Big Stories

Gaddar: కేసీఆరే టార్గెట్.. గజ్వేల్ బరిలో గద్దర్!

Gaddar: ప్రజా యుద్ధ నౌక గద్దర్ మళ్లీ విప్లవబాట పట్టారు. కాకపోతే ఈసారి ప్రజాస్వామ్య బద్ధంగా ఓటు విప్లవాన్ని తీసుకొచ్చే పనిలో ఉన్నారు. బుల్లెట్ వదలి బ్యాలెట్ వైపు వస్తున్నారు. పాలకుల విధానాలను ప్రశ్నిస్తూ ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగు పెట్టబోతున్నారు. ఐతే ఏ పార్టీలో చేరతారు అనే దానిపై క్లారిటీ లేకపోయినా.. ఎక్కడ నుంచి పోటీ చేస్తారనేదానిపై మాత్రం స్పష్టత వచ్చేసింది.

- Advertisement -

తన టార్గెట్ కేసీఆరే అంటున్నారు గద్దర్. గజ్వేల్ నుంచే పోటీ చేస్తానంటున్నారు. అందుకు కారణం కూడా చెబుతున్నారు. తాను పుట్టింది తూప్రాన్‌లోనే అని.. అది తన స్వస్థలమని.. ఇకపై ఇక్కడే ఉంటానని స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ అల్వాల్‌లో ఉంటూవస్తున్న ఆయన.. ఇకపై కేసీఆర్ ఇలాఖా గజ్వేల్ లోని తూప్రాన్‌కి మకాం మార్చేస్తున్నారు గద్దర్.

- Advertisement -

తుపాకీతోనే రాజ్యాధికారం సాధ్యమని దశాబ్దాల పాటు నమ్మిన వ్యక్తి ఆయన. పాటతో విప్లవ భావాలను రగిలించిన ప్రజా యుద్ధనౌక. అలాంటి గద్దర్.. బ్యాలెటే అన్నిటికంటి సుప్రీం అని ఇన్నాళ్లకు గుర్తెరిగారు. ప్రజాస్వామ్య పంథాలో మరో పోరాటానికి సిద్ధమవుతున్నారు. కొన్నాళ్లుగా ఆయన అన్ని రాజకీయ పార్టీలతో టచ్‌లో ఉన్నారు. ఒక్క బీఆర్ఎస్‌తో మినహా. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ.. ఇలా అన్నిపార్టీల వేదికలపై ప్రత్యక్షమవుతున్నారు. ఇటీవల భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్రలో పాల్గొన్నారు గద్దర్. అలాగే షర్మిల తెలంగాణ బిడ్డ అంటూ ఆమెకు మద్దతు ఇచ్చారు. మరి, ఏ పార్టీలో చేరుతున్నారు? అంటే మౌనమే సమాధానం. అందరికీ ఆయన కావాలి.. ఆయనకు అందరూ కావాలి.

తెలంగాణ పోరాటంలో తన గొంతుకతో లక్షల మందిని ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం వైపు మళ్లించిన ఘనత గద్దర్‌ది. రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా గద్దర్‌కు అవకాశాలు వచ్చినప్పటికీ ఎన్నికలకు దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు బ్యాలెట్ పోటీకి సిద్ధం అంటున్నారు. స్వరాష్ట్రంలో ప్రజల బతుకులు మారతాయనుకుంటే కేసిఆర్ పాలనలో కన్నీళ్లే మిగిలాయని బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు గద్దర్. పేదల భూముల్ని లాక్కుంటున్నారని, ధరణి పోర్టల్‌ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అందుకు ప్రజలను సంఘటితం చేసే ప్రయత్నం చేస్తున్నారు.

లేటెస్ట్‌గా మెదక్ జిల్లా తూప్రాన్‌లో పోలీసులను కలిసి తనకు రక్షణ కల్పించాలని కోరారు గద్దర్. ఇక నుంచి పుట్టిన ఊళ్లోనే జీవించాలని అనుకుంటున్నట్టు చెప్పారు. గజ్వేల్ నుంచి కేసీఆర్‌పై పోటీ చేస్తానని ప్రకటించారు.

తెలంగాణలో ఆటా, పాటకు ఉన్న శక్తి అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఆ పాటనే అస్త్రంగా చేసుకుని.. కేసీఆర్‌పై పోరాటం మొదలుపెట్టారు గద్దర్. బానిసలారా లెండిరా ఈ బాంచన్ బతుకులు వద్దురా అంటూ.. ప్రజలను చైతన్య పరుస్తున్నారు.

మరి, గజ్వేల్‌లో కేసీఆర్‌లాంటి కొండను ఢీ కొట్టడం.. ప్రజా యుద్ధ నౌకకు సాధ్యమేనా? ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? ఏదైనా పార్టీలో చేరుతారా? ఇప్పటికే గజ్వేల్‌లో తాను సైతం సై అంటూ బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా సవాల్ చేశారు. తీన్మార్ మల్లన్న సైతం గజ్వేల్‌పై గురి పెట్టారని అంటున్నారు. మరి, హేమాహేమీలంతా అక్కడే వాలిపోతే.. ఓట్లు చీలి.. అది గులాబీ బాస్‌నే గెలిపించదా..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News