్పు, 465 టన్నుల బరువున్న నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందుకోసం 791 టన్నుల ఉక్కు, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు. ‘రామ్ వి సుతార్’ ఈ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూపొందించారు.

- Advertisement -

హుస్సేన్‌సాగర్‌ తీరంలో ఎన్టీఆర్‌ గార్డెన్‌ను ఆనుకుని దాదాపు 11.80 ఎకరాల స్థలంలో అంబేద్కర్ స్మారకం రెడీ అయింది. ఇందుకోసం దాదాపు 150 కోట్లు ఖర్చు చేశారు. ఇక, విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసమే 10 కోట్లు విడుదల చేసింది ప్రభుత్వం.

స్మారకం వెలుపల పచ్చదనం కోసం 2.93 ఎకరాలు కేటాయించారు. స్మృతివనంలో రాక్‌గార్డెన్‌, ల్యాండ్‌ స్కేపింగ్‌, ప్లాంటేషన్‌, వాటర్‌ ఫౌంటేన్‌, శాండ్‌ స్టోన్‌ ఉన్నాయి.

కేపీసీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌.. అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని రూపొందించింది. విగ్రహ భాగాలను ఢిల్లీలో సిద్ధం చేసి హైదరాబాద్‌కు తరలించారు. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునేలా పటిష్ఠంగా నిర్మించారు.

అంబేద్కర్ విగ్రహం పాదాల వరకూ చేరుకునేందుకు మెట్లమార్గం, ర్యాంపుతో పాటు 15 మంది ఎక్కగల సామర్థ్యంతో రెండు లిఫ్టులు ఏర్పాటుచేశారు.

విగ్రహం కింద, పీఠం లోపల స్మారక భవనంలో.. 27,556 అడుగుల విస్తీర్ణంలో మ్యూజియం, లైబ్రరీ, అంబేడ్కర్‌ జీవితానికి సంబంధించిన ముఖ్యమైన ఘటనలతో ఫోటో గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. భవనం లోపల ఆడియో, విజువల్‌ రూమ్స్‌ ఉన్నాయి.

అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 20 మంది బౌద్ధ గురువులు ప్రార్థనలు నిర్వహిస్తారు. అనంతరం హెలికాప్టర్‌ ద్వారా పూలవర్షం కురిపిస్తారు.

అంబేద్కర్ కాంస్య విగ్రహంతో పాటు ఆ పక్కనే తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం జరుగుతోంది. ఈ నెల 27న సెక్రటేరియట్ ను ప్రారభించనున్నారు. ఆ ఎదురుగా తెలంగాణ మలిదశ ఉద్యమంలో బలిదానం చేసిన అమర వీరుల స్థూపం కూడా సిద్ధమవుతోంది. తెలంగాణ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా జూన్ 2న అమరుల స్థూపాన్ని ఆవిష్కరించనున్నారు.

125 అడుగుల ఎత్తులో నిర్మించిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని.. తెలంగాణ సమాజంతో పాటు యావత్ దేశ ప్రజలు సంబురపడేలా గొప్పగా ఆవిష్కరించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. దేశం గర్వించదగ్గ స్థాయిలో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుంటున్న సందర్భంలో.. ఆవిష్కరణ సభ కూడా అంతే ఉన్నత స్థాయిలో, అంబేద్కర్ ఔన్నత్యాన్ని మరింత గొప్పగా ప్రపంచానికి చాటి చెప్పేలా వుండాలని సీఎం కేసీఆర్ మంత్రులకు, అధికారులకు స్పష్టం చేశారు. శుక్రవారం ఈ విగ్రహాన్ని తెలంగాణ ప్రజలతో పాటు జాతికి అంకితం చేయనున్నారు.

ambedkar-statue-hyderabad
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News