Gadwal Police: స్వేచ్చ బ్యూరో: గద్వాల మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో నిన్న సాయంత్రం చోటుచేసుకున్న ఘటనపై గద్వాల పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. మున్సిపల్ కమిషనర్ పట్ల దుర్భాషలాడుతూ, ఆయన విధులకు ఆటంకం కలిగించిన అఖీమ్ శ్రీనివాస్ గౌడ్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఎస్ఐ కల్యాణ్ కుమార్ తెలిపారు. మున్సిపల్ కమిషనర్ పిర్యాదు మెరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు విధులు నిర్వహిస్తున్న సమయంలో దురుసుగా ప్రవర్తించడం, దుర్భాషలాడటం, విధులకు ఆటంకం కలిగించడం వంటి చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని ఎస్ఐ హెచ్చరించారు. చట్టాన్ని ఉల్లంఘిస్తూ అధికారుల విధులకు ఆటంకం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ప్రభుత్వ అధికారులు ప్రజలకు సేవలందించేందుకు విధులు నిర్వహిస్తారని, అలాంటి సమయంలో బెదిరింపులకు దిగడం, దుర్భాషలాడటం, దాడులకు పాల్పడటం వంటి చర్యలకు ఎవరూ పాల్పడరాదని ఎస్ఐ కల్యాణ్ కుమార్ హెచ్చరించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించే ఘటనలపై పోలీసులు అప్రమత్తంగా ఉంటారని పేర్కొన్నారు.
Also read: చాణక్య నీతి.. ఒక వ్యక్తి నిజస్వరూపం తెలుసుకోవాలంటే ఈ 5 లక్షణాలు గమనించండి
అఖీమ్ శ్రీనివాస్ గౌడ్‌పై గతంలోనూ పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు ప్రచారం జరుగుతోందని, ఆయనపై ఉన్న ఆరోపణలన్నింటినీ పోలీసులు సమగ్రంగా పరిశీలించాలని స్థానికులు కోరుతున్నారు. దొంగతనాలు, దోపిడీలకు సంబంధించిన కేసులు ఏమైనా నమోదై ఉంటే వాటి వివరాలను వెలికితీసి, నేరప్రవృత్తి కలిగిన శ్రీనివాస్ గౌడ్ పై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అఖీమ్ శ్రీనివాస్ గౌడ్ వ్యవహారశైలి కారణంగా గద్వాల జిల్లాలో పలువురు రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కొందరు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై పోలీసులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంలో ఎవరైనా చట్టవిరుద్ధంగా సహకరించినట్లు తేలితే వారిపైనా చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అధికారుల విధులకు ఆటంకం కలిగించే ఘటనలతో పాటు, ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసు శాఖను కోరుతున్నారు. చట్టం ముందు ఎవరూ అతీతులు కారని, తప్పు చేసిన వారిపై నిష్పక్షపాతంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
Also read: సీజేపీ నిరసన మధ్య.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు, మెట్రో-ఇంటర్నెట్ సర్వీసులు పునరుద్ధరించాలని ఆదేశం