Hyderabad Flyover: స్వేచ్చ బ్యూరో: వేగంగా పట్టణీకరణ జరుగుతున్న హైదరాబాద్ మహానగరంలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు జీహెచ్ఎంసీ ప్రతిపాదించిన హెచ్ సిటీ పనులు ఒక్కోక్కటి ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటి వరకు నల్గొండ స్టీల్ ఫ్లై ఓవర్, మూసారాంబాగ్ బ్రిడ్జిల నిర్మాణ పనులు తుది దశలో ఉండగా, తాజాగా పాతబస్తీ నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్టుకు చేరుకునేందుకు ఎలాంటి ట్రాఫిక్ అడ్డంకుల్లేకుండా జీహెచ్ఎంసీ మరో ఫ్లై ఓవర్ ను నిర్మించేందుకు సిద్దమైంది. మైలార్ దేవ్ పల్లి నుంచి శంషాబాద్ రోడ్, కాటేదాన్ వరకు మూడు రద్దీ జంక్షన్లను కలుపుతూ ఆరు లేన్ల గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ నిర్మాణానికి ప్రతిపాదనలు తయారు చేసి సర్కారుకు పంపింది.
సుమారు రూ. 345 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ఫ్లై ఓవర్ కు సర్కారు పరిపాలనపరమైన మంజూరీ ఇవ్వగానే టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలు పెట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దంగా ఉంది. పరిపాలనా అనుమతి పెండింగ్ లో ఉన్నా, సమయం వృథా కాకుండా టెండర్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన అనుమతులు ఇప్పటికే ఖరారైనట్లు సమాచారం. ఈ ఆరు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే పాతబస్తీ, కంచన్ బాగ్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్డు వైపు వెళ్లే వాహనాల రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి. అలాగే మైలార్‌దేవ్‌పల్లి, కాటేదాన్, శంషాబాద్ రోడ్ జంక్షన్లలో నిత్యం నెలకొనే ట్రాఫిక్ రద్దీ చెక్ పడనుంది.
Also Read: భారతీయుల కోసం యూఏఈ వీసా ఆన్ అరైవల్.. ఎవరు అర్హులు, అవసరమైన పత్రాలేంటి?
మైలార్ దేవ్ పల్లిలో రూ.345 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గ్రేడ్ సెపరేటర్ ఫ్లై ఓవర్ నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే ఎల్బీనగర్, కంచన్ బాగ్, ఇబ్రహీంపట్నం, హయత్ నగర్ తదితర ప్రాంతాల నుంచి శంషాబాద్ ఏయిర్ పోర్డు వైపు వెళ్లే వాహానాల ఎక్కడా ఎలాంటి ట్రాఫిక్ జామ్ లేకుండా సజావుగా ప్రయాణించే వెసులుబాటు కల్గనుంది. ప్రస్తుతం ఓవైసీ ఫ్లై ఓవర్, చాంద్రాయణగుట్ట ఫ్లై ఓవర్లు దాటిన తర్వాత ఏయిర్ పోర్టుకు వెళ్లాల్సిన వాహానాలు మైలాల్ దేవ్ పల్లిలో ట్రాఫిక్ లో చిక్కుకుంటున్నాయి. ఈ ఫ్లై ఓవర్ అందుబాటులోకి వస్తే నేరుగా శంషాబాద్ ఏయిర్ పోర్డు చేరుకునే సౌకర్యం అందుబాటులోకి రానుంది. దీంతో వాహనదారులకు సమయం, ఇంధనం ఆదాయ కానుంది. పాతబస్తీ నుంచి కూడా ఏయిర్ పోర్డుకు వెళ్లేందుకు ట్రాఫిక్ కష్టాలకు చెక్ పడనుంది.
ఈ ఆరు లేన్ల ఫ్లై ఓవర్ నిర్మాణం కోసం పరిపాలనపరమైన మంజూరీ సర్కారు వద్ద పెండింగ్ లో ఉన్నప్పటికీ, టెండర్ల ప్రక్రియ చేపట్టేందుకు సర్కారు అనుమతి ఇవ్వటంతో జీహెచ్ఎంసీ అధికారులు పనిలో పనిగా స్థల సేకరణపై కూడా స్పెషల్ గా ఫోకస్ పెట్టారు. స్థలాలు సేకరించాల్సిన యజమానులకు ట్రాన్స్ ఫర్ డెవలప్ మెంట్ రైట్ (టీడీఆర్) కు ఒప్పుకునేలా జీహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. టీడీఆర్ లకు అనుమతించని పక్షంలో నష్టపరిహారం చెల్లించాలని కూడా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలిసింది.
Also Read: NEET Protest: మేడ్చల్లో గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ హైటెన్షన్.. రాజీనామా చేయాలని డిమాండ్!