GHMC: భరత్ అనే నేను.. చూసే ఉంటారుగా. హీరో మహేశ్‌బాబు సీఎంగా స్ట్రిక్ట్ రూల్స్ పెడతారు. హెల్మెట్ పెట్టకోకపోతే ఇంతా.. రెడ్ సిగ్నల్ బ్రేక్ చేస్తే అంతా.. అంటూ వేలల్లో ఫైన్లు వేస్తాడు. అది సినిమా. హీరో ఏం చెబితే అది. కానీ, రియల్ లైఫ్‌లోనూ అలాంటి ఫైన్లు విధిస్తే? ఫైన్ కట్టేవాళ్లు వామ్మో అన్నా.. వ్యవస్థ గాడిన పడుతుందని అందరూ వెల్‌కమ్ చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ GHMC అలాంటి సంచలన నిర్ణయమే తీసుకుంది. నగరాన్ని క్లీన్ సిటీగా మార్చేందుకు.. కఠినమైన రూల్స్ తీసుకొచ్చింది. ఇకపై చెత్తే కదాని రోడ్ల పక్కన పడేస్తే.. వేలు, లక్షల్లో ఫైన్లు వసూల్ చేస్తారు తస్మాత్ జాగ్రత్త.
హైదరాబాద్ మహానగరం. సిటీ ఆఫ్ ఈవెంట్స్. కోటికిపైగా జనాభా. హైటెక్ హంగులతో అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ప్రాంతం. భాగ్యనగరం ఖ్యాతికి కొదవేం లేదు కానీ.. కొన్న ప్రాబ్లమ్స్ నగరం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తున్నాయి. వర్షం పడితే తెలుస్తుంది అసలు సంగతి. రోడ్లన్నీ డ్రైనేజ్ వాటర్‌తో మునకే. గంటల తరబడి ట్రాఫిక్ జామ్స్. ఇలాంటివే మరికొన్ని సమస్యలు. గల్లీల్లో, రోడ్ల పక్కన చెత్తాచెదారం. భరించలేని కంపు. రాళ్లు, మట్టి, పాత సామాన్లు, ఫుడ్ వేస్టేజెస్.. అబ్బో ఏదిపడితే అది.. వాళ్ల జాగీరే అన్నట్టు పడేస్తారు కొందరు. డే టైమ్‌లో నీట్‌గానే ఉంటుంది. రాత్రికి రాత్రి చెత్త వచ్చి చేరుతుంది. ఎవరేస్తారో తెలీదు. ఏ టైమ్‌లో పడేస్తారో అంతుపట్టదు. తెల్లారే సరికల్లా.. వీధుల్లో విధ్వంసమే. ఇకపై ఇలాంటి చెత్త పనులు సాగవు. చెత్తకు చెక్ పెట్టేలా జీహెచ్‌ఎమ్‌సీ కఠిన నిర్ణయాలు అమలు చేస్తోంది.
Also Read : హరీశ్‌రావు దెబ్బకు రోడ్డు మీద పడ్డ కేటీఆర్!?
గ్రేటర్ హైదరాబాద్‌లో బహిరంగంగా చెత్త వేయడంపై ఇప్పటికే నిషేధం ఉంది. వీధుల్లో కూడా డస్ట్ బిన్లు ఉండవు. ఎవరింటి చెత్త వారింట్లోనే సేకరించి ఉంచాలి. GHMC సిబ్బందే ఇంటింటికీ వచ్చి ఆ చెత్తను తీసుకెళ్తారు. ఇదీ పద్ధతి. రూల్ అయితే ఉంది కానీ.. చాలామంది పట్టించుకోవట్లేదు. రాత్రి వేళలో గప్‌చుప్‌గా చెత్త తెచ్చి రోడ్ల పక్కన, చీకటి ఉన్నచోట.. ఎవరూ చూడకుండా పడేస్తున్నారు. కొందరైతే భవన నిర్మాణ వ్యర్థాలను డబ్బాలకు డబ్బాలు తీసుకొచ్చి డంప్ చేస్తున్నారు. ఇకపై ఇలా డంప్ చేస్తే ఫైన్ ఎంతో తెలుసా? అక్షరాలా.. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు.
అవును, మీరు చదివింది నిజమే. హైదరాబాద్ రోడ్ల మీద చెత్త, కాంక్రీట్ వ్యర్థాలను వేస్తే లక్ష వరకూ ఫైన్ వేస్తోంది GHMC. జస్ట్ ఇది నామ్ కే వాస్తే రూల్ మాత్రమే కాదు. అధికారులు రెండు రోజులుగా సీరియస్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి.. చెత్త వేసే వారిని దొరకబడుతున్నారు. వారి నుంచి భారీగా ఫైన్లు వసూల్ చేస్తున్నారు. ఇలా రెండు రోజుల్లోనే 10 లక్షల రూపాయలకు పైగా వసూలు చేసింది GHMC. ఇందులో, రోడ్ల మీద చెత్త వేసినందుకు 5 లక్షల 41 వేల ఫైన్ వేయగా.. భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్ల మీద పడేసినందుకు 5 లక్షల 50 వేలు వేసింది. 2 డేస్ గ్యాప్‌లోనే ఏకంగా 259 చలాన్లు వేశారు శానిటేషన్, టౌన్ ప్లానింగ్ అధికారులు. GHMC కమిషనర్ ఇలంబర్తి సీరియస్ ఆదేశాలు ఇవ్వడంతో సిబ్బందంతా రోడ్లపై స్పెషల్ ఆపరేషన్ చేపట్టారు. అసలే అధికారులు.. భారీగా పైసలు వస్తాయంటే ఇక ఊరుకుంటారా? పోలీసుల్లా మాటు వేసి మరీ చెత్తగాళ్లను దొరకబట్టి ఫైన్లు బాదేస్తున్నారు. అందుకే, హైదరాబాదీలు జర జాగ్రత్త.. చెత్త కవరే కదాని పడేస్తే.. పీక కోయరు కానీ.. మీ జేబుకు బొక్క పెడతారు ఖబడ్దార్!!