E-Paper
Advertisement

GHMC Properties: ఆదాయంపై అశ్రద్ధ.. టెండర్ల ప్రక్రియపై అధికారుల అలసత్వం

GHMC Properties: ఆదాయంపై అశ్రద్ధ.. టెండర్ల ప్రక్రియపై అధికారుల అలసత్వం

GHMC Properties: స్వేచ్ఛ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు రౌండ్ ది క్లాక్ అత్యవసర సేవలందిస్తున్న జీహెచ్ఎంసీ(GHMC) ఇంకా పూర్తిగా ఆర్థిక సంక్షోభం నుంచి కోలుకోకముందే ఆదాయంపై కొన్నివిభాగాలు అశ్రద్ధ వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక వైపు చేసిన అప్పులకు అసలు మిత్తీలను చెల్లిస్తూ జీతాలు, పెన్షన్లు చెల్లించేందుకు సతమతమవుతున్న అధికారులు సైతం ఉన్న ఆదాయ వనరులను సక్రమంగా వినియోగించటంలో విఫలమవుతున్నట్లు వాదనలున్నాయి. ముఖ్యంగా ఇటీవలే కొత్తగా మరోసారి రూపాంతరం చెంది శంషాబాద్ వరకు విస్తరించి ఏర్పడిన జీహెచ్ఎంసీ పరిధిలో నేటికీ అన్ని సర్కిళ్లలో కలిపి సుమారు రూ. లక్షల కోట్ల విలువ చేసే ఆస్తులున్నాయి.

నామమాత్రం అద్దెకు..

వీటిలో కనిష్టంగా రూ. 5 వేల మొదలుకుని గరిష్టంగా రూ. 5 లక్షల వరకు అద్దెలు వచ్చే ఆఫీసు ప్రాంగణాలు, మలిగీలు, మార్కెట్ లోని స్టాళ్లున్నాయి. వీటిలో మున్సిపల్ మార్కెట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు, మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు వంటివి ఉన్నాయి. వీటిలో సుమారు సగానికి పైగా ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. ఆక్రమించుకుని ఉన్న మలిగీలు, ఆఫీసు ప్రాంగణాలు, మార్కెట్ లోని స్టాళ్లలో ప్రస్తుతం సబ్ లీజుదారులే తిష్ట వేసి ఉన్నారు. లీజు దారులు జీహెచ్ఎంసీ నుంచి ఏళ్ల క్రితం నామమాత్రం అద్దెకు వీటిని తీసుకుని, వీటిని సబ్ లీజుకిచ్చి ఇపుడు రూ.వేలు, లక్షల్లో అద్దెలు వసూలు చేసుకుంటున్నా, అధికారులు మాత్రం చూసీ చూడనట్టు వ్యవహారిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. అద్దె గడువు ముగిసినవి, ఖాళీగా ఉన్న వాటికి టెండర్లు చేపట్టి, వేరే వారికి కేటాయించేందుకు అధికారులు కనీసం టెండర్ల ప్రక్రియను కూడా చేపట్టలేకపోతుండం అద్దె గడువు ముగిసిన లీజుదారులకు, సబ్ లీజుదారులకు వరంగా మారుతుంది. వందల సంఖ్యలో భవనాల్లోని వేలాది మలిగీలు ఏళ్ల నుంచి ఖాళీ ఉండటంతో టెండర్లు చేపట్టి అద్దెలకు కేటాయించాలని ఆయా సర్కిళ్ల డిప్యూటీ కమిషనర్లకు ఇప్పటి వరకు ఉన్నతాధికారులు మూడు సార్లు రిమైండర్లను పంపినా, ఏ మాత్రం స్పందన లేదు.

ఏడాది క్రితం..

గత సంవత్సరం తక్కువ కాలం కమిషనర్ గా సేవలందించిన అప్పటి కమిషనర్ అమ్రపాలి ప్రతి రోజు జీహెచ్ఎంసీ శానిటేషన్ పనుల పరిశీలనతో పాటు ప్రాజెక్టు పనులను తనిఖీ నిర్వహించేందుకు చేపట్టిన మార్నింగ్ వాక్ లో చిక్కడపల్లిలోని ఆధునీక మున్సిపల్ మార్కెట్ ను నిర్మించినా, అద్దెదారులకు కేటాయించకోవటంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఆమె వెంటనే టెండర్లు చేపట్టి, అద్దెకు కేటాయిస్తే జీహెచ్ఎంసీకి నిధులు సమకూరుతాయని ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు హడావుడిగా ఒక సారి టెండర్ల ప్ర్రక్రియ చేపట్టారు. అద్దెదారులెవ్వరూ ముందుకు రాకపోవటంతో టెండర్లు ప్రక్రియ చేపట్టేందుకు కూడా సాహసించటం లేదు. ఇందుకు సంబంధించి చిక్కడపల్లిలో సర్వ హంగులతో నిర్మించిన మార్కెట్ కాంప్లెక్స్ కు తగినంత పార్కింగ్ స్పేస్ లేకపోవటంతో అద్దెదారులు ముందుకు రాలేదని తెలిసింది.

Also Read: Gajwel District Hospital: గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స.. శభాష్..!

