GHMC Workers: స్వేచ్ఛ బ్యూరో: వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి గ్రేటర్ హైదరాబాద్ వాసుల ఆరోగ్యాన్ని కాపాడుతున్నారు. ఎలాంటి సేఫ్టీ ప్రమాణాల్లేకుండానే వారు కెమికల్స్ ను స్ప్రే చేస్తున్నారు. మరి కొందరైతే ఎలాంటి సేఫ్టీ మజెర్స్ లేకుండానే ఏకంగా నదులు, చెరువుల్లోకి దిగుతున్నారు. జానెడు కడుపు కోసం కష్టపడి విధులు నిర్వహిస్తున్న ఈ కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డూ అదుపు లేకుండా పోయిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా సమయంలో వీఐపీ, వీవీఐపీలు నివసించే ప్రాంతాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కెమికల్స్ స్ప్రే చేసేందుకు దాదాపు 220 మంది కార్మికులను తాత్కాలిక ప్రాతిపదికన జీహెచ్ఎంసీ నియమించింది. తొలుత వీరిని ఏడాది పని కాలంతో నియమించుకున్నా, విపత్కర సమయంలో ప్రమాదం అంచున విధులు నిర్వర్తించిన ఈ కార్మికులను అప్పటి కమిషనర్ లోకేశ్ కుమార్ ఏటా ఎక్స్ టెన్షన్ ఇస్తూ కొనసాగించారు. కరోనా సమయంలో విధులు నిర్వహిస్తూ ఈ కార్మికుల్లో ఏడుగురు ప్రాణాలు కూడా కొల్పోయారు.
నియామకం సమయంలో పెట్టుకున్న నిబంధనల ప్రకారం ప్రస్తుతం ఈ కార్మికులకు రూ. 21 వేల జీతం చెల్లించాల్సి ఉండగా, వీరి పని తీరును పర్యవేక్షిస్తున్న సూపర్ వైజర్లు, అసిస్టెంట్ ఎంటమాలజిస్టులతో పాటు జోన్ కు ఒకరున్న సీనియర్ ఎంటమాలజిస్టులు జీతాల చెల్లింపులో తమ హస్తలాఘవాన్ని ప్రదర్శిస్తూ సగం జీతమే చెల్లిస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొందరికి రూ. 9 వేలు, మరి కొందరికి రూ. 10 వేలు చెల్లిస్తూ గరిష్టంగా రూ. 11 వేల వరకు జీతాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఈ దోపిడీలో ఏజెన్సీలు, ఎంటమాలజీ విభాగం ఏఈ, ఎస్ఈలే కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. కరోనా సమయంలో మొత్తం 220 మంది కార్మికులను నియమించగా, ఇపుడు సుమారు 160 నుంచి 170 మంది వరకు కార్మికులు జీహెచ్ఎంసీలోని అన్ని జోన్లలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కార్మికులకు రోజువారీ వేతనంగా రూ. 800 చెల్లించాల్సి ఉండగా, మొత్తం నెల రోజుల్లో నాలుగు వీక్లీ ఆఫ్ లు మినహా మిగిలిన 26 రోజులు పని చేసినా, రూ.11 వేలకు మంచి జీతాలు చెల్లించటం లేదని కార్మికులు వాపోతున్నారు.
Also Read: Belt Shops: గద్వాల జిల్లాలో జోరుగా బెల్ట్ షాపుల దందా.. పట్టించుకోని ఎక్సైంజ్ అధికారులు
జీహెచ్ఎంసీలోని ఎంటమాలజీ విభాగంలో సుమారు ఆరేళ్ల నుంచి విధులు నిర్వహిస్తున్నఈ కరోనా టీమ్ కార్మికులకు ఇంత వరకు జీహెచ్ఎంసీ అధికారులు కనీసం ఈఎస్ఐ, పీఎఫ్ గాని వర్తింపజేయటం లేదు. కానీ కొన్ని జోన్లలో ఏజెన్సీలు, ఎంటమాలజీ విభాగం అధికారులు మీ ఖాతాల్లో పీఎఫ్ జమ అవుతుందని కార్మికులను నమ్మిస్తున్నట్లు తెలిసింది. గట్టిగా ప్రశ్నించే కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తామని ఎంటమాలజీ విభాగం లోని వీరిపై విధులు నిర్వర్తించే సూపర్ వైజర్లు, ఏఈ, ఎస్ఈలు బెదిరిస్తున్నట్లు తెలిసింది. వీరిలో కొందరికి ఎలాంటి సేఫ్టీ మెజర్స్ లేకుండా మూసీలో దింపటంతో విష పరుగులు కలిసి కొందరు చనిపోయినా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు. మరి కొందరు అంచు చిక్కని అనారోగ్యంతో మూలన పడుతున్నారు. కనీసం ఈఎస్ఐ వర్తింపజేసినా, తమకు ఆనారోగ్యం వచ్చినపుడు ఈఎస్ఐ హాస్పిటల్ లో చికిత్స పొందుతామని కార్మికులు వాపోతున్నారు.
ఈ కార్మికుల కాంట్రాక్టు ఏజెన్సీల గడువు వచ్చే నెలాఖరుతో ముగియనున్నట్లు తెలిసింది. గడువు ముగిసే ముందే తమను దోచుకున్న ఏజెన్సీల నుంచి బకాయిలను రికవరీ చేయాలని కార్మికులు బల్దియా కమిషనర్ ఆర్.వి. కర్ణన్ ను కోరుతున్నారు. టెండర్లలో తక్కువ ధరకు కోట్ చేసి, ఆ నష్టాన్ని మా జీతాల్లో కోత పెట్టి భర్తీ చేసుకోవడం ఎంతవరకు న్యాయమని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. గతేడాది టెండర్ల నుంచి ఇప్పటి వరకు జరిగిన దోపిడీపై విజిలెన్స్ విచారణ జరిపించి, అక్రమాలను వెలుగులోకి తేవాలని డిమాండ్ చేస్తున్నారు. ఏప్రిల్ నుంచి వచ్చే కొత్త ఏజెన్సీల విషయంలోనైనా టెండర్ నిబంధనలను కఠినతరం చేసి, తమ జీతాలు నేరుగా తమ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అయ్యేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. లక్షల రూపాయల కార్మికుల శ్రమ దోపిడీ జరుగుతున్నా, పర్యవేక్షించాల్సిన జోనల్ ఎస్ఈలు, ఎంటమాలజీ అధికారులు ఏ మాత్రం నోరు విప్పకపోవటం పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Also Read: PhonePe: ఇంటర్నెట్ లేకున్నా ఫోన్ పేలో చెల్లింపులు, అదెలా సాధ్యం, సామాన్యుడు ఏమంటున్నాడు?