Kanpur Thar Accident: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో దీపావళి పండుగ ముందురోజు తీవ్ర విషాదం చోటుచేసుకుంది. శనివారం రాత్రి మహీంద్రా థార్ ఎస్‌యూవీలో ఓ మహిళ సృష్టించిన బీభత్సానికి స్కూటర్ పై వెళ్తున్న 55 ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ఎస్‌యూవీలో ఇద్దరు మహిళలు ప్రయాణిస్తున్నారు. కారు ఒక్కసారిగా అదుపుతప్పడంతో రోడ్డుపై వెళ్తున్న పలువురిని ఢీకొడుతూ చివరికి సంతోష్ సింగ్ చౌహాన్ అనే వ్యక్తి నడుపుతున్న ఈ-స్కూటర్‌ను బలంగా గుద్దింది. దీంతో సంతోష్ సింగ్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. దీంతో కారులోని మహిళలు అక్కడి నుంచి పరారయ్యారు.
ఘటనపై రాకేష్ కుమార్ అనే ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆ థార్ ఎస్‌యూవీ అత్యంత వేగంతో వచ్చి స్కూటర్‌ను ఢీకొట్టిందని తెలిపారు. ఢీకొట్టిన తర్వాత కూడా వాహనం ఆగకుండా స్కూటర్‌ను దాదాపు 25 నుంచి 30 మీటర్ల దూరం వరకు ఈడ్చుకెళ్లిందని పేర్కొన్నారు. చివరకు రోడ్డు పక్కన ఉన్న రైలింగ్‌ను ఢీకొని ఆగిపోయిందని వెల్లడించారు.
Also Read: యూట్యూబ్ కొత్త లుక్ వచ్చేసిందోచ్..ఈ సారి షార్ట్స్, క్రియేషన్‌కు పెద్ద పీట
మరోవైపు ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రమాదానికి కారణమైన థార్ వాహనానికి వెనుక వైపు ‘కృష్ణ గ్రూప్’ (Krishna Group) అని రాసి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. బాధితుడి కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని.. కారులోని మహిళలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ దలీప్ కుమార్ సింగ్ తెలిపారు.
Also Read: సామాన్యులకు పండగే.. రూ.6000 లోపే వాషింగ్ మిషన్లు.. ఇక చేత్తో ఉతికే పనేలేదు!