GHMC New Policy: మీ ఇంట్లో చెత్తను తీసుకువచ్చి రోడ్డుపై వేస్తున్నారా? అయితే మీ జేబులో డబ్బు రెడీ చేసుకోండి. జరిమానా చెల్లించేందుకు సిద్దం కండి. ఔను ఇది నిజం.. హైదరాబాద్ నగరంలో ఈ నిబంధన అమలు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది. నగరంలో పారిశుధ్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన జీహెచ్ఎంసీ సరికొత్త నిబంధన అమలు చేసేందుకు సిద్దమైంది. అయితే ఈ నిబంధన గ్రేటర్ హైదరాబాద్ పరిధి ప్రజలకు వర్తించనుంది.
హైదరాబాద్ నగర పరిధిలో ఇష్టారీతిన ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్న వారిని అరికట్టాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇప్పటి వరకు ఇలాంటి చర్యలకు పాల్పడే వారికి వందల రూపంలో జరిమానాలు విధించారు. ప్రస్తుతం ఆ జరిమానాలలో పలు మార్పులు తీసుకువచ్చారు. చెత్త రహదారులపై వేస్తే చాలు, అక్కడికి జీహెచ్ఎంసీ అధికారులు వాలిపోతారు. ఇందుకు ప్రత్యేక యాప్ ను జీహెచ్ఎంసీ రూపొందించింది. నగర వాసుల ఆరోగ్య రక్షణ దృష్టిలో ఉంచుకొని జీహెచ్ఎంసీ ఈ నిర్ణయం తీసుకుందని భావించవచ్చు.
నగరంలోని పలు రహదారులు నిత్యం చెత్తతో నిండి ఉంటున్న పరిస్థితి. ఆ దారిలో రాకపోకలు సాగించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. అలాగే నిత్యం రహదారిలో చెత్త నిండిపోవడంతో, వర్షాలు కురిసిన సమయంలో చెత్త తడిసి దుర్గంధం వచ్చే పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థితిలో దోమలు ప్రబలే అవకాశాలు ఎక్కువ. దీనితో ఆ రహదారుల వద్ద నివసించే వారికి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఏ రహదారిలో చెత్త వేసినా ఇక ఊరుకొనే ప్రసక్తే లేదని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది.
ముందుగా ఇలాంటి వాటికి హెచ్చరికలు, ఆ తర్వాత జరిమానాలు విధించేదుకు అధికారులు సిద్దమవుతున్నారు. జరిమానాలను విధించేందుకు యాప్ ను జీహెచ్ఎంసీ తెచ్చింది. ఆ యాప్ లో చెత్త వేసిన ప్రదేశం ఫోటో, జరిమానా విధించిన అధికారి వివరాలు, చెత్త రోడ్డుపై వేసిన వారి వివరాలను నమోదు చేస్తే చాలు.. జరిమానాకు సంబంధించి పూర్తి వివరాలు వచ్చేలా జీహెచ్ఎంసీ ప్లాన్ చేసింది. దీనితో జరిమానాల విధింపు సమయంలో పారదర్శకత పాటించే అవకాశం ఉంటుంది.
Also Read: Electricity Bill Save Tips: సమ్మర్‌లో ఇలా చేస్తే.. కరెంట్ బిల్ ఆదా !
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రోడ్ల మీదికి చెత్త, భవన నిర్మాణ వ్యర్ధాలు రాకుండా చూసేందుకు జిహెచ్ఎంసి ఈ ప్లాన్ అమలు చేస్తోందని చెప్పవచ్చు. చెత్త వేస్తే భారీగా చలాన్లు వేసేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. కాంప్రహెన్సీ చలాన్ మానిటరింగ్ సిస్టం పేరుతో యాప్ అందుబాటులోకి తీసుకు రాగా, ఇక నుండి చెత్త వేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు అధికారులు. మొదటిసారి భవన నిర్మాణ వ్యర్ధాలు రోడ్లమీదకి వేస్తూ కనిపిస్తే రూ. 25000, రెండోసారి రూ. 50,000, మూడోసారి లక్ష రూపాయల జరిమానా విధిస్తామని జీహెచ్ఎంసీ అధికారులు తెలుపుతున్నారు. ఇప్పటికే అందరూ మెడికల్ ఆఫీసర్లతో పాటు, డీ.ఈ లకు ట్రైనింగ్ ఇచ్చిన అధికారులు, ఇక నుండి చెత్త వేస్తే చాలు జరిమానా పర్వాన్ని సాగించనున్నారు. మీ ఇంటి ముందు రహదారి ఉంది కదా అంటూ చెత్త వేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. జరిమానా సిద్దం చేసుకోవాల్సిందే.