ఫుత్లీబౌలీలోని జీహెచ్ఎంసీ భవనం

సిటీలోని ఇతర వ్యాపార సంస్థలకు వ్యాలెట్ పార్కింగ్ సిస్టమ్ ను అమలు చేస్తున్న జీహెచ్ఎంసీ తన సొంత ఆస్తులను అద్దెకిచ్చి, ఆదాయం పెంచుకునేందుకు తన మార్కెట్ భవనాలకెందుకు వ్యాలెట్ పార్కింగ్ సిస్టమ్ ను అమలు చేయటం లేదన్న ప్రశ్న తలెత్తుతుంది. ఫుత్లీబౌలీలోని జీహెచ్ఎంసీ భవనంలోని కొన్ని మలిగీలతో పాటు సిటీలో ఆకాశాన్నంటే స్థాయిలో భూమి ధరలున్న ఆబిడ్స్ లోని జీహెచ్ఎంసీ భవనంలో ఏళ్ల నుంచి పలు మలిగీలు ఖాళీగా ఉన్నట్లు తెలిసింది. వీటితో పాటు హరిహర కళాభవన్, బుద్ద భవన్ లలో కూడా పలు మలిగీలు ఖాళీగా ఉండగా, వీటిలో కొన్ని బడా సంస్థలు పాలక మండలి అధికారంలో ఉన్నపుడే లీజును ఎక్స్ టెన్షన్ చేసుకోగా, మిగిలిన వాటిలో పాత అద్దెదారులే కొనసాగుతున్నారు. మరి కొన్ని ఖాళీగా పడి ఉండటంతో జీహెచ్ఎంసీ అద్దెల రూపంలో రావాల్సిన ఆదాయం కూడా ఆగిపోయింది.

ఆదాయం పెరిగినట్టే పెరిగి..

జీహెచ్ఎంసీ ఆస్తుల లీజుకు కేటాయించటం, ప్రతి నెల అద్దెలు చెల్లించటం వంటి బాధ్యతలను పకడ్బందీగా నిర్వహించేందుకు జీహెచ్ఎంసీలో ఎస్టేట్ విభాగాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి, దానికో అదనపు కమిషనర్ ను సైతం నియమించారు. గత సంవత్సరం నవంబర్ మాసంలో జీహెచ్ఎంసీకి కమిషనర్ గా ఇలంబర్తి వచ్చిన తర్వాత ఆయన చేసిన వత్తిడి, ఇచ్చిన టార్గెట్ల ప్రకారం 2023-24 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.4 కోట్లకే పరిమితమైన ఎస్టేట్ ఆదాయం ఆయన వచ్చిన తర్వాత లీజుదారులు, సబ్ లీజుదారులకు నిర్వహించిన హియరింగ్ కార్యక్రమాలు మంచి ఫలితాలనిచ్చాయి. ఏళ్ల తరబడి పెండింగ్ లోఉన్న అద్దెలు వసూలు కావటంతో 2024-25 ఆర్థిక సంవత్సరం డిసెంబర్ నెలాఖరు కల్లా ఎస్టేట్ ఆదాయం రూ.6 కోట్లకు ఆకస్మికంగా పెరిగింది. మార్చి నెలాఖరు కల్లా రూ. 10 కోట్లు దాటించాలన్న టార్గెట్ పెట్టుకున్న అధికారులు ఉన్నట్టుండి ఒక్కసారిగా తుస్సుమన్నారు.

మున్సిపల్ కార్పొరేషన్లుగా..

ఆ తర్వాత 2025-26 ఆర్థిక సంవత్సరం కొనసాగుతున్నా, సమకూరిన ఆదాయం అంతంతమాత్రమే. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పలు ప్రాంతాల్లోని సుమారు 400 మలిగీలను రెండేళ్ల చొప్పున అద్దెకు ఇచ్చేందుకు టెండర్లు చేపట్టాల్సి ఉండగా, ప్రస్తుతం ఎస్టేట్ విభాగం అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకుండా పక్కన బెట్టారు. కొద్ది నెలల క్రితం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించి, జీహెచ్ఎంసీలోకి 27 పట్టణ స్థానిక సంస్థలను ఎంతో వేగంగా విలీనం చేసి, ఆ తర్వాత వార్డుల పునర్విభజనను కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముగించి, చివరకు ఎవరి నుంచి ఎలాంటి అభ్యంతరాలు గానీ, వివాదాలు గానీ లేకుండా జీహెచ్ఎంసీ పరిధిని జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించిన కమిషనర్ ఆర్.వి. కర్ణన్ చొరవ తీసుకుని, జీహెచ్ఎంసీ ఆస్తులను డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ముమ్మరం చేసి, టెండర్ల ప్రక్రియ చేపట్టి ఆదాయాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టాలని జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బంది బహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు.

Also Read: HYDRAA: హైడ్రా మార్క్ మ్యాజిక్.. కూకట్‌పల్లి వాసులకు సీఎం రేవంత్ రెడ్డి కానుక

Related News

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Operation Khazana: నక్సలైట్ల బంగారం కోసం.. భద్రతా బలగాలు కూంబింగ్..!

‘అధికారం పోయిన బలుపు తగ్గలేదు’ .. కేటీఆర్‌పై కడియం శ్రీహరి ఘాటు వ్యాఖ్యలు

Big Stories

×