Putin on Ukrainian Citizens : ఇప్పటి యుద్ధంతో పాటుగా గతంలో ఉక్రెయిన్ నుంచి స్వాధీనం చేసుకున్న భూభాగాలలోని పౌరులు రష్యాలో సురక్షితంగా ఉండాలంటే రష్యా పౌరసత్వం తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. లేదంటే అల్లకల్లోల పరిస్థితిలోని ఉక్రెయిన్ దేశానికి తిరిగి వెళ్లిపోవాల్సి ఉంటుందని అల్టిమేటం జారీ చేశారు.
గురువారం ప్రచురించిన అధ్యక్ష ఉత్తర్వు ప్రకారం, అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యాలోని ఉక్రెయిన్ పౌరులు సెప్టెంబర్ 10 నాటికి తమ ఇమ్మిగ్రేషన్ స్థితిని చట్టబద్ధం చేసుకోవాలని లేదా దేశం విడిచి వెళ్లాలని ఆదేశించారు. రష్యాలో ఉండేందుకు, ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు చట్టపరంగా పాస్ పోర్టు ఉపకరిస్తుందని వెల్లడించారు. రష్యా స్వాధీనంలోని ఉక్రెయిన్ పౌరులురాబోయే ఆరు నెలల 10 రోజుల్లో వారి చట్టపరమైన స్థితిని స్థిరపరచుకోకపోతే.. దేశాన్ని విడిచి వెళ్లిపోవాలని.. పుతిన్ జారీ చేసిన డిక్రీలో పేర్కొన్నారు.
ఈ ఉత్తర్వు 2022లో రష్యా.. తనలో విలీనం చేసుకున్నట్లుగా చెబుతున్న నాలుగు పాక్షికంగా ఆక్రమిత ప్రాంతాలైన – డోనెట్స్క్, లుహాన్స్క్, ఖెర్సన్, జాపోరిజ్జియా ప్రాంతాల పౌరులున్నారు. అలాగే 2014లో రష్యా స్వాధీనం చేసుకున్న క్రిమియాలోని ఉక్రెయిన్ పౌరులు సైతం పౌరసత్వాన్ని మార్చుకోవాలని, లేదంటే చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా హెచ్చరిస్తోంది. ఇప్పుడే కాదు.. చాన్నాళ్ల నుంచి ఆక్రమిత ప్రాంతాలలోని ఉక్రేనియన్లు రష్యన్ పౌరసత్వం తీసుకోవాలని రష్యన్ అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. గతేడాదే ఆక్రమిత ప్రాంతాలలో రష్యన్ పాస్‌పోర్ట్‌ల సామూహిక జారీని ప్రభుత్వం పూర్తి చేసిందంటూ పుతిన్ పేర్కొన్నారు.
రష్యన్ సైన్యం స్వాధీనం చేసుకున్న భూభాగాల్లో.. 3.5 మిలియన్ల మంది ఉక్రేనియన్ జాతీయులకు పుతిన్ ప్రభుత్వం.. రష్యన్ పాస్‌పోర్ట్‌లు జారీ చేసిందని ఆ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి వ్లాదిమిర్ కోలోకోల్ట్సేవ్ వెల్లడించారు. అయితే.. ఈ చర్యల్ని ఉక్రెయిన్ (Ukraine)తో సహా యూరోప్ లోని ఉక్రెయిన్ మిత్ర దేశాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. అయినా కానీ.. ఈ విషయంలో వెనక్కి తగ్గని పుతిన్ ప్రభుత్వం.. తన చర్యల్ని కొనసాగిస్తూనే ఉంది.
ఉక్రెయిన్ నుంచి అక్రమించిన ప్రాంతాల్లో రష్యా అమలు చేస్తున్న పాస్‌పోర్టైజేషన్ చర్యను చట్టవిరుద్ధమైన చర్య అని, ఇలా తమ పౌరులకు రష్యా పౌరసత్వం అందించడం.. ఉక్రెయిన్ సార్వభౌమత్వాన్ని తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుందని ఉక్రెయిన్ ఖండించింది. పాశ్చాత్య ప్రభుత్వాలు, మానవ హక్కుల సంఘాలు ఈ చర్యను ఖండించాయి. అంతే కాదు.. యూరోపియన్ యూనియన్ దేశాలు ఈ పాస్‌పోర్ట్‌లను చెల్లుబాటు అయ్యే ప్రయాణ పత్రాలుగా గుర్తించమని ప్రకటించాయి.
Also Read : Trump India Tariffs: భారత్ సుంకాలు తగ్గించాలి లేకుంటే.. ట్రంప్ వార్నింగ్
గత నెలలో ప్రవేశపెట్టిన వలస చట్టాల తర్వాత పుతిన్ ఈ ఉత్తర్వు జారీ చేశారు. దీని వల్ల రష్యన్ అధికారులు వలసదారులను బహిష్కరించడం సులభతరం అయ్యిందని చెబుతున్నారు. తాజా ఉత్తర్వు ప్రకారం, సెప్టెంబర్ 2022లో రష్యా విలీనానికి ముందు ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలకు వచ్చిన విదేశీ పౌరులు జూన్ 10లోపు మాదకద్రవ్య, HIV పరీక్షలు చేయించుకోవాలని పుతిన్ సర్కార్ ఆదేశించింది.