GHMC: స్వేచ్చ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని స్ట్రీట్ లైట్ల నిర్వహణకు ఏజెన్సీల ఎంపిక ప్రక్రియ మరో అడుగు ముందుకు పడింది. స్ట్రీట్ లైట్ల నిర్వహణకు సంబంధించి గతేడాది అంతర్జాతీయ సంస్థల నుంచి ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్టు (ఈఓఐ) లను స్వీకరించిన జీహెచ్ఎంసీ ఒక వైపు ఆన్ లైన్‌లో టెండర్లను సేకరిస్తూనే మరో వైపు ప్రీ బిడ్ మీటింగ్ ను నిర్వహించింది. ఈ మీటింగ్‌కు స్ట్రీట్ లైట్ల నిర్వహణలో అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన ఏజెన్సీలు సుమారు 25 వరకు హాజరైనట్లు అధికారులు వెల్లడించారు.
ముఖ్యంగా పిలిప్స్, కాంప్ర్టన్ గ్రీవ్స్ వంటి సంస్థలు కూడా హాజరై, తమ సేవలను వివరించారు. స్ట్రీట్ లైట్ల నిర్వహణలో మూడు కార్పొరేషన్ల పరిధిలో నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తున్న జీహెచ్ఎంసీ బిడ్లను సమర్పిస్తున్న ఏజెన్సీలకు తమ విధి విధానాలను ఏజెన్సీలకు వివరించింది. క్యూర్ పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సుమారు 7 లక్షల 61 వేల స్ట్రీట్ లైట్లలో దాదాపు 98 శాతం స్ట్రీట్ లైట్లు వెలిగేలా నిబంధనను విధించినట్లు తెలిసింది. దీంతో పాటు ఎక్కడా ఏ స్ట్రీట్ లైటు మరమ్మతుల పాలైన కేవలం 24 గంటల్లో గుర్తించి మరమ్మతులు చేసేలా మ్యాన్ పవర్, మిషనరీ కలిగి ఉండాలన్న నిబంధనను కూడా విధించినట్లు సమాచారం.
దీనికి తోడు క్యూర్ పరిధిలో లక్షల్లో స్ట్రీట్ లైట్లున్నా, వీటిలో వెలిగే స్ట్రీట్ లైటుకు మాత్రమే నిర్వహణ ఛార్జీలు చెల్లించనున్నట్లు జీహెచ్ఎంసీ ఏజెన్సీలకు, ఏజెన్సీల ప్రతినిధులకు తేల్చి చెప్పినట్లు సమాచారం. దీనికి తోడు బిడ్లను సమర్పిస్తున్న సంస్థలు, సంస్థలతో కూడిన కన్సార్టియంలు ఏడాదికి రూ. 400 కోట్ల టర్నోవర్ కల్గి ఉండాలన్న నిబంధనలను కూడా విధించింది. ఏడా వంద కోట్లలో టర్నోవర్ కల్గిన సంస్థలు మరమ్మతులకు సంబంధించిన సామాగ్రి బఫర్ కోటను ఈజీగా మెయింటెన్ చేస్తాయన్నది జీహెచ్ఎంసీ అధికారుల ఆలోచన.
Also Read: పురుషుల్లో ప్రొస్టేట్ క్యాన్సర్ ప్రమాదం.. ఈ 5 సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకూడదు
ప్రస్తుతం క్యూర్ సిటీ స్ట్రీట్ లైట్ల నిర్వహణలో వినియోగిస్తున్న సుమారు 34 వేల 512 సెంట్రల్ కమాండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీసీఎంఎస్) ప్యానెల్స్ ను కూడా నిర్వహణ బాధ్యతలు చేపట్టిన ఏజెన్సీలు కేవలం ఆరు నెలల్లో మార్చాలని కూడా టెండర్ల రూల్స్ లో జీహెచ్ఎంసీ సూచించింది. వీటితో పాటు ప్రస్తుతమున్న 7 లక్షల 61 వేల స్ట్రీట్ లైట్లన్నింటీని కేవలం రెండేళ్లలో ఎల్ఈడీ లైట్లుగా మార్చాలని కూడా నిబంధనను విధించారు. ఆన్ లైన్ లో స్వీకరిస్తున్న టెండర్లను వచ్చే నెల 3వ తేదీన ఓపెన్ చేసి అర్హత కల్గిన ఏజెన్సీలకు నిర్వహణ బాధ్యతలను కట్టబెట్టనున్నారు. దీంతో ఎట్టకేలకు 18 నెలలుగా అస్తవ్యస్తంగా మారిన క్యూర్ సిటీలోని లైట్ల నిర్వహణ కొలిక్కి వచ్చే అవకాశముంది.
స్ట్రీట్ లైట్లకు బిడ్లు సమర్పిస్తున్న ఏజెన్సీలకు లైట్లకు మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా మొత్తం 60 హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చే బాధ్యతలను కూడా ఏజెన్సీలకే అప్పగించారు. పాడైన స్ట్రీట్ లైట్లకు వీలైనంత త్వరగా మరమ్మతులు చేపట్టేందుకు వీలుగా తొలుత ఒక్కో సర్కిల్ కు ఒకటి చొప్పున హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చి, ఆ తర్వాత జీహెచ్ఎంసీ అభ్యర్తిసే మరో 30 హైడ్రాలిక్ క్రేన్లను సమకూర్చాలని కూడా జీహెచ్ఎంసీ సూచించింది. సర్కిల్ కు ఇద్దరు టెక్నిషియన్లను కేవలం సీసీఎంఎస్ నిర్వహణకు కేటాయించాలని సూచించింది. మొత్తం స్ట్రీట్ లైట్లు 7 లక్షల 61 వేలలో కనీసం 98 శాతం లైట్లు వెలిగేలా సర్వీసు లెవెల్ అగ్రిమెంట్ చేసుకునేందుకు సిద్దంగా ఉన్న ఏజెన్సీలే బిడ్లను సమర్పించాలని జీహెచ్ఎంసీ స్పష్టం చేసింది.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుతం ఉన్నతమైన ప్రమాణాలతో, అంతర్జాతీయ స్థాయి సంస్థలకు స్ట్రీట్ లైట్ల నిర్వహణ బాధ్యతలను అప్పగించేందుకు సిద్దమైన జీహెచ్ఎంసీ ఏజెన్సీలతో కాంప్రహెన్సివ్ ఆపరేషనల్ అండ్ మెయింటనెన్స్ ఒప్పందాన్ని కుదుర్చుకోనుంది. ఈ కాంట్రాక్టు కింద పదేళ్ల నిర్వహణకు రూ. 1341.60 కోట్లు వెచ్చించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని జీహెచ్ఎంసీ ద్వారా ఏటా పదిశాతం చొప్పున చెల్లించనున్నారు. ఈ మొత్తం బిల్లులను నోడల్ ఏజెన్సీ అయిన జీహెచ్ఎంసీ ద్వారా చెల్లింపులు జరగనున్నాయి. సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధిలోనున్న స్ట్రీట్ లైట్లను లెక్కకట్టి నిర్వహణ వ్యయాన్ని జీహెచ్ఎంసీకి చెల్లించేలా విధి విధానాలను సిద్దం చేశారు.
Also Read: కేద్రంలో బీజేపీ పతనం మొదలైది.. మంత్రి ఉత్తమ్ సంచలన హెచ్చరిక!