MP Mallu Ravi: గద్వాల మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు శాయశక్తుల కృషి చేస్తామని ఎంపీ మల్లు రవి (MP Mallu Ravi) అన్నారు. గద్వాల మున్సిపాలిటీ లో కౌన్సిలర్లు, చైర్ పర్సన్ జయలక్ష్మి, వైస్ చైర్మన్ శంకర్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎన్నికల పరిశీలకుడు రాములు నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్ రెడ్డి తో కలిసి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ ఎన్నికలలో 80 శాతం పైగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుందన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలనలో భాగంగా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా గద్వాల మున్సిపాలిటీ అన్ని రంగాలలో అభివృద్ధి చేసి రాష్ట్రంలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దే విధంగా కృషి చేస్తామన్నారు. అనంతరం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా మంత్రులు, ఎంపీ సహకారంతో గద్వాల మున్సిపాలిటీలో అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా పనులు చేసేలా కృషి చేస్తానన్నారు.
గద్వాల ప్రజలు నాపై నమ్మకం ఉంచి మున్సిపాలిటీలో మేము బలపరిచిన అభ్యర్థులను గెలిపించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరి నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పాలన ఉంటుందన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్ పర్సన్ జయలక్ష్మి మాట్లాడుతూ నాపై నమ్మకం ఉంచి గద్వాల మున్సిపల్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించిన ఎమ్మెల్యే ఎంపీకి ధన్యవాదాలు తెలిపారు. గద్వాల పట్టణ సమగ్ర అభివృద్ధికి మౌలిక వసతుల కల్పనకు పార్టీలకతీతంగా కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, యూత్ సభ్యులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.
Also Read: Hyderabad News: లక్ష ఇస్తావా? ఖతం చేయమంటావా? వ్యాపారిని బెదిరించిన రౌడీ గ్యాంగ్!