GHMC Debts: స్వేచ్ఛ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న మూడు మున్సిపల్ కార్పొరేషన్ల ఏర్పాటు ముందున్న జీహెచ్ఎంసీ పరిధిలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు గత సర్కారు ప్రతిపాదించిన స్ట్రాటెజికల్ రోడ్ డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ), హైదరాబాద్ మహానగరాన్ని వరద ముంపు నుంచి కాపాడేందుకు ప్రతిపాదించిన స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆర్ డీపీ) కింద సిటీలో చేపట్టిన పలు ఫ్లై ఓవర్, అండర్ పాస్ ఇతరత్ర పనులను పూర్తి చేసేందుకు జీహెచ్ఎంసీ చేసిన అప్పులు ఎవరు చెల్లించాలి? ఎలా చెల్లించాలన్న విషయంపై సందిగ్ధత నెలకొంది.
గత ఫిబ్రవరి 11న ఏర్పడిన మూడు కార్పొరేషన్లకు ఆస్తులను పంచిన విధంగానే అప్పులను కూడా పంపిణీ చేయాలని భావించినా, దానిపై తుది నిర్ణయం ప్రభుత్వం తీసుకోవాల్సి ఉండగా, ఆ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి మొదలైన నూతన ఆర్థిక సంవత్సరంలో సర్కారు క్లారిటీ ఇస్తుందని జీహెచ్ఎంసీ భావించింది. కానీ అప్పులు చేసి చేపట్టిన అభివృద్ది పనులు సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల పరిధుల్లో కూడా జరిగినందున అప్పులను కూడా పంచుతారని అందరూ భావించారు. ప్రస్తుతం మిగిలిన అప్పు రూ. 4786 కోట్ల మేరకు ఉండగా, జీహెచ్ఎంసీ చేసిన మొత్తం అప్పులు రూ. 6553 కోట్లు కాగా, ఇందుకు జీహెచ్ఎంసీ ప్రతి నెల రూ. 110 కోట్లు అసలు, మిత్తీలతో కలిపి కుస్తీలను చెల్లిస్తూ వస్తుంది.
ఇపుడు మూడు కార్పొరేషన్లుగా పునర్విభజించినందున అప్పులను కూడా మూడు కార్పొరేషన్లకు పంచాలన్న విషయం సర్కారు వద్ద ప్రస్తావనకు వచ్చినపుడు జీహెచ్ఎంసీ ఆర్థిక పరిస్థితి బాగా లేనందున, ఆ అప్పులను చెల్లించేందుకు తాము సిద్దమేనని సర్కారు పరోక్షంగా సంకేతాలిచ్చినా, మూడు కార్పొరేషన్ల పరిధిలో జరిగిన అభివృద్ది పనుల కోసం చేసిన ఈ అప్పులు ఎవరు చెల్లించాలి? ఎలా చెల్లించాలన్న విషయంపై కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే సర్కారు క్లారిటీ ఇస్తుందని జీహెచ్ఎంసీ భావించినా, ఎలాంటి క్లారిటీ రాలేదు. ఫలితంగా మూడు కార్పొరేషన్ల పరిధిలో చేపట్టిన పనుల కోసం చేసిన అప్పులు జీహెచ్ఎంసీ ఒకటే చెల్సిస్తున్నందున జీహెచ్ఎంసీ ఆర్థికంగా కష్టాలు పెరుగుతున్నాయే తప్పా, ఆర్థికంగా ఏ మాత్రం అభివృద్ది సాధించలేకపోతుందని కొందరు జీహెచ్ఎంసీ అధికారులు బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. పైగా కొత్తగా ఏర్పడిన రెండు కార్పొరేషన్లకు ప్రత్యేకంగా పరిధులు, ఆస్తులను నిర్ణయించిన విధంగానే అప్పులను కూడా కార్పొరేషన్ల వారీగా పంచాలని కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు.
Also read: తమిళనాడు కాబోయే ముఖ్యమంత్రి విజయ్ పై లైలా ఇంట్రెస్టింగ్ కామెంట్స్…
మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, హద్దులు, ఆస్తులు, భవనాలు, మున్ముందు అవసరమైన స్టాఫ్ ప్యాట్రన్ కు సంబంధించి నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీ కసరత్తు ముగిసినట్లు విశ్వసనీయ సమాచారం. త్వరలోనే కమిటీ సర్కారుకు నివేదికను సమర్పించనున్నట్లు తెలిసింది. ఆ నివేదిక ప్రకారమే అప్పుల విషయంపై సర్కారు తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం మూడు కార్పొరేషన్ల పరిధుల్లో రెండు రకాల ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపు విధానాలు అమలవుతున్నాయి.
మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు కాకముందు, కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని 27 పట్టణ స్థానిక సంస్థలను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని గత సంవత్సరం నవంబర్ 25వ తేదీన సర్కారు ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి నేడు కోర్ అర్బన్ రీజియన్ లో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటైనా, విలీన ప్రాంతాల్లో ప్రాపర్టీ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం వర్తింపజేయగా, పాత జీహెచ్ఎంసీ పరిధిలో రెంటల్ విధానం ద్వారా ప్రాపర్టీ ట్యాక్స్ ను వర్తింపజేస్తున్నారు. మూడు కార్పొరేషన్లలో ఒకే యునిఫామ్ ట్యాక్స్ వర్తింపు విధానంపై కూడా సర్కారే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఆర్థిక సంవత్సరం ముగిసినా, సర్కారు ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Also read: తెలంగాణ మహిళలకు బంపర్ ఆఫర్.. జూన్ 2 నుంచి మహిళా కోటలు ప్రారంభం!