Gachibowli: హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలోని గచ్చిబౌలిలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి చెందడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎంతో ప్రశాంతంగా ఉండే రాయదుర్గం సమీపంలోని జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్ ప్రాంగణం ఒక్కసారిగా విషాదఛాయలతో నిండిపోయింది.
సి బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702లో మృతదేహాలు
జయభేరి నిర్వాణ అపార్ట్‌మెంట్‌లోని సీ బ్లాక్, ఫ్లాట్ నంబర్ 702 నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు ఉదయం 8:40 గంటలకు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న గచ్చిబౌలి పోలీసులు ఫ్లాట్ తలుపులు తెరిచి చూడగా, ఒకే కుటుంబానికి చెందిన బతుల మారెడ్డి (65), ఆయన భార్య భారతి (60), వారి కుమారుడు నిశాంత్ రెడ్డి (38) నిర్జీవంగా పడి ఉన్నారు. వీరంతా గత ఏడాది కాలంగా ఈ ఫ్లాట్‌లో అద్దెకు నివాసముంటున్నట్లు గుర్తించారు.
తీవ్ర ఆందోళనలో ఐటీ కారిడార్ ನಿవాసితులు
ఈ దారుణ ఘటన స్థానిక అపార్ట్‌మెంట్ వాసులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలో అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఇలా ఒకే కుటుంబంలోని ముగ్గురు ప్రాణాలు తీసుకోవడం అందరినీ ఆవేదనకు గురిచేసింది.
రంగంలోకి దిగిన పోలీసులు.. కొనసాగుతున్న దర్యాప్తు
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ అంతర్గత కలహాల వల్లే వీరు ఈ దారుణ నిర్ణయం తీసుకుని ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు క్లూస్ టీమ్‌తో ఆధారాలు సేకరించారు. మృతదేహాలను పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల అసలు కారణాలను వెలికితీసేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు తీవ్రతరం చేశారు.
Also Read: పల్లె పల్లెకూ హైస్పీడ్ ఇంటర్నెట్.. రూ. 3,189 కోట్లతో తెలంగాణలో ‘డిజిటల్ విప్లవం’